లోకంలోని సకల జీవగణానికి కారుణ్యం పంచే నాయకుడు ఆయన. ఆరాధ్య దేవతల్లో ప్రథముడు. ఆయనకు చేసే పూజలు, ఇచ్చే నివేదనలు, భక్తజనం చేసుకునే సంబరాలు సామాజిక సమష్టితత్వాన్ని ఏకీకృతం చేస్తాయి. అందుకే ఆ ప్రమథ గణాధిపతి ఆరాధన అంటే దివ్యారాధన. శ్రద్ధతో, ఆనందంతో, నియమంతో, నిష్టతో ఆయనను పూజిస్తే ఎంతైనా పుణ్యప్రదం. అంతకుమించిన శుభప్రదం. విఘ్ననాయకుడంటే విఘ్నాలను పారదోలే విఘ్నేశ్వరుడు. భక్తజనులంతా ఆయనను ‘గణేశా’ అని భక్తితో పిలుచుకుంటారు. భాద్రపద మాసం శుద్ధ చతుర్థి తిథి మొదలుకుని భాద్రపద శుద్ధ చతుర్దశి వరకు గణపతి నవరాత్రుల (సెప్టెంబరు 2- 12) సంబరాలు వాడవాడనా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వినాయక ఉత్సవాలంటే భజనలు, పాటలే కాదు.. భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం.
లోక పూజ్యుడైన మహా గణపతిని దేవతలలో జ్యేష్ఠునిగా భావిస్తారు. అందుకే తొలి పూజలు ఆయనకే చెందుతాయి. ఆ తరువాతనే ఇష్ట దైవాలను ప్రార్థించడం ఆచారంగా మారింది. సృష్టి మొత్తాన్ని ముప్పై మూడు కోట్ల దేవతలు వివిధ గణాలుగా విభజించారు. ఆ గణాలకు అధిపతి.. గణపతి అని వేదాలు నిర్దేశించాయి. వేదాంగాలలో ఒకటైన ఛందో శాస్త్రంలోని మగణ, భగణ, జగణ, నగణ, రగణ, తగణ, యగణము లనే అష్ట గణాలకూ అధిష్టాన దేవుడు గణపతి. ద్వాదశాదిత్యులకు, ఏకాదశ రుద్రులకూ, అష్ట వసువులకూ వినాయకుడే ప్రభువు. ఓంకారం అన్ని ఛందస్సులు శ్రీకారం చుట్టుకునేది ఓంకారంతోనే. ఆ ఓంకారమే గణపతి ఆకారమై ఈ జగతిలో వెలుగొందుతున్నది. ‘ఫ్రమశ్చందసామివ’ అని కాళిదాసు చెప్పినట్టుగా ప్రణవనాద స్వరూపుడు వినాయకుడే కనుక గణపతిగా లోకాన ప్రభ వించాడు.
ఓం గణానాంత్వా గణపతిగ్‍ం హవామహే
కవిం కవీనా ముపమశ్రవస్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆన: శృణ్వన్నూతిభి: సదసాదనమ్
గణాధిపత్యం వహించడమే కాదు.. సకల లోకాల్లోని ప్రత్యేకమైన జీవజాతిలోని సమస్తం లోనూ తానే ఉంటాడనీ, గణపతి జగన్నియంతగా బాధ్యతను స్వీకరించిన మహాగణాధిపతి అనీ శుక్ల యజుర్వేదం వివరించింది.
నమో గణేభ్యో గణపతిభ్యశ్చవోనమో
నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వోనమో
నమో గృత్యేభ్యో గృత్యపతిభ్యశ్చవోనమో
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవోనమో
సృష్టి మొత్తంలోనూ దేవ, పితర, గంధర్వ, అసుర, మనుష్య రూపంలో ఉన్న ప్రధాన గణ విభాగాలు, వాటి గణపతులు, చేతన అచేతన రూప, పదార్థ స్వరూపాలు, వాటి వాటి ఉప సంఘాలు, సంఘ అధిపతులు.. వీటన్నింటి ద్వారా విషయగతమైన కాలం, సామాన్య, అసామాన్య రూప సమస్త జీవాకృతి రూపంలో మూర్తీభవించిన స్వయం గణాధీశుడు శ్రీమహాగణపతి.
