జ్ఞాన శక్తికి ప్రతీక శక్త్యాయుధం

తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు? ఆధ్యాత్మికంగా తమలపాకుల ప్రాధాన్యం ఏమిటి?

హిందూధర్మంలో తమలపాకులను అష్ట మంగళాలలో (1.పూలు, 2.అక్షింతలు, 3.ఫలాలు, 4. అద్దం, 5.వస్త్రం, 6.తమలపాకు మరియు వక్క, 7.దీపం, 8.కుంకుమ) ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో, సంప్రోక్షణ చేసేటపుడు తమలపాకులనే వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్ఠింప చేస్తారు. భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటపుడూ, భోజనానంతరం తమలపాకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.
ఇక, తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యమైనదంటే- క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణంలో చెప్పారు. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి. తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.
ఇక, తమలపాకులోని ఏయే భాగాలలో ఏయే దేవతలు ఉంటారో తెలుసుకుందాం.

తమలపాకు పై భాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.
సరస్వతీదేవి తమలపాకు మధ్య భాగంలో ఉంటుంది.
తమలపాకు చివరిలో మహాలక్ష్మీదేవి ఉంటుంది.
జ్యేష్టాదేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.
విష్ణుమూర్తి తమలపాకు అంతటా ఉంటాడని ప్రతీతి.
శివుడు, కామదేవుడు తమలపాకు పై భాగంలో ఉంటారు.
తమలపాకులోని ఎడమ వైపున పార్వతీ దేవి, మాంగల్యదేవి ఉంటారు.
భూమాత తమలపాకుకు కుడి భాగంలో ఉంటుంది.
సుబ్రహ్మణ్యస్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు.
ఇవన్నీ శాస్త్రంలో ఉన్న విషయాలు.

సుబ్రహ్మణ్యస్వామి చేతిలో ఉండే శక్త్యాయుధం విశేషాలేమిటి?

సుబ్రహ్మణ్యుని (కుమారస్వామి) చేతిలో ఉండే ఆయుధం పేరు శక్త్యాయుధం. దీనికే జ్ఞాన శక్త్యాయుధమనీ పేరు. ఈ ఆయుధంలో రెండు విశేషాలుంటాయి. జ్ఞానం, శక్తి. అసలు జ్ఞానానికే పెద్ద శక్తి ఉంది. ఎంతటి శక్తి ఉందీ అంటే ఎవరూ ఛేదించలేని అజ్ఞానాన్ని ఛేదించడమే జ్ఞానం యొక్క శక్తి. అలా జ్ఞానశక్తి ఆయన యొక్క ఆయుధం. ఇలా భావన చేసినపుడు ఆయన గురు స్వరూపంగా కనిపిస్తాడు.

అసుర సంహారం చేసినటువంటి మహా ప్రతాపమూర్తి ఆయన. ‘సేనానీనాం అహం స్కంద’ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. సేనానులలో నేను స్కందుడినని ఆయన అంటాడు. సుబ్రహ్మణస్వామికే స్కందుడనీ పేరు. చెల్లాచెదురైన దేవసేనలన్నిటినీ ఒక్కచోటకు చేర్చి, వారందరికీ తాను బలమై, బలాన్నిచ్చి నడిపించి అసుర శక్తులను సంహరించాడాయన. అందుకే ఎప్పుడైనా సరే కాలంలోనూ, దేశంలోనూ ప్రపంచాన్ని బాధించే అసుర శక్తులు ఉన్న వేళ సుబ్రహ్మణ ఆరాధన చేస్తే వెంటనే ఆ బాధలు తొలగి దేశానికీ, కాలానికీ, వ్యక్తికీ కూడా క్షేమం లభిస్తుంది. అలాంటి క్షేమం కావాల్సిన వారు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి. దీనివల్ల మనల్ని బాధించే శక్తులు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్యుడు శివశాక్త్యాత్మకంగా ఆవిర్భవించాడు. ఆయన ఆవిర్భావంతో దేవతలందరికీ బలం వచ్చింది. అసలు బలమే ఆయన యొక్క స్వరూపం. అందుకే ఆయన దేవ సేనాని అయ్యాడు. అటువంటి సేనానికి ఎవరైతే నమస్కరిస్తారో వారికి మొత్తం దేవతా సమూహం అంతా కూడా రక్షణనిస్తుంది. అందుకే ఆయన శక్త్యాయుధాన్ని ‘ప్రథమో జ్ఞాన శక్త్యాత్మా’ అని ప్రార్థిస్తారు.

Review జ్ఞాన శక్తికి ప్రతీక శక్త్యాయుధం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top