షిర్డీ సాయిబాబా దేహత్యాగం చేసి, 2019, అక్టోబరు 8 నాటికి నూట ఒకటి (101) సంవత్సరాలు. అంటే, ఈ ఏడాది దసరా.. బాబా వారి 101వ పుణ్యతిథి కాబోతోంది. బాబా మహా సమాధి చెందినది దసరా (విజయ దశమి) నాడే. అందుకే ఏటా దసరా నాడు బాబా పుణ్యతిథిగా భావించి షిర్డీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈసారి 101వ పుణ్యతిథి సందర్భంగా నాలుగు రోజుల (2019, అక్టోబరు 7,8,9,10 తేదీలలో) పాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రణాళిక రచించింది. సాయిబాబా 1918 సంవత్సరం, ఆశ్వయుజం, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భౌతిక శరీరాన్ని విడిచారు. కాగా, బాబా కాయాన్ని విడిచిన రోజు నాడు మంగళవారమే కాగా, ఈ దసరా పర్వదినం, ఆయన పుణ్యతిథి కూడా మంగళవారమే (దసరా: అక్టోబరు 8, 2019) కావడం విశేషం.
1916 సంవత్సరం, విజయదశమి నాటి సాయంకాలం షిర్డీ గ్రామస్తులంతా సీమోల్లంఘనం (గ్రామ సరిహద్దును దాటడం) చేసి తిరిగి వస్తుండగా, సాయిబాబా హఠాత్తుగా కోపోద్రిక్తులయ్యారు. తలగుడ్డ, కఫనీ, లంగోటీ తీసి చించి ధునిలోకి విసిరివేశారు. భాగోజీ శిందే అనే భక్తుడు బాబా వద్దకు నెమ్మదిగా వెళ్లి ఆయనకు లంగోటీని చుట్టి ఇలా అన్నాడు- ‘బాబా! సీమోల్లంఘనం నాడు ఇదంతా ఏమిటి?’
‘ఈ రోజు నా సీమోల్లంఘనం’ అంటూ బాబా మరింత ఆగ్రహంతో సటకాతో నేలపై గట్టిగా కొట్టారు. బాబా ఆ రోజు రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. తరువాత సాధారణ స్థితికి వచ్చి దుస్తులు వేసుకుని, చావడి ఉత్సవానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా సాయిబాబా తాము దసరా నాడు మహా సమాధి చెందుతామని సూచనప్రాయంగా భక్తులకు తెలియచేశారు. కానీ, అప్పట్లో ఇది ఎవరికీ అర్థం కాలేదు. అలాగే, తాను దేహత్యాగం చేయనున్నట్టు మరో సూచన కూడా చేశారు.
బాబా భక్తుడైన రామచంద్ర పాటీలు అప్పటికి జబ్బుపడ్డాడు. ఒకనాడు నడిరేయి బాబా అతనికి కలలో కనిపించి- ‘నీ చావుచీటీ తీసివేశాను. త్వరలోనే బాగుపడతావు. కానీ తాత్యాకోతే పాటీలు గురించి సంశయిస్తున్నాను. అతను శక సంవత్సరం 1840 (1918) విజయదశమి నాడు మరణిస్తాడు. ఇది ఎవరికీ తెలియనివ్వకు. ముఖ్యంగా వాడి (తాత్యాకోతే పాటీలు)కి కూడా తెలియనివ్వకు’.
1918 సంవత్సరం ఆశ్వయుజ మాసం సమీపించసాగింది. బాబా చెప్పినట్టే తాత్యాకోతే పాటీలు జబ్బుపడ్డాడు. బాబా కూడా అదే సమయంలో జ్వరంతో ఉన్నారు. విజయదశమి నాటికి తాత్యా నాడి మరింత బలహీనపడింది. అతను ప్రాణం విడుస్తాడని అంతా అనుకున్నారు. ఇంతలో ఆశ్చర్యం.. ఉన్నట్టుండి తాత్యాకోతే పాటీలు కోలుకున్నాడు. అతనికి మరణం తప్పింది. అతనికి బదులుగా ఆ సమయంలో సాయిబాబా దేహ త్యాగం చేశారు. అంటే, సాయిబాబా తాత్యాకోతే పాటీలును బతికించడం కోసం తన దేహాన్ని తాగ్యం చేశారన్న మాట.
