మూర్తీభవించిన స్త్రీమూర్తి..రేవతి

మంచి భార్యగా, తల్లిగా, శ్రీకృష్ణునికి వదినగా, కృష్ణుని అష్టభార్యలకూ తోడికోడలిగానే కాదు మంచి బాధ్యత గల రాణిగా తన స్థానాన్ని సుస్థిరపర్చుకున్న రేవతి పాత్ర చాలా చిన్నదిగా కనిపించినా, ఆమెలోని పరిపక్వత అద్భుతం. రేవతి కుమార్తె శశిరేఖను కృష్ణుడు అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్న ప్పుడు, రేవతి భర్త బలరాముడు శశిరేఖను దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడికి ఇస్తానన్నప్పుడు మదనపడింది

సముద్రంలో నిర్మించిన కుశస్థలి అనే అద్భుత నగరాన్ని పాలించే కకుద్మి కుమార్తె రేవతి. బలరాముడిని పెళ్లి చేసుకుని యదు వంశానికి పెద్ద దిక్కయ్యింది. పుట్టినింటిలో అభిమానంగా పెరిగిన రేవతి తాను ఆడపిల్లనైనందుకు చాలా గర్వపడింది. అందమైన రూపం, అంతకంటే అపారమైన తెలివితేటలు, ఉన్నతమైన ఆలోచనలు ఆమెను నిలువెత్తు స్త్రీగా ప్రపంచానికి పరిచయం చేశాయి. కకుద్మికి కుమార్తె రేవతి అంటే చాలా ప్రేమ, గర్వం. తన జీవితం నిండు నూరేళ్లు సంతోషంగా గడవాలంటే మంచి వరుడికి ఇచ్చి మంచి కుటుంబంలోకి రేవతిని వివాహ రూపంలో పంపించాలని ఎంతో తపించాడా తండ్రి. ఎంతో మందిని వెతికాడు. చివరికి రేవతిని వెంట బెట్టుకుని బ్రహ్మలోకానికి చేరాడు. అక్కడ సభ జరుగుతోంది. కాసేపు వేచి చూశాడు. రేవతిని బ్రహ్మకు చూపి ఆమెకు తగిన వరుడిని సూచిం చాలని అర్థించాడు. బ్రహ్మ ఈ లోకంలో నువ్వు గడిపిన కొంత కాలం భూలోకంలో యుగాలు గడిచిపోయాయి. అయినా పర్వాలేదు, రేవతి వంటి అమ్మాయికి యదు వంశంలో జన్మించిన బలరాముడే తగిన వరుడు. నా మాటగా బల రాముడికి చెప్పి, రేవతిని అతనికి ఇచ్చి పెళ్లి చేయా లని చెబుతాడు.
రేవతి తండ్రితో కలిసి బ్రహ్మ లోకం నుంచి భువికి దిగి వచ్చే సరికి మనుషులంతా యుగాలు గడిచి మరుగుజ్జులుగా కనిపించసాగారు. ద్వారకకు చేరి బలరాముని వెతుకుతుండగా, మహాకాయులుగా వస్తున్న రేవతీ కకుద్ముల గురించి బలరామకృష్ణులకు తెలుస్తుంది. వసుదేవాదులూ, బలరామకృష్ణులకూ తమ వృత్తాంతాన్ని వినిపించి, బ్రహ్మ మాటను తెలియ పరిచారు రేవతి, కకుద్మలు. రేవతిని చూసి బలరాముడు తన నాగలితో ఆమె రూపాన్ని తనకు తగినంత ప్రమాణంలోకి మారుస్తాడు. బల రామునితో రేవతి వివాహం చాలా గొప్పగా జరుగుతుంది. యదు వంశంలోకి మంచి మన సున్న అమ్మాయి కోడలిగా అడుగు పెట్టిందని అందరూ సంతోషించారు. ఆమె ఆలోచనలు, తెలివితేటలు, బంధాలపై తనకున్న నమ్మకాలు యదు వంశీయులనూ కలిసి ఉండేందుకూ, అందరూ ఆనందంగా ఉండేందుకూ తపన పడ్డది. అందుకే రేవతి ఆదర్శ స్త్రీగా పేరు తెచ్చుకుంది.
తన కుమార్తె వివాహం విషయంలో, అధర్మా నికి తన కుమార్తె ఎక్కడ బలైపోతుందేమోననే తపన, కృష్ణుడు తీసుకున్న నిర్ణయం తెలుసుకుని శశిరేఖ జీవితం బాగుపడుతుండటంతో చాలా సంతోషపడింది. కురుక్షేత్ర యుద్ధం జరుగు తుందని తెలుసు కుని ఒక్కటిగా ఉండాల్సిన కుటుంబం విడిపోయి వందలాది కుటుంబాలను చెల్లాచెదురు చేస్తాయని చింతించింది. ప్రతీ విషయంలోనూ పరోక్షంగా తన భావనలను చాలా సున్నితంగా అందరికీ చేరేలా ప్రయత్నించింది రేవతి.
రేవతి తన ముగ్గురు పిల్లలైన నిశద, ఉల్ము ణులనే కుమారులనూ, శశిరేఖనూ ఆదర్శ వంతంగా పెంచి పెద్ద చేసింది. యదు వంశ వినాశంలో తన ఇద్దరు పుత్రులూ చనిపోగా, విధిరాతకి తలొంచింది. బలరామునితో సహ గమనం చేసి తన ప్రస్థానం ముగించింది. అటు పుట్టినింటికీ, ఇటు మెట్టినింటికే కాదు మొత్తం ప్రపంచానికి ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెప్పింది.

Review మూర్తీభవించిన స్త్రీమూర్తి..రేవతి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top