ఈ ఆంజనేయుడికి పది భుజాలు

పది భుజాలు.. మూడు కళ్లు కలిగిన హనుమంతుడిని ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా? నిజంగా ఆంజనేయుడి రూపాల్లోనే ఇది చాలా ఆశ్చర్యకరమైనది. ఈ రూపంలో హనుమంతుడిని చూడాలంటే