ఆ మర్నాడు అక్టోబరు 16న, పండరీపురంలో దాసగణుకు బాబా స్వప్నంలో కనిపించి- ‘దాసగణూ! మసీదు కూలిపోయింది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టారు. కనుక ఆ స్థలాన్ని విడిచి పెట్టాను. వెంటనే అక్కడకు వెళ్లు. నన్ను సరిపడా పుష్పాలతో కప్పు’ అన్నారు. దాసగణు గుండె ఆగినంత పనైంది. అంతలో షిర్డీ నుంచి వచ్చిన ఉత్తరం ద్వారా కూడా దాసగణుకి బాబా మహా సమాధి చెందారనే విషయం తెలిసింది.
కర్తవ్యం ముగియగానే.. బాబా తాను మహా సమాధి చెందడానికి, అంటే విజయదశమికి రెండు మూడు రోజుల ముందు నుంచీ గ్రామం బయటకు వెళ్లడం, భిక్షాటన మాని మసీదులోనే కూర్చుండేవారు. రోజూ కాకాసాహెబు దీక్షిత్, శ్రీమాన్ బూటీ బాబాతో కలిసి మసీదులో భోజనం చేస్తుండే వారు. ఆనాడు (1918, అక్టోబరు 15) హారతి ఇచ్చిన పిమ్మట వారిని తమ తమ బసలకు వెళ్లిపోవాలని, అక్కడే భోజనం చేయాలని బాబా సూచించారు. లక్ష్మీబాయి శిందే, భాగోజీ శిందే, బయ్యాజీ, లక్ష్మణ్ బాలాషింపీ, నానాసాహెబు నిమోన్‍కర్ మాత్రం సాయిబాబా వద్దనే, ఆయననే అంటిపెట్టుకుని ఉన్నారు. మసీదు కిందుగా ఉన్న మెట్లపై మాధవరాదేశ్‍పాండే (శ్యామా) కూర్చుని ఉన్నాడు. అంతలో బాబా తన భక్తురాలైన లక్ష్మీబాయి శిందేకు తొమ్మిది (9) రూపాయలను దానం చేశారు. అనంతరం తనకు ఆ స్థలం (మసీదు) బాగా లేదని, అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని వెళ్లాలని, అక్కడైతే తనకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. ఈ తుది పలుకులు చెబుతూనే సాయిబాబా బయ్యాజీ అప్పాకోతేపై ఒరిగి ప్రాణాలు విడిచారు. బాబా ఇక లేరనే విషయాన్ని భాగోజీ కనిపెట్టాడు. ఈ సంగతిని నానాసాహెబు నిమోన్‍కర్‍కు చెప్పాడు. నానాసాహెబు వెంటనే నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోశాడు. అవి బయటకు వచ్చేశాయి.
నానాసాహెబు బిగ్గరగా- ‘నా దేవా!’ అని అరిచాడు.
అంతలో సాయిబాబా కళ్లు తెరిచి మెల్లగా ‘ఆ’ అన్నారు.
బాబా భౌతికదేహం విడిచారనే వార్త షిర్డీ అంతా వ్యాపించింది. బయ్యాజీ అప్పాకోతేపై సాయిబాబా దేహం ఒరిగి ఉంది. ప్రజలందరూ, స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు వెళ్లి రోదించసాగారు. కొందరు బిగ్గరగా రోదించారు. కొందరు వీధులలో దిక్కులేని వారుగా తిరుగుతూ విలపించారు. ఇంకొందరు బాబా లేరనే విషయాన్ని తట్టుకోలేక తెలివి తప్పి పడిపోయారు. అందరి కళ్ల నుంచి నీళ్లు కాలువల్లా పారాయి. అందరూ విచారగ్రస్తులయ్యారు. కొందరు సాయిబాబా చెప్పిన మాటలను ఆ సమయంలో జ్ఞాపకం చేసుకోసాగారు. మునుముందు ఎనిమిది సంవత్సరాల బాలునిగా ప్రత్యక్షమవుతానని బాబా తమ భక్తులతో చెప్పగా తాను ఒకసారి విన్నానని ఒకరు అన్నారు. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరూ సందేహించ వలసిన అవసరం లేదు.
విజయదశమి నాడు శ్రీ సాయి సచ్చరిత్రలోని సమాధి లీలను పారా యణం చేసే వారికి సాయిబాబా సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది.
Review దసరా నాడే..బాబా దేహ త్యాగం.