‘దాన’ సంపదే మిన్న

అన్ని గుణాల్లోనూ దానగుణమే ఉత్తమోత్తమమైనది. భారతీయ సంస్క•తిలో దానిది మహిమాన్విత స్థానం. సనాతన ధర్మానికి అదే ప్రధాన సూత్రం. మానవ హితానికి మన పెద్దలు అనేక ధర్మాలను ఏర్పరిచారు. వాటిలో దానగుణ ధర్మం ఒకటి. అలాగే, షిర్డీ సాయిబాబా దానగుణ భావాన్ని తన భక్తుల్లో ఎంతగానో నాటుకునేలా పలు ఉదంతాలను నిదర్శనంగా చూపించారు. స్వయంగా తాను దానధర్మాలను ఆచరించారు.

దానగుణం గురించి షిర్డీ సాయిబాబా అద్భుతమైన బోధనలు చేశారు. ప్రధానంగా అవన్నీ కూడా ఆయన స్వయంగా ఆచరించి చూపినవే కావడం విశేషం. దానం అనగానే మన ఆస్తిపాస్తులు ఎదుటి వారికి రాసిచ్చేయడం కాదు. ఉన్న దాంట్లోనే కొంత పరులకు పంచడం. దీని వల్ల పుణ్యం పెరుగుతుంది.
‘‘దానాన్ని అన్యభావంతో చేయకూడదు. నేనే చేస్తున్నానని అనుకోకూడదు. ఇంకా చెప్పాలంటే దానం చేసేవారు దానం పొందే వారికి కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే, వారు మన దానాన్ని స్వీకరించడం ద్వారా మనకి పుణ్యాన్ని కలిగిస్తు న్నారు’’..
దాన గుణం గురించి బాబా చెప్పిన మాట లివి. ఎంత అత్యద్భుతమైన పలుకులివి?.

యోగ్యతనెరిగి దానం చేయాలి..

దానం స్వీకరించే వాళ్లకి భుక్తి కలగడం ముఖ్యం. ఇచ్చే వారికి ముక్తిప్రదాయకం. దానం ఇచ్చేవాళ్లకు ఆ గుణం రీత్యా పుణ్యం పెరుగు తుంది. తీసుకునే వాడికి కోరిక (ఆకలి) తీరు తుంది. నిరుపేదలు, నిస్సహాయులను ఆదుకునేం దుకు దానం అనే గుణాన్ని మన పురాణ, ఇతిహాస గ్రంథాలలో సర్వదా సుస్థిరమై వెలుగొందే స్థాయిలో చిత్రించారు. దానిని ఆచరించడం ద్వారా ఎవరికి వారు పుణ్యాన్ని పెంపొందించుకోవచ్చని, సౌశీల్యాన్ని పొందవచ్చునని చెప్పారు. తల్లికి చేసే దానం వల్ల వందరెట్లు, తండ్రికిచ్చే దానం వల్ల వెయ్యి రెట్లు, సహ•దరులకు చేసిన దానం వల్ల అనంతంగానూ ఫలితాలు ఒనగూడుతాయని చెబుతారు. పాపాత్ములకు, దుర్వ్యసనపరులకు చేసిన దానం వల్ల ఏ ఫలితమూ ఉండదు. అంటే అది వ్యర్థమవుతుంది. యోగ్యులకు మాత్రమే దానం చేయాలి. పాత్రనెరిగి దానం చేయాలి. తీర్థయాత్రల్లో, పుష్కర స్నాన సమయాల్లో, శుభ కార్యాల్లో చేసే దానం విశేష పుణ్య ఫలాన్ని ఇస్తుంది.

దానాలు పదమూడు రకాలు

మన పురాణాలలో పదమూడు రకాల దానాల గురించి వివరించారు. అవికాక ఇంకా వస్త్ర, అన్నదానాల వంటివి ఇతోధికంగా ఉన్నాయి. అవతలి వారికి యోగ్యతను బట్టి మనం చేసే సాయమేదైనా దానం కిందకే వస్తుంది. దానం చేస్తున్న మనిషిలో ప్రేమ, శ్రద్ధ, అభిమానం ఉండాలి. లోభత్వం చూపకూడదు. ఔదార్యం, దాక్షిణ్యం కలిగిన భావంతో చేసిన దానమే సత్ఫ లితాలను ఇస్తుంది. విసుగుదలతో, లోభత్వంతో, రాగద్వేషాలతో చేసే దానం వల్ల ఏ ఫలమూ కలగదు. పైగా అది వ్యర్థమవుతుంది. నిరర్థక దానం వల్ల ఎవరికీ ఏ ప్రయోజనమూ కలగదు. పేదలకు మనం చేసే అన్నదానం వల్ల మన ఖాతాలో పుణ్యం జమ అవుతుందని శాస్త్ర వచనం.

