ఆగస్టు 15, గురువారం
రక్షాబంధన్, రాఖీ పూర్ణిమ పేరుతో ఈనాడు ఉల్లాసకరమైన వేడుక నిర్వహించుకోవడం ఆనవాయితీ. రుతువులను అనుసరించి ప్రతి కార్యాన్ని ప్రారంభించిన మన పూర్వీకులు విద్యారంభానికి ఒక కాలాన్ని నిర్ణయించారు. అదే- శ్రావణ పూర్ణిమ. ఈ రోజు ‘అధ్యాయోపాకర్మ’ జరుపుతారు. అంటే, వేదాధ్యయన ప్రారంభం. వేదాధ్యయన ఆరంభానికి చిహ్నంగా ప్రతి వేదంలోని ఆద్యంత రుక్కులను, ఉపనిషత్తుల ఆద్యంత వాక్యాలను పఠించాలి. ఇంటికి వచ్చి అధ్యయన హోమం ఆచరించాలి. మర్నాడు ఉపా కర్మాంగభూతంగా 1,008 సార్లు గాయత్రీ జపం చేయాలి. గాయత్రీ హోమం కూడా చేసే ఆచారం ఉంది. ఇది ఒకప్పటి ఆచారం. ప్రస్తుతం ఈ తిథి రాఖీ పూర్ణిమగానే ఎక్కువ ఆచారంలో ఉంది. దీనినే మహారాష్ట్ర ప్రాంతంలో నార్లీ పూర్ణిమగా వ్యవహరిస్తారు. ఈనాడు అక్కడ వరుణ దేవుని పూజ కోసం సముద్రుడిని పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో దీనినే పౌవతి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివ, విష్ణు, గణేశులను పూజిస్తారు. అలాగే, సర్వరోగ ఉపశమనం కోసం, సర్వ శుభాల కోసం ఏం చేయాలని ధర్మరాజు కృష్ణుడిని అడిగాడట. అందుకు కృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధన విధిని ఉపదేశిం చాడట. శాస్త్రం ప్రకారం రక్షాబంధనం భార్య భర్తకు కట్టాలని ఉన్నా.. ఆచరణలో మాత్రం చెల్లెలు తమ్ముడుకి, అన్నకు కట్టడం ఆచారంగా మారింది. అలాగే, ఈనాడు హయగ్రీవ జయంతి కూడా జరుపుతారు. రాఖీ పూర్ణిమ లేదా శ్రావణ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమగా కూడా ప్రసిద్ధి. ప్రాచీన భారతీయ విద్యా విధానంలో అధ్యయన పక్రియ శ్రావణ మాసంలోనే ప్రారంభ మయ్యేది. వేదాధ్యయనానికి బ్రహ్మోపదేశం తప్పనిసరి అని చెబుతారు. బ్రహ్మోపదేశ స్వీకరణకు సూచికగా యజ్ఞోపవీత ధారణ చేస్తారు. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు చేపట్టే సంవిధానాన్ని ‘శ్రావణి’ అని కూడా అంటారు.
Review రాఖీ పూర్ణిమ.