‘నీలోకి’ నీ ప్రయాణం

వేదాంతంలో కస్తూరీ మృగం గురించిన ప్రస్తావన ఉంటుంది.
కస్తూరి మృగం అంటే ఏమిటి? అదెలా ఉంటుంది?కస్తూరి మృగం ఒకరకమైన జింక. సీజన్‍ వచ్చినపుడు దాని బొడ్డు ప్రాంతం నుంచి ఒకరకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మదపు వాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది. ఆ వాసన తన వద్ద నుంచే వస్తున్నదని అది ఎంతకీ గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవి అంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంథాలలో ఉన్న ఈ కథ చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా ఇలాగే వ్యర్థంగా తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ, తీర్థయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ, కాలాన్ని వృథా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.

పాండవులు తీర్థయాత్రలకు వెళ్తూ కృష్ణుడిని కూడా తోడు రమ్మని పిలుస్తారు. సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్థయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయా మోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుడిని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్థయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికి ఒక దోసకాయ ఇస్తాడు.

‘నా ప్రతినిధిగా దీనిని తీసుకుని వెళ్లి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనినీ ముంచండి’ అని కృష్ణుడు పాండవుల చేతిలో దోసకాయ పెడతాడు. వారు అలాగే చేసి తీర్థయాత్రలు ముగించి తిరిగి వస్తారు.

అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింప చేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.
‘అదేంటి బావా! ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?’ అని పాండవులు కృష్ణుడిని అడుగుతారు.
దానికి కృష్ణుడు నవ్వి, ‘బావా ఎన్ని గంగ లలో మునిగినా దీని చేదు పోలేదు చూశావా?’ అంటాడు.

ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎటువంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.

మనిషి ప్రయాణం బయటకు కాదు. లోపలకు జరగాలి. యాత్ర అనేది బయట కాదు. అంత రంగిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా తిరి గినా చివరకు మనిషి ఆధ్యా త్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.

పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూర్చుని తపస్సు చేశారు. జ్ఞానసిద్ధిని పొందారు.

జ్ఞానం ఎక్కడో బయట దొరికే వస్తువు కాదు. అది మనలో అంతర్లీనంగా ఉన్న శక్తి. దానిని గుర్తించి, కనిపెట్టి మసులుకునే వారే విజ్ఞులు.

భగవాన్‍ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, షిర్డీ సాయిబాబా ఇంకా ఎందరో మహా యోగులు ఉన్న చోట నుంచి కదల కుండానే అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించారు. అరుణాచలమే తన ఆశ్రమంగా చేసుకుని రమణ మహర్షి జ్ఞానసిద్ధి పొందారు.

షిర్డీయే వేదికగా సాయిబాబా సిద్ధి పొంది భక్తజనులకు జ్ఞాన మార్గాన్ని ఉపదేశించారు.
వీరంతా ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన యోగులు.

ప్రయత్నం చేస్తే మనమూ అలా కాగలం. కానీ, మనపై మనకు నమ్మకం తక్కువ. ఇంకా జ్ఞానం, దేవుడు.. ఎక్కడో ఉన్నారని నమ్ముతూ దేశాలు తిరిగే అమాయకత్వం మనది.

Review ‘నీలోకి’ నీ ప్రయాణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top