పేదలకు దానం చేస్తే దేవుడికి ఆవునిచ్చినట్టే!

మహాభారతం అరణ్యపర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు దానధర్మాల మహిమ గురించి విపులీకరించాడు. దానం ఇవ్వలేని వాడు.. ఇవ్వగలిగే సత్పురుషుడిని యాచకుడికి చూపినా ఫుణ్యఫలం ప్రాప్తిస్తుంది. బీదలకు చేసే దానం దేవుడికిచ్చిన ఆవుతో సమానం. ఒకడు ఎంత ధనికుడైనా అతనిలో దానగుణం లేకపోతే అతనికి ఉన్న సంపద, ఆస్తి, అంతస్తు ఎందుకూ కొరగానివే. జ్ఞాని అయిన ధనికుడు తన సంపాదన లోని కొంత భాగాన్నయినా దానం చేయాలి. ధనికుడైన లోభి కన్నా దానశీలి అయిన పేదవాడు గొప్పవాడు. సముద్రంలో ఉన్న అపారమైన లవణజలంతో దాహార్తి తీరదు. కానీ చెలమలోని గుక్కెడు నీళ్లు దాహార్తిని తీరుస్తాయి. నీరు మంటను ఎలా ఆర్పివేయగలదో దానధర్మాలు పాపాలను అలా హరించి వేయగలవు.

లక్షమందిలో ఒక్కడే దాత..

వందమందిలో శూరుడు ఒక్కడే ఉంటాడు. వేయి మందిలో పండితులు ఒకరో ఇద్దరో ఉంటారు. పది వేల మందిలో వక్తలు ముగ్గురో నలుగురో ఉంటారు. కానీ లక్షమందిలో నిజమైన దాత ఒక్కడే ఉండొచ్చు.. ఉండకపోనూవచ్చు. దాన గుణ వైశిష్ట్యం అంతటి మహత్తరమైనది. క్షేత్రమెరిగి విత్తనం వేస్తే మంచి మొక్క మొలుస్తుంది. మహావృక్షం అవుతుంది. అలాగే అర్హత గలవాడికి దానం చెయ్యడం వల్లనే అనంత పుణ్యఫలం కలుగుతుంది. ఆర్భాటంతో, ప్రచారంతో, కీర్తికాంక్షతో చేసే దానం వల్ల ఏ ఫలితమూ ఉండదు. ఇక, ఎవరికీ తెలియకుండా గుప్తంగా చేసే దానం వల్ల అనంతమైన ఫలితం ప్రాప్తిస్తుందని మన ఇతిహాసాలు చెబుతున్నాయి.

కాళిదాసు దానం..

మహాకవి కాళిదాసు భోజరాజు ఆస్థానానికి బయల్దేరాడు. అది మిట్ట మధ్యాహ్నం వేళ. ఎండ మండిపోతోంది. ఒక పేదవాడు చెప్పులు లేకుండా ఎండలో నడుస్తూ బాధపడుతూ వెళ్లసాగాడు. కాళిదాసు అతనికి ఎదురయ్యాడు. కాళ్లు కాలుతున్నా.. సహిస్తూ అవస్థ పడుతున్న ఆ పేద వాడిని చూసి జాలిపడిన కాళిదాసు తన చెప్పులను అతనికి ఇచ్చి తన నడకను కొనసాగించాడు. చెప్పులు లేనందుకు కాళ్లు చుర్రుమంటూ కాలు తున్నాయి. అయినా తను చేసిన పని వల్ల బాటసారికి కలిగిన ఆనందం, తృప్తి కాళిదాసులో అంతటి బాధనూ మైమరిపించాయి. అంతలో అటుగా రాజు గారి ఏనుగుపై ఒక మావటి వాడు ఆ వీధిలోకి వచ్చాడు. మండుటెండలో చెప్పులు లేకుండా, కాళ్లు కాలుతుండగా నడిచివస్తున్న కాళి దాసును చూసిన మావటి వాడు ఆయనను ఏనుగుపైకి ఎక్కించుకున్నాడు. నేరుగా ఆయనను రాజు గారి కొలువులోకి తీసుకెళ్లాడు. కాళిదాసు తమ కొలువుకు రావడంతో రాజుతో పాటు అక్క డున్న ఇతర పండితులు ఆశ్చర్యపోయారు.

