జ్ఞానార్జనకి వయస్సుతో నిమిత్తం లేదు

జీవితంలో చివరికంటా విజ్ఞానం, ధనం సంపాదిస్తూనే ఉండాలి, నలుగురికీ పంచుతూనే ఉండాలని, మరుక్షణం నాదికాదు – అనుకొని కర్తవ్యాలు నిర్వహించాలనీ సందేశమిచ్చే శ్లోకం ఇది.
శ్లో।। అజరామరవత్‍ ప్రాజ్ఞో, విద్యామర్థం చ సాధయేత్‍ ।
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్‍ ।।
‘‘వ•సలితనంగానీ, మరణంగానీ నాకు అంటదు’’, అనే భావనతో జ్ఞానాన్ని, ధనాన్ని నిరంతరం ఆర్జిస్తూనే వుండాలి. దానధర్మాల విష యంలో మాత్రం మృత్యువు జుట్టుపట్టుకొని లాగుతోందనే తొందరతో (ఇప్పుడే) వ్యవహరించాలి.
ధర్మం ఆచరించేటప్పుడు, ఏదైనా దానం చేయాలనుకొన్నప్పుడూ… ‘‘ఏ నిమిషానికి ఏమి జరుగునో…’’ అనుకొని, ‘‘మృత్యువు ఎప్పుడైనా నన్ను కబళించగలదు. తత్‍క్షణమే ఈ పుణ్యకార్యం పూర్తి చేయాలి’’ అనే ఆలోచనతో వ్యవహరించాలి.
మహాభారతంలో (పాత్రల పేరుతో) ప్రసిద్ధమైన ఈ కథ – మంచిపనిని వాయిదా వేయవద్దనే సందేశాన్నిస్తుంది.
ధర్మజుని కొలువుకి, ఓ పేద బ్రాహ్మణుడు సాయంకోసం వెళ్లాడట. మరో పనిలో నిమగ్నుడై వున్న రాజు, అతనిని ‘మరునాడు’ రమ్మన్నాడు. వట్టిచేతుల్లో వెళ్తోన్న ఆ పండితుని చూసిన భీమసేనుడు ఆ విషయం తెలుసుకొని, అతన్ని కూడా తీసుకొనివెళ్లి, రాజభవనంలో వున్న ఓ ‘ధర్మఘంటను’ గట్టిగా మ్రోగించటం మొదలెట్టాడట. ఆ అలజడికి కోటలో ప్రముఖులంతా, ధర్మజునితో సహా అక్కడికి వచ్చిచేరారట. రాజు ఎవరిపైనైనా విజయం సాధించినప్పుడు మ్రోగించే విజయఘంట అది. ఎవరు విజయం సాధించారని, ధర్మరాజు భీమున్ని అడిగాడు. దానికి, ‘‘మీరే ధర్మరాజా! ఈ బ్రాహ్మణుడు సహాయం కోరి వస్తే మీరు రేపు రమ్మన్నారట. రేపటి వరకు జీవించే వుంటారని ఎంతో నమ్మకం వున్న మీరు, మృత్యువుపై విజయం సాధించారు’’ అన్నాడు వ్యంగ్యంగా. ధర్మరాజుకి విషయం అర్థమయ్యింది.
పండితుని తగిన విధంగా సత్కరించి పంపాడట. ధర్మకార్యాలకు వాయిదా పనికిరాదని చెప్పిన కథ ఇది.

Review జ్ఞానార్జనకి వయస్సుతో నిమిత్తం లేదు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top