గణపతి సర్వ విద్యాధిదేవత. సమస్త శుభాలకు అధి దేవత. ప్రశస్తమైన ప్రణవ స్వరూపుడై, శబ్ద బ్రహ్మగా, ఆనంద స్వరూపుడుగా విరాజిల్లు తుంటాడు.
జ్ఞానార్ధ వాచకోగశ్చణశ్చ నిర్వాణవాచక:
తయోరీశం పరబ్రహ్మ గణేశం ప్రణమామ్య హమ్
గ అక్షరం జ్ఞానార్ధ వాచకమైతే ణ నిర్వాణ వాచకమైంది. గణ శబ్దానికి వాక్కు అనే అర్థం ఉంది. అందువల్ల వాగణపతి గణపతియేనని శాస్త్రం చెబుతోంది. శ్రీగణేశ సంస్క•త పదానికి ప్రారంభం అని అర్ధం. అందుకే వినాయకుడు ఆది దేవుడయ్యాడు.
గణ్యంతేబుద్ధం తేతేగణ: అన్నట్టు సమస్త దృశ్యమాన పదార్థాలు, విశేషాలు అన్నింటికీ ఆది అధిష్టాన దేవత గణపతి.
యుగయుగాలుగా గణపతి దైవం భారతీయ సంప్రదాయంలో పూజలందుకుంటోంది. దేవ తలు, గణాలు ఉద్భవించి సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఆది పురుషుడిగా గణపతి పూజలు అందు కుంటున్నట్టు గణేశ పురాణం చెబుతోంది. కృత యుగంలో గణపతి అదితి కశ్యపుల పుత్రునిగా అవతరించి దేవాంతక, నరాంతకులనే రాక్షసులను వధించాడు. త్రేతాయుగంలో మయూరేశునిగా ఆవిర్భవించి, బ్రహ్మ తనయలైన సిద్ధి, బుద్ధిలను వివాహం చేసుకుని, క్షేమలాభులను సంతానంగా పొందాడు. ద్వాపర యుగంలో గణపతి సింధు రాసుడనే రాక్షసుడిని సంహరించడానికి జన్మంచి అరుణకాంతి శోభితుడై, చతుర్భుజుడై అల రారాడు. కలియుగంలో తొండంతో ఏకదంతుడై సంపద బొజ్జతో దర్శనమిచ్చే గజాననుడు ‘కతా చండీ వినాయకా’ అన్నట్టు కల్మశాల నాశకుడై పూజలు అందుకుంటున్నాడు.
గణనాథుడికే తొలిపూజ..
వినాయకుడిని పూజించడం వల్ల శ్రీలక్ష్మీదేవి కటాక్షమూ లభిస్తుందని యాజ్ఞవల్క్య స్మ•తి చెబుతోంది. దీనికి సంబం ధించిన చిన్న కథ కూడా ఉంది. పూర్వం అభినందనుడనే రాజు ఇంద్రుడిని యజ్ఞంలో భాగం లేకుండానే యజ్ఞం చేయదలి చాడు. ఇంద్రుడు దానిని ధ్వంసం చేయాలని కాలుడిని ఆదేశిస్తాడు. విఘ్నాసుర రూపంలో అవతరించి అభి నందన రాజును సంహరించి యజ్ఞాన్ని ధ్వంసం చేయసాగాడు కాలుడు. మహా ముని జనులంతా కలత చెంది బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తారు. బ్రహ్మ జ్ఞానపూర్ణుడైన పురుషుడే కాలుడిని సంహరించగలడనీ, బ్రహ్మజ్ఞాని అయిన గణేశుని స్తుతించి ప్రసన్నం చేసకుని ఆ కార్యాన్ని నెరవేర్చుకోవాలని సలహా ఇస్తాడు. మహర్షుల కోరిక మేరకు ప్రసన్నుడై విఘ్నాసురుడైన కాలుడిని ఓడిస్తాడు వినాయకుడు. అంతట కాలుడు ఏ కార్యానికైనా ఆరంభంలో వినాయకుడిని పూజించి నట్టయితే ఎలాంటి విఘ్నాలు కలిగించనని మాట ఇస్తాడు. ఆనాటి నుంచే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని తొలి పూజతో ఆరాధించడం ఆనవాయితీగా వస్తున్నది.
