ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు.
దశరథ మహారాజ తనయుడు.
తండ్రి మాటను నిలబెట్టడం కోసం
రాజ్యంతోబాటు సర్వ సంపదలూ,
సుఖాలను విడనాడి నారదుస్తులు
ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్య
వాసం చేశాడు. కష్టనష్టాలకు వెరవక తాను
నమ్మిన సత్య, ధర్మ మార్గాలను అనుస
రించాడు. ఒక మంచి కొడుకులా, భర్తలా,
ఆత్మీయతను పంచే అన్నలా, ప్రజలను
కన్నబిడ్డల్లా పాలించే రాజులా …ఇలా ఎవరితో
ఏవిధంగా ఉండాలో వారితో ఆ విధంగానే నడుచుకున్నాడు. అన్నివేళలా ధర్మాన్నే పాటిం చాడు. ఆపన్నులకు స్నేహహస్తాన్ని అందించాడు. ఆత్మీయులకు, మిత్రులకు అండగా నిలిచాడు. తాను అవతార పురుషుడని కానీ, దేవుడినని కానీ ఎన్నడూ చెప్పుకోలేదు. ఎవరికీ ఏ ధర్మాన్నీ బోధించ లేదు. ఆయన ఆచరించినదే ధర్మం అనుకునే విధంగా వ్యవహరించాడు. శ్రీహరి ధరించిన అవతారా లన్నింటిలోనూ సంపూర్ణమైనది రామావతారం.
మానవాళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్ది, సన్మార్గంలో నడిపించడం కోసం సామాన్య మానవునిలా ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అయితేనేం, ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. అతి సామాన్యులనుంచి అసామాన్యుల వరకు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. ప్రజల హ•దయాలలో గూడుకట్టుకున్న దేవుడిగా నిలిచాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించి, సకల గుణాభి రాముడు, ఆదర్శరాముడైనాడు. ఆ పుణ్యచరితుడు ఆచరించిన కథకే రామాయణమని పేరు. ప్రపంచ సాహితీ చరిత్రలో రామాయణం అనువాదమైనన్ని భాషలు మరేకావ్యమూ కాలేదు ఇంతవరకూ.
కల్యాణ వైభోగమే…
ఆ శ్రీహరి రామునిగా ఇలలో అవతరించిన పుణ్యతిథి శ్రీరామ నవమి. ఈ పండుగను తొమ్మిది దినాలు జరుపుతారు. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ పూజాదికాలు, రామనామపారాయణం చేస్తారు. ఈ తొమ్మిది రోజులను గర్భనవ రాత్రులు అంటారు. అసలు చైత్ర మాస ప్రారంభం నుంచే ఇంటింటా, వాడవాడలా, వీధివీధినా చలువ పందిళ్లు, మామిడాకు తోరణాలు… ఇలా ప్రతిచోటా కళ్యాణోత్సవ సంరంభాలు మొదలవుతాయి… అదేమి చిత్రమో గాని, ఆ వేడుకలకు ప్రతి ఒక్కరూ పెద్దలే… ఆ వేడుకే సీతారాముల కళ్యాణం. వధూవరులు ఎవరంటే తరతరాలుగా ఆదర్శదంపతులయిన సీతారాములే!
ఎవరు ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాటి కల్యాణ మహోత్సవం సేవించడానికి ఈ భద్రాచల క్షేత్రానికి విచ్చేస్తారో… వారు అక్షయమైన అశ్వమేథ యాగ ఫలాన్ని పొందగలరని బ్రహ్మపురాణం పేర్కొంటే, అదే విషయాన్ని క్షేత్ర మహాత్మ్యం తేటతెల్లం చేస్తోంది. పావన గౌతమి నదీ తీరాన విలసిల్లు తున్న భద్రాచల క్షేత్రం కలియుగ వైకుంఠాన్ని మరిపిస్తుంది. చైత్ర శుద్ధ నవమి నాడు ఆ పుణ్యక్షేత్రంలో జగత్ కళ్యాణార్ధమై శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రతి ఏటా జరుగుతుంది. మధుర మనోజ్ఞ‘ మంగళ శిల్పకళా సంశోభిత దివ్య, భవ్య కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగు తుంది. కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తారు. శ్రీభక్తరామదాసు సీతమ్మవారికి చేయిం చిన మాంగల్యంతోనే మాంగల్యధారణ కార్యక్రమం నేటికీ జరుగుతోంది.
సీతారామునికి ముత్యాల తలంబ్రాలు
పతి ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశం నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. తానీషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలం నుంచి ఆనాటి సాంప్రదాయం మేరకు నేటికీ భదాద్రిలో జరిగే శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమర్పించడం ఆనవాయితీగా మారింది.
