మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. ఆయా పురాణ పాత్రల్లో ప్రముఖమైన పాత్రలు మహర్షులవి కూడా ఉన్నాయి. మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. అటువంటి మహర్షుల చరిత్ర పఠనం పరమ పావనం
పులస్త్యుడు బ్రహ్మ మానస పత్రులైన ఏడుగురు ప్రజాపతులలో ఒకడు. ప్రస్తుతం నడుస్తున్న మన్వంతరంలోని (ప్రస్తుతం కలి యుగంలో ఏడవ మన్వంతరం నడుస్తోంది) సప్తర్షులలో పులస్త్యుడు ఒకరుగా ఉన్నారు. కొన్ని పురాణాలు పులస్త్యుని ద్వారానే మానవాళికి చేరాయి. ఈయన బ్రహ్మ నుంచి విష్ణు పురాణాన్ని పొందారని ప్రతీతి. దానిని పరాశరునికి బోధించారు. అందు మీదట పరాశరుడు విష్ణు పురాణాన్ని సమస్త లోకానికి తెలియ పరిచాడు.
పులస్త్యుడు కర్ధముని తొమ్మిది మంది కుమార్తెలలో ఒకరు అయిన హవిర్భును వివాహమాడారు. హవిర్భు ద్వారా పులస్త్య మహారుషికి అగస్త్యుడు జన్మించాడు. పులస్త్యునికి ఇద్దరు భార్యలు. పులస్త్యుని రెండవ భార్య, రాజర్షి పుత్రిక అయిన తృణబిందునకు విశ్రవసుడు అనే కుమారుడు కలిగాడు. సుమాలి కుమార్తె అయిన కైకసి వలన విశ్రవసునికి రావణుడు, కుంభ కర్ణుడు, విభీషణుడు అనే కుమారులు, శూర్పణఖ అనే కుమార్తె జన్మించారు. మరో భార్య అయిన ఇద్విద ద్వారా కుబేరుడు జన్మించాడు. ఈ విధంగా పులస్త్యుడు కుబేరుడు, రావణుడు వంటి వారితో సహా సమస్త రాక్షసులకు మూల పురు షుడు.
ప్రత్యేకించి రావణబ్రహ్మకు తాతగానే పుల స్త్యుడు మిక్కిలి ప్రసిద్ధి. పులస్త్యుడు దక్షుని కుమార్తె అయిన ప్రిథిని వివాహమాడాడు. ఈమెనే భాగవతంలో హవి స్భూగా చెప్పబడినది.
ఇద్విద, తృణబిందుడు మరియు అలంబూష అనే అప్సరసల కుమార్తె. తృణబిందుడు వైవస్వత మనువు వంశంలోని మరుత్తుని సంతతికి చెందిన వాడు. తృణబిందుడు ఒకనాడు యాగం చేసి బిందెల నిండా బంగారాన్ని బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. అంత బంగారం తీసుకుని వెళ్లలేని బ్రాహ్మణులు చాలా బిందెలు అక్కడే వదిలేసి వెళ్లారు. యుధిష్టిరుడు యాగం చేసినపుడు ఈ బంగారాన్నే తీసుకుని యాగంలో ఉప యోగించాడు. తృణబిందుడు గొప్ప చక్రవర్తి. మరియు మిక్కిలి అందగాడు.
విష్ణుమూర్తి నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేయడానికి తన శరీరం నుంచి కొందరిని సృష్టించాడు. వారినే బ్రహ్మ మానస పుత్రులని అంటారు. అలాంటి మానస పుత్రులలో పులస్త్యుడు ఒకరు. ఈయన బ్రహ్మ దేవుడికి కుడి చెవి నుంచి జన్మించారు. తన తండ్రి చెప్పిన విధంగానే పుట్టిన దగ్గర నుంచి నారా యణుడి మీద మక్కువతో నిరంతరం తపస్సులో మునిగి ఉండేవాడు. అగస్త్యుడు పుట్టిన తరువాత పులస్త్యుడు తృణబిందు ఆశ్రమానికి వెళ్లి తపస్సులో లీనమైపోతాడు. ఆ ఆశ్రమంలో ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఆనందంతో కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. తన తపస్సుకు భంగం కలిగించడానికే వారు అక్కడకు వచ్చారని భావించిన పులస్త్యుడు ఇక ముందు తన ఆశ్రమం వైపు వచ్చిన అమ్మాయిలు గర్భవతులు అవుతారని శపిస్తాడు. ఆ శాపం విన్న ఇద్దరు అమ్మాయిలు అక్కడి నుంచి పారిపోతారు. ఈ శాపం గురించి తెలియని తృణబిందు రాజర్షి అనే రాజు కుమార్తె ఇద్విద ఈ ఆశ్రమ సమీపానికి వచ్చి గర్భవతి అవుతుంది. ఏడుస్తూ తండ్రి వద్దకు వెళ్లి విషయాన్ని చెబుతుంది. దీంతో రాజు గారైన ఆ తండ్రి పులస్త్యుని వద్దకు వచ్చి తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలని కోరతాడు. ఇందుకు పులస్త్యుడు సరేనంటాడు. ఇలా వారికి పుట్టిన వాడే విశ్రవసుడు. ఈయనే రాక్షసులను పుట్టించాడని అంటారు. ఈయన కుమారులలో ఒకడు రావణుడు.
Review రావణుడి తాతగారు పులస్త్యుడు.