మనమెంత ఎత్తుంటే స్వామీ అంతే ఎత్తు

మీరెంత ఎత్తులో ఉంటే సరిగ్గా అంతే ఎత్తున కనిపించే వేంకటేశ్వరస్వామి విగ్రహం ఎప్పుడైనా చూశారా? లేదంటే ఇది చదవండి.
తిరుపతి అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి. అయితే, తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురంలో చదలాడ తిరుపతి ఉంది. ఇదే తొలి తిరుపతి అని ప్రతీతి. ఇది సింహాచలం కంటే 8,000 సంవత్సరాలు, తిరుపతి కంటే 6,000 సంవత్సరాలు, దేశంలోని ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల కంటే ఇది మిక్కిలి పురాతనమైనది.
పరమ పవిత్రమైన చిరు మందహాస చిద్విలాస, శ్రీ శృంగార వల్లభస్వామి రూపంలో స్వయంభూగా కొలువుదీరిన ఈ దేవాలయానికి 9,000 సంవత్సరాల చరిత్ర ఉంది. విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలిసినందుకు ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. స్వయంభువుగా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా గర్భాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి.
ఆలయ చరిత్రలోకి వెళ్తే.. ఒకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం. ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవునికి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్న సమయంలో ధృవుని తల్లి అయిన సునీతి.. ‘నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్య పాలన చేయాలంటే శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకో’ అని కొడుకుకు సలహా ఇచ్చిందట. అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడు. అతని తపమునకు మెచ్చి విష్ణువు దివ్య కాంతులతో దర్శనమిచ్చాడట. ఆ కాంతిని చూడలేక ధృవుడు భయపడ్డాడట. అప్పుడు విష్ణుమూర్తి ‘నాయనా! భయమెందుకు? నేనూ నీ అంతే ఉన్నాను కదా!’ అని నవ్వుతూ ధృవుని తల నిమురుతూ అతని భయాన్ని పోగొట్టాడు. ఆ తరువాత స్వామి ధృవునికి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిశాడట.
స్వామి ‘నీ అంతే ఉన్నాను కదా’ అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వారికి వాళ్లెంత ఎత్తులో ఉండి చూస్తే అంతే ఎత్తులోనే దర్శనమిస్తాడు. అంటే చిన్న పిల్లలకు చిన్నగా, పెద్దలకు పెద్దగా విగ్రహం కనిపిస్తుందన్న మాట.
దట్టమైన అరణ్యంలో వెలసిన స్వామి ఎండకు ఎండి, వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఆ తరువాత లక్ష్మీదేవిని నారద మహర్షి ప్రతిష్ఠించారట. అనంతరం శ్రీకృష్ణదేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి వేంకటేశ్వరస్వామి విగ్రహం చిద్విలాసం చిందిస్తూ కనిపిస్తుంది. విగ్రహం ఎంత ఎత్తులో ఉండే వారికి అంతే ఎత్తులో కనిపిస్తుంది. తిరుమల తిరుపతి శ్రీవారి విగ్రహానికి పూర్తి భిన్నంగా శంఖుచక్రాలు ఇక్కడ స్థానం మారి ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోనే శివాలయం, వైష్ణవాలయం ఉంటాయి. సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేస్తే కోరిక ఫలిస్తుందని ప్రతీతి.
నిత్యం ఇక్కడ ధూపదీప నైవేద్యాలు నివేదిస్తారు. శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి, అనగా చైత్ర శుద్ధ ఏకాదశి రోజు స్వామి వారి కల్యాణం వైభవంగా జరుగుతుంది. ఆరు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి. భోజ మహారాజు, భట్టి విక్రమార్కుడు, రాణి రుద్రమదేవి, శ్రీకృష్ణదేవ రాయలు, పెద్దాపురం, పిఠాపురం సంస్థానాధీశులు, నరసాపురం రాజులు ఈ స్వామిని దర్శించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దాపురానికి నేరుగా చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

Review మనమెంత ఎత్తుంటే స్వామీ అంతే ఎత్తు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top