పుట్టినరోజునే పెళ్లి వేడుకలా..!?
శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటలగ్నం. ఆనాడు రాముని జన్మదిన వేడుకలు జరిపించాలి. అయితే ప్రతి ఏడాదీ ఇదే నాడు పరమ పావన గౌతమీ నదీ తీరంలోని భద్రాచల క్షేత్రంలో భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరివేసి, ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండువుగా, అంగరంగ వైభవంగా శ్రీ సీతారామకల్యాణం జరిపించడంలోని అంతరార్థం ఏమిటనే సందేహం తలెత్తడం సహజం. పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం దీని గురించి ఏమి చెబుతోందంటే ఆ పరమాత్ముడు అవతార మూర్తిగా ఏ రోజున ఈ పుణ్యపుడమిపై అవతరిస్తే ఆ రోజునే కళ్యాణం జరిపించాల్సి ఉందనీ, ఒకవేళ ఆ తిథి తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించడం సంప్రదాయమని పేర్కొంది. అందుకే లోక కల్యాణం కోసం సీతారాములకు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భధ్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు అభిజిత్ లగ్నంలో పెళ్లి వేడుకలు జరిపిస్తున్నారు. ఇది అనూచానంగా వస్తున్న ఆచారం.
శ్రీరామ నవమినాడు ఏం చేయాలి?
ఈరోజు రామునితోబాటు సీతాదేవిని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా పూజించడం మంచిది. సుగుణ సంపన్నుడైన రామునికి జన్మనిచ్చిన కౌసల్యను, దశరథుని కూడా స్తుతించడం సత్ఫలితాలనిస్తుంది. సీతారామ కళ్యాణం జరిపించడం, ఆ వేడుకలలో పాల్గొనడం, చూడడం, శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించడం, విసన కర్రలు దానం చేయడం వల్ల వారి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.
సీతారాములకు సమర్పించవలసిన నైవేద్యం
పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర పొంగలి, చెరకు, విప్పపూలు.
వివాహంలో ఆటంకాలు ఎదురవుతున్నవారు సీతారాముల కళ్యాణ తలంబ్రాలను శిరస్సున ధరించడం వల్ల విఘ్నాలన్నీ తొలగి సత్వరం వివాహం అవుతుందని పెద్దలంటారు.
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
విశ్వవ్యాప్తంగా భారతీయ సంస్క•తికి ఎనలేని విశిష్టత వుంది. శ్రీ రాముని చరితం యావజ్జగతికీ తెలుసు. అంతటి కమనీయ కావ్యం రామాయణం. వేదమంత్రాలలో రామకథ ప్రస్తావన కనిపిస్తుంది. రామచంద్రుడు జన్మించిన ఇక్ష్వాకు వంశ ధర్మపరిపాలన గురించి రుగ్వేద సంహితలో వివరణ వున్నది..
రాముని వంటి (పిత•వాక్య) పరిపాలకుడు, సీతవంటి మహాసాధ్వి, వశిష్ఠుని వంటి గురువు, సుమంతుని వంటి మంత్రి, లక్ష్మణ భరత శత•ఘ్నుల వంటి సోదరులు, గుహుని వంటి ఉదారుడు, హనుమంతుని వంటి బంటు, సుగ్రీవుని వంటి స్నేహితుడు, విభీషణుని వంటి శరణార్థి, రావణ బ్రహ్మ వంటి ప్రతినాయకుడు, లంక వంటి సుందర నగరం మరే ఇతర కావ్యంలోనూ కాదు… కాదు ఈ విశ్వవిశాల ప్రపంచంలోనే కానరారు.
లోకాభిరామం..నమామి
‘‘చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్’’
అన్నారు. అంటే రామచరిత్ర ఎంత ఉదాత్తమైనదో, రామనామం కూడా అంతటి మహిమాన్వితమైనది, సర్వపాపాలనూ నశింపజేసేంతటి విశిష్ట మైనది. శ్రీరాముని నమ్ముకున్న వారికి శత్రుబాధ ఉండదని, భయపరా భవాలుండవని రామాయణ గాథ తెలియజేస్తుంది. మనుస్మ•తి రామ నామాన్ని మోక్షప్రదంగా పేర్కొంటే, పద్మపురాణం రామనామాన్ని సహస్ర నామ తల్యంగా శ్లాఘించింది. రామనామ మహిమను గురించి అగస్త్య సంహిత, ఉమాసంహిత, రామార్చన చంద్రిక వంటి గ్రంథాలు కూడా పరి పరివిధాల కీర్తించాయి. శ్రీరాముడు అయోధ్యానగరాన్ని, ఇక్ష్వాకు వంశాన్ని తరింపజేస్తే, రామనామం భువనత్రయాన్నే పరవశింపజేస్తుందని ప్రతీతి. ఆపదలను హరించువాడూ, సమస్త సంపదలనూ ప్రసాదించేవాడూ, లోకాభిరాముడూ అయిన రామచంద్రునికి నేను పదేపదే నమస్కరిస్తున్నాను. అని పై శ్లోకం అర్థం.
