వినాయకుని అనేక రూపాలు, నామాలు ఉన్నాయి. అన్నిటిలో లంబోదర గణపతి రూపం అత్యంత శుభ కరమైనది. ఈ రూపాన్ని ‘లం’, ‘రం’, ‘గం’ అనే బీజాక్షరాల ప్రాతిపదికగా ప్రార్థించాలని వేదాలు చెబుతున్నాయి.
‘లం’- పృథ్వీ బీజం. మన దైనందిన సమస్యలను తీర్చడంలో ఉపకరిస్తుంది.
‘రం’- అగ్ని బీజం.
‘గం’- ప్రధానమైన ప్రథమ బీజాక్షరం. విఘ్నాలను తొలగిస్తుంది.
గాణాపత్యం సంప్రదాయానుసారం గణము అనగా సత్త్వ రజస్తమో గుణ మిశ్రమం. ఈ త్రిగుణాధిపతి విఘ్నేశ్వరుడు. పురాణేతిహాసాలను బట్టి సకల దేవతా గణాలకు అధిపతి కనుక ఆ విధంగా కూడా గణపతి నామం సార్థకం.
విఘ్నేశ్వరుడు విఘ్నాలు కల్పించడానికి, నివారించడానికి కారకుడని ప్రసిద్ధి. అందుకే చేపట్టిన కార్యాలలో విఘ్నాలు కలగకుండా తొలిగా వినాయకుడిని పూజించే ఆచారం ఏర్పడింది.
‘సర్వదేవమయ సాక్షాత్ సర్వమంగళదాయకః
మాఘ కృష్ణ చతుర్థ్యాం తు ప్రాదుర్భూతో గణాధిపః’
పృథ్వీతత్వ్తం గలవారు ప్రధానంగా పరమేశ్వరుడిని, జలతత్త్వం ప్రధానంగా గలవారు గణపతిని, తేజత్త్వం ప్రధానంగా గలవారు దుర్గాదేవిని, వాయుతత్త్వం ప్రధానంగా గలవారు సూర్యుడిని, ఆకాశతత్త్వం ప్రధానంగా గలవారు విష్ణువును పూజిస్తారు. కేవలం ఒక దేవతా మూర్తి అయిన విఘ్నేశ్వరునికి ఏ శుభకార్యా ఆరంభంలోనైనా తొలి పూజ గావించడం పాంచభౌతిక శరీరులైన ప్రాణులకు అవశ్య కర్తవ్యం. కనుకనే సకలతత్త్వ ప్రదీపకుడైన గణపతిని కింది విధంగా అర్చిస్తారు-
ఆదిత్యం గణనాథంచ
దేవీరుద్రంచ కేశవమ్
పంచదైవ మిత్యుక్తమ్
సర్వకర్మ సు వినాయక పూజయేత్
గణపతి దేవుని కృప వలన సకల భక్తకోటికి ఐహికాధ్యాత్మిక సంపత్తులు అందుతాయి. ఆ భావాన్ని దిగువ స్తుతిలో దీప్తిమంతంగా చెప్పారు.
సిద్ధ్యంతి సర్వకార్యాణి
మనసాచించితాన్యపి
తేన ఖ్యాతిమ్ గతోలోకే నామ్నా సిద్ధివినాయకాః
భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం వహించిన విఘ్నేశ్వరుడిని యథావిధిగా ఏకవింశతి (21) పత్రాలతో అర్చించి, తరించడం భారతావని ఆచారం.
‘ప్రణమ్యం శిరసాదేవం
గౌరీపుత్రం వినాయకం’ అని గణపతి స్తుతి.
వినాయకుడిని ‘శుక్లాంబరధరం విష్ణుం’ అని ప్రార్థిస్తాం. విష్ణువు అంటే అంతటా వ్యాపించిన వాడని అర్థం. గణపతి కూడా విష్ణువు మాదిరిగానే సర్వ వ్యాపకత్వం ఉన్న వాడు. అందుకే గణపతి గురించి చెప్పేటప్పుడు ఈ శ్లోకం చదువుతారు. అది-
శ్రీకాంతో మాతులోయస్య.. జననీ సర్వమంగళా జనకః శంకరో దేవః
తం వందే కుంజరాననం శ్రీకాంతో మాతులోయస్య
అంటే- గణపతికి మేనమాస శ్రీకాంతుడు. శ్రీకాంతుడంటే స్వయంగా విష్ణువు. అంటే లక్ష్మీదేవి పతి. తత్వపరంగా శ్రీహరి, పార్వతి అన్నాచెల్లెళ్లు. మరి, వాళ్లిద్దరూ ఒకే తల్లి కడుపున ఎప్పుడైనా పుట్టారా? అంటే, పుట్టారనే చెప్పాలి. భాగవతం ప్రకారం నందుడు, యశోదలకు యోగమాయ, శ్రీకృష్ణుడు ఒకేసారి పుట్టారు. ఈ యోగమాయయే పార్వతీదేవి. ఈమె కుమారుడు గణపతి. ఈ విధంగా నారాయణుడికి విఘ్నేశ్వరుడు మేనల్లుడు అవుతాడు. అందువల్ల వినాయకుడిని పూజిస్తే అటు లక్ష్మీనారాయణులను, ఇటు శివపార్వతులనూ పూజించిన ఫలం కలుగుతుంది.
లంబోదర రూపంలోని గణపతి ఉదర సంబంధమైన వ్యాధులను నయం చేయడంలో ధన్వంతరి పాత్ర కూడా పోషిస్తాడని ప్రతీతి. గణపతి గొప్పదనం గురించి తెలుసుకోవాలంటే శివపురాణంలోని 18వ అధ్యాయం చదవాలి.
Review గౌరీ పుత్రం వినాయకం.