‘‘మహాకవీ! ఇవాళ మాకీ మహర్దశ ఏమిటి? తమరి దర్శన భాగ్యం ఆనందం కలిగిస్తోంది’’ అన్నారంతా ముక్తకంఠంతో.
‘‘నేను చేసిన స్వల్ప దానానికే ఇంతటి గౌరవం లభించింది’’ అన్నాడు వినమ్రంగా కాళిదాసు.

ధనం కాదు.. దానగుణం మిన్న

నిర్మల హృదయంతో, నిస్వార్థ బుద్ధితో చేసే దానం మనిషిని మహ•న్నత శిఖరాలకు తీసుకు వెళ్తుంది. దానం చేయడానికి మనకు ఎంత సంపద ఉన్నదనేది ముఖ్యం కాదు. ఆపదలో ఆదు కోవాలనే ఆవగింజంత మంచి భావన ఉంటే చాలు. అతను కుబేరుడి కంటే గొప్పవాడవుతాడు. మానవ జన్మకు సార్థకత చేకూర్చేది ధనధాన్యాలు, అనంత సంపద కాదు. దానగుణమే సార్థకతను కలిగిస్తుంది. కూటికి లేనివాడైనా సరే తనకున్న దాంట్లో కొంత దానం చేసి నిస్సహాయులకు తోడ్పడ వచ్చు. దానానికి ఉపయోగపడని ధనరాశి ఎంత ఉన్నా ఉపయోగం ఏమిటి? ఎవరికి ఏది అవసరమో గ్రహించి దానం చేసేదే అసలైన దానం.

దానం.. మన సంక్షేమానికే!

రక్త, నేత్ర, మూత్రపిండ దానాలు విశేషమైన వని ఆయుర్వేదంలోని అష్టాంగ మార్గం బోధి స్తోంది. ఇక, దీనులకు, ఆర్తులకు చేసే ఏ దాన మైనా విశిష్టమైనదేనని ఆదిశంకరులు ప్రబో ధించారు. మనం చేసే దానధర్మాలే మనకోసం ఏర్పర్చుకునే సంక్షేమ నిధులు. దానం చెయ్యడం అంటే మన కోసం భగవంతుడే వెతికేలా చేసుకోవడం. సంపద ఉంటే దానం చెయ్యాలి. లేకుంటే హృదయాన్ని అయినా దానం చెయ్యాలి. అప్పుడే మానవజన్మ చరితార్థం.

గీతలో పన్నెండు దానాలు..

‘‘యజ్ఞో వై విష్ణ్ణు’’ అని శ్రుతి సూత్రం. అంటే యజ్ఞమే విష్ణువు. సర్వవ్యాపకుడైన భగవంతుని ప్రీతి కోసం, విశ్వకల్యాణార్థమై, సంఘ శ్రేయస్సు కోసం, స్వార్థరహిత చిత్తంతో చేసే ప్రతి పనీ యజ్ఞమే!. గీతలోని నాల్గవ అధ్యాయంలో 12 రకాలైన యజ్ఞాల గురించి ఉంది. ఎవరెవరికి ఏవి అందుబాటులో ఉంటాయో వాటిని ఆచరించ వచ్చు. ఉదాహరణకు ధనవంతుడు ధనరూపంలో యజ్ఞం చేయవచ్చు. దీనిని ద్రవ్య యజ్ఞం అంటారు. అంటే- బీదలకు ధన సహాయం చేయడం, మంచి పుస్తకాలను ముద్రించి ఉచితంగా అందచేయడం, పాఠశాలలు, వైద్యాలయాల నిర్మాణం, పేద విద్యార్థులకు ఉపకార వేతనం, అనాథ, వృద్ధాశ్రమాలను నిర్మించడం మొదలైనవి.

దానాన్ని యజ్ఞంగా భావించాలి..

దానాన్ని పేరు కోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం కాకుండా, స్వార్థరహితంగా, ఈశ్వరార్పణ భావంతో, భగవదారాధనగా భావించి చేయాలి. విద్యావంతులు తను నేర్చుకున్న విద్యను ఇతరులకు ఉచితంగా బోధించవచ్చు. ఇది జ్ఞాన యజ్ఞమవుతుంది. ఇంకా- తపో యజ్ఞం, యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం మొదలైనవి ఉన్నాయి. చేసే ప్రతి పనినీ యజ్ఞంగా భావించి చేయడమే నిష్కామ కర్మ. మన శక్తి, సామర్థ్యాలను బట్టి ఇత రులకు సాయపడవచ్చు. రోగులకు సేవలందించ వచ్చు. ఎటొచ్చీ ఇతరులకు సాయపడాలనే మనసుండాలి.

(జూన్‍ 14: ప్రపంచ రక్తదాతల దినం)

Review ‘దాన’ సంపదే మిన్న.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top