సర్వసుగుణాలకు, సకల ధర్మాలకు సంగమం రామాయణం. రామా యణంలో అందరూ అనుసరించదగ్గ నీతులు, ధర్మాలు ఎన్నెన్నో ఉన్నాయి. దీనిని పఠించడం అందరికీ శుభదాయకం.
ఆదర్శమూర్తి
రామాయణంలో బాలకాండనుంచి యుద్ధకాండ వరకు చూసినట్లయితే రామునిలో ఏ లోపమూ కనిపించదు. ఆయన వ్యక్తిత్వంలో అడుగడుగునా వికాసం కనిపిస్తుంది. శ్రీరాముడు ఒక మంచి కుమారునిగా, మంచి బాలు నిగా, మంచి సోదరునిగా, మంచిశిష్యునిగా, మంచి భర్తగా, మంచి స్నేహి తునిగా, మంచి పాలకునిగా, గొప్ప వీరునిగా, గొప్ప రాజనీతిజ్ఞునిగా వ్యవహరించి, పురుషులలో ఉత్తమునిగా నిలిచాడు. సర్వజీవుల యెడల కరుణ, ప్రేమ కలిగినవాడు. శత్రువులను సైతం క్షమించగలిగిన గొప్ప హ•దయం కలవాడు రాముడు. అందుకే ఇన్నివేల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆయన ఆదర్శమూర్తిగా కీర్తినొందుతున్నాడు.
మర్యాదా పురుషోత్తముడు
రక్షణ, మధురభూషణ, తొట్రుపాటు, తొందరపాటు, దుడుకుతనం లేకపోవడం, ఎదుటివారు చెప్పే విషయాలను సావధానంగా ఆలకించడం వంటి ఉత్తమ లక్షణాలెన్నో మూర్తీభవించిన మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు. తనలోని మంచి లక్షణాల వల్ల శత్రువుల నుంచి కూడా ప్రశంసలందుకున్నటువంటి మహానుభావుడు. రాముడు ధర్మమూర్తి అయితే, ఆయన జన్మించిన ఇక్ష్వాకు వంశం ధర్మనిరతి కలిగినది. రామాయణం వేదం అయితే శ్రీరాముడు సాక్షాత్తూ వేదపురుషుడు.
సత్య సంధత కోసమే మానవునిగా అన్ని కష్టాలు పడ్డాడు రాముడు. వనవాస ప్రారంభంలో భరతుడు, వశిష్టుడు, మంత్రి సుమంతుడు మొదలగువారు ఎంతమంది, ఎంతచెప్పినా రాజ్యానికి తిరిగి పోక, తండ్రికిచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు. తండ్రి మరణించాడు. వరం కోరిన కైక స్వయంగా రమ్మని పిలిచింది. భరతుడే వచ్చి రాజ్యాన్ని స్వీకరించమని వేడుకొన్నడు. ముఖ్యులైన పెద్దలు కూడా తప్పు లేదు రమ్మంటారు. తమ్ములు సేవిస్తుంటే , హాయిగా సీతతో సుఖాలను అనుభ విస్తూ, రాజ్యాన్ని పరిపాలించవచ్చు. సత్యం కోసం రాముడు రాజ్యసుఖాలని త•ణప్రాయంగా యెంచి త•ణీకరిస్తాడు.ఇట్టి సత్య సంధత రఘువంశరాజుల చరిత్రకే కలికితురాయి అయింది. అందుకే అతడు ‘‘రఘు రాముడయ్యాడు.’’
పఠనీయం, చిర‘స్మరణీయం’ రామాయణ కావ్యం
నారదుని ఉపదేశంతో, బ్రహ్మ వరప్రభావంతో సీతారాముల జీవిత గాధని, ‘‘పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం’’ అన్న నామాంతరాలతో లిఖించి, మానవ జీవన గమనాల్ని ,ప్రమాణాలని, అత్యున్నత శిఖరాలకు తీసికొనివెళ్ళింది రామాయణం. ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఉత్తమకావ్యంగా రచింప బడిన రామాయణం వేద స్వరూపమే అనుటలో సందేహం లేదు. మానవ జీవితాలను సన్మార్గంలో నడిపించే అమూల్య వాక్యాలు ఎన్నో వేదాలలో మంత్ర రూపంలో ఉన్నాయి. వాటిని మనకి సులభంగా బొధించ డానికి రామాయణం వంటి కావ్యాలు పుట్టాయి. రాముడు ఆ వేద వాక్యాలని ఆచరించి చూపాడు. కనుకనే రామాయణం వేదం అన్నారు. వేదానికి, రామాయణానికి ఉన్న సారూప్యతని తెలుసుకొందాం.’’సత్యంవద. సత్యాన్నప్రమదితవ్యం.’’ అని అంటుంది వేదం. అనగా సత్యమే మాట్లాడు. సత్య మార్గం నుండి మరలకు.అని అర్ధం.రాముడు సత్యవాక్య పరిపాలనా దక్షుడు.
