త్రిగుణాలు ప్రకృతి నుంచి ఆవిర్భవించాయి. జీవుడిని బంధనాల నుంచి దైవం రక్షించాలంటే సత్వ గుణమునే పొందాలి. ఈ గుణం నిర్మలంగా ఉంటుంది. జీవితాలను వెలుగుబాటలో నడిపిస్తుంది. ప్రతి అణువూ ప్రశాంతంగా గోచరించేలా చేస్తుంది. ఏ ఉపద్రవాలు ఉండవు. జీవులందరు సత్వగుణావలంబులై ఆత్మస్థితిని పొందాలని గీత బోధిస్తుంది. ఈ గుణం కూడా మాయ చేత ఆవరింపబడి ఉన్నప్పటికీ అది శుద్ధమైనదే. నిర్మలంగా ఉంటుంది కానీ రజో, తమో గుణాల కంటే మిక్కిలి శ్రేష్ఠమైనది. సుఖసంతోషాలకూ, శాంతిసంపదల కూ ఆలవాలమైనది ఈ సత్వ గుణం.
పరోపకారం, దానం, యజ్ఞం, తపం, స్వా ధ్యాయం, అనుష్ఠానం, యోగం, సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం-సచ్చీలం, అహింసా మార్గం, రుజు ప్రవర్తన, సత్యవావాక్యాలను, ధర్మాచరణ.. ఇవన్నీ సాత్విక గుణ లక్షణాలు. వీటిలో ఏ ఒక్క దానిని శ్రద్ధతో ఆచరిం చి, ఆశ్రయించి, అనుస రించినా మిగిలిన లక్షణాలన్నీ కరతలామంక మవుతాయనడంలో సందేహం లేదని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడికి బోధించాడు. సత్వ గుణాచరణ ద్వారా జీవులలో భక్తి భావన-ఆధ్యాత్మిక చింతన-భక్తి, దైవస్మరణ వంటి సుగుణాలు ఏర్పడి అతనిని ప్రగతి మార్గంలో నడిపిస్తాయి. జీవులకు జ్ఞానాన్ని కలిగిస్తాయి.
సత్వ గుణ సంపద విశిష్టత
తత్రసత్వం నిర్మలత్వాత్, ప్రకాశక మవా మయమ్.
సుఖసంగీతతబద్నాతి, జ్ఞాన సంజ్ఞేన చానఘ।।
శ్రీకృష్ణ పరమాత్మ సత్వగుణ సంపద విశిష్టతను అర్జునుడికి పై శ్లోకం ద్వారా వివరించాడు.
‘‘సత్వం సుఖే సజ్ఞయతి’’ అన్నారు.
అంటే, సత్వగుణం సుఖమును ప్రసాదిస్తుంది అని భావన. జీవులలో ఏ గుణం అధికంగా ఉంటే వారు చేసే కర్మలు (పనులు) కూడా తదను గుణంగానే ఉంటాయి. సత్వగుణం గలవారు మాట్లాడేటప్పుడు ప్రశాంతత-జ్ఞాన ప్రకాశం వెల్లి విరుస్తుంటాయి. వారి సమక్షంలో ఉన్న ప్పుడు ప్రశాంతత ఉట్టిపడుతుంది. మనకు అటువంటి భావన కలిగితే సదరు వ్యక్తుల్లో, జీవుల్లో సత్వ గుణం అధికంగా ఉన్నదని గ్రహించవచ్చును.
పరమాత్మ మరో శ్లోకంలో అర్జునుడికి ఇలా తెలిపాడు.
యదా సత్వేప్రవృధ్ధేతు, ప్రళయంయాతి దేహ భృతే
తదోత్తమవిదాంలోకాన్, అమలాన్ ప్రతిపద్యతే
ఎపుడైతే జీవుడు సత్వగుణ అభివృద్ధిని పొందినవాడవుతూ మరణిస్తాడో, అనగా అతను దేహాన్ని చాలిస్తాడో, అప్పుడు ఉత్తమజ్ఞానం గల వారి పరిశుద్ధములైన లోకాలను పొందుతాడని పై శ్లోకానికి భావం.
సత్వగుణ సంపన్నులకు ఉత్తమలోకం
సాత్విక గుణాలకు ప్రతిగా లభించే ఫలం నిర్మలంగా, సుఖంగా ఉంటుంది. మానవులు తమ దు:ఖాలను, అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి రాజసిక, తామసిక కార్యములను తప్పకుండా త్యజించాలి. సాత్విక కార్యాలనే ఆశ్రయించి ఆచరణలో పెట్టాలి. విజ్ఞులు చేయవలసిన పని ఇది.
‘‘ఊర్థ్వ గచ్ఛిన్తి సత్వస్థామ్’’ అన్నాడు పరమాత్మ.
సత్వగుణం గలవారు ఊర్థ్వ లోకాలకు వెళ్తా రని పై శ్లోకానికి భావార్థం. అనగా ఉత్తమ గతిని పొందుతారని భావన. సకల మానవాళి సత్వ గుణాన్ని నాశ్రయించడం ద్వారా ఉన్నతస్థితిని పొంది, ఊర్థ్వగతికి చేరవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సత్వగుణాన్ని ఆశ్రయిస్తే పరమ పద ప్రాప్తి లభిస్తుంది. సాత్వికగుణం సంసార బంధ విముక్తికి, పరమాత్మ స్వరూప ప్రాప్తికి అనగా మోక్షం పొందడానికి రాచబాట వంటిది. దీని ద్వారా అమృతత్వం సిద్ధిస్తుంది. సత్వగుణ సంపన్నుడు గుణాతీత లక్షణాలైన నిశ్చలత్వం, సమత్వం కలిగి కర్తవ్యాన్ని వదలి దైర్యవంతుడవు తాడని శ్రీకృష్ణ పరమాత్మ పలు ఉదాహరణలను తెలిపాడు. జీవులందరూ గుణాతీతులుగా వ్యవహరించి భక్తితో దైవాన్ని సేవించి, తరించి జీవితాలను సార్థకం చేసుకోవాలి. సాత్విక గుణాలే సమాజంలో ధర్మం, సత్యం, శాంతి, అహింస, ప్రేమలకు ప్రతీకలు.
Review సత్వగుణమే సర్వశ్రేష్టం.