వినాయకుడికీ ఉంది సంసారం..
పార్వతీదేవి నలుగుపిండిని ఒలిచి వినాయ కుడిని ద్వార పాలకుడిగా నిలబెట్టింది. శివుడు ముందూ వెనుక చూడకుండా తనను అడ్డగించా డన్న నెపంతో కోపించి గణనాథుని తల నరి కేశాడు. ఇది చూసి పార్వతి దు:ఖించింది. దీంతో ఆమె వేదన చూడలేన తన గణాలను పంపి ఏనుగు తలను తెప్పించి ఆ బాలునికి అతికించి ప్రాణం పోశాడు పరమేశ్వరుడు. సుందరతర శుభవదనుడై.. దివ్యాకృతితో వెలుగొందుతూ ఆ బాలుడు బ్రహ్మ విష్ణు రుద్రాదులకు నమస్కరించి, ‘క్షంతవ్యశ్చాపరా ధోమే మావశ్చై వేదృశో నృణామ్’ అన్నాడు. అభి మానవంతుడై ప్రవర్తించిన నా అప రాధనమును మన్నించాలని త్రిమూర్తులను కోరాడు. పార్వతీదేవి ఆ బాలుడిని దగ్గరకు తీసుకుని ‘గజవదనా! నువ్వు శుభకరుడవు. శుభ ప్రదాతవు. ఇక నుంచి సమస్త దేవతలలో ప్రథమార్చన నీకే లభిస్తుందని ఆశీర్వ దిస్తుంది. ఆనాటి నుంచి గణనాథుని ప్రథమ పూజ్యునిగా ఆరాధించడం మొదలైందనీ, జ్ఞానంతో ముక్తి మార్గాన్ని పొందడానికి గణేశుని ఆవిర్భావానికి సమన్వయ సంబంధం ఉందనీ శివ పురాణం అత్యద్భుతంగా విశదీకరించింది.
నిమజ్జనంలోని ఆంతర్యం
గణపతిని తొమ్మిది రోజుల పాటు పూజించిన అనంతరం ఏదైనా నది లేదా సరస్సులో నిమజ్జనం చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. పర్యావరణాన్ని, ప్రకృతిని, సామరస్యాన్ని రక్షించు కునే దృక్పథంతో ఇది కొనసాగితే జగదానంద కరం, జనానంద సంధాయకమై అలరారుతాయి. నిమజ్జనంలోని ఆంతర్యం జీవన సత్యాన్ని తెలియ పరుస్తుంది. అలంకరణలతో, ఆడంబరాలతో మనం పెంచి పోషించుకునే ఈ శరీరం తాత్కా లికమేనని, మూణ్ణాళ్ల ముచ్చటేని, పంచభూతా లతో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతా ల్లోనే కలిసి పోవాల్సిందేననే విశ్వ సత్యాన్ని వినాయకుని నిమజ్జనం ఉటంకిస్తుంది. భక్తి, విశ్వాసం, సంప్రదాయం, శ్రద్ధాసహితంగా వినాయక చవితిని నిర్వహించుకుని, విఘ్న వినాయకుని ఆరాధనా ఫలంగా ప్రజలంతా సుఖ శాంతులతో జీవించాలనే విశాల దృక్పథం వినాయక చవితి పరమార్థం కావాలి.
Review వినాయకుడు-ఆరు జీవిత పాఠాలు.