‘‘అధ ధర్మాత్మా సత్య సంధశ్చ రమో దాశరథిర్యధి.’’ అని కీర్తిస్తాడు వాల్మీకి.
రామాయణం త్రేతాయుగానికి చెందినది. విశ్వవ్యాప్తంగా భారతీయ సంస్క•తికి ఎనలేని విశిష్టత ఉన్నదంటే అందుకు కారణం రామాయణం వంటి మహాకావ్యమే. సర్వజగతికీ విదితమైనది రామచరితం. రామాయణ కావ్యానికి కర్త వాల్మీకిమహాముని. ఈ కావ్యం ఇరవై నాలుగు వేల శ్లోకాలను కలిగిఉంది. ఇందులో వందకు పైగా ఉపాఖ్యానాలు, ఐదువందల సర్గలు, ఆరు కాండలు ఉన్నాయి… యాకోబి అనే సాహిత్య పరిశోధకుడు రామాయణకాలాన్ని క్రీ.పూ 800-900 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేశాడు. ప్రపంచ భాషలన్నింటిలోనూ అత్యధికంగా అనువదించిన కావ్యం రామాయణం కావడం విశేషం.
శుభప్రదం…రామచరిత పారాయణం
రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. దేశం సుభిక్షంగా ఉంది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటిరాజుకోసం- రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరు దాసు వంటి వారందరూ …‘‘అంతా రామ మయం…. ఈ జగమంతా రామ మయం’’ అని వేనోళ్ల స్తుతించారు. ఆ పురాణ పురుషుని పుణ్య చరితమైన రామాయణాన్ని విన్నా, చదివినా, అందులోని శ్లోకాలను, ఘట్టాలను మననం చేసుకున్నా, శుభం కలుగుతుందని ప్రతీతి.
రామ మంత్ర మహిమ
రామచరితం ఎంతటి ఉదాత్తమైన కావ్యమో, రామనామం అంతటి మహిమాన్వితమైనది. రామచంద్రుడు అంతకన్న గొప్పవాడు. ‘ఓం నమో నారాయణాయ’ అన్న అష్టాక్షరీ మంత్రం నుంచి ‘రా’ అనే అక్షరాన్ని’, ‘ఓం నమఃశ్శివాయ’ అన్న పంచాక్షరీ మంత్రంలోనుంచి ‘మ’ అనే అక్షరాన్ని కలిపి వశిష్ట మహర్షి ఈ మంత్రాన్ని స•ష్టించారు. రామనామ మంత్రాన్ని జపించటానికి ఎలాంటి నియమాలు లేవు. ‘రామ’ అన్న నామ మంత్రాన్ని నిరంతరం జపించటం వల్ల ముక్తిని పొందవచ్చు. పండితులు, పామరులు, మడి, ఆచారాలు, నియమనిష్టలు గలవారు, ఇవన్నీ పాటించలేనివారు ఇలా ఎవరైనా ఈ మహామంత్రాన్ని జపించవచ్చు.
తారక మంత్రం
శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
ఈ శ్లోకం విష్ణుసహస్ర నామంతో సమానమైనదంటారు. ఏడుకోట్ల మంత్రాలలో మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ, ఓం నమశ్శివాయ నుంచి తీసుకున్న అక్షరాల కలయిక అయిన రామనామాన్ని జపిస్తే ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల కలిగే ఫలితం కంటె ఎక్కువ ఫలం కలుగుతుంది. మన పెదవులు రామనామంలోని ‘రా’ అనే అక్షరాన్ని పలికినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అవి లోపలకు రాకుండా మూసుకుంటాయి. కాబట్టి ‘రామ’ అనే రెండక్షరాల తారక మంత్రాన్ని సదా స్మరిస్తుండడం వల్ల అనేక పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని కబీరుదాసు, భక్త రామదాసు, తులసీదాసు వంటి మహా భక్తులు ఉవాచించారు.
Review రామయ్య తండ్రీ… ఓ రామయ్య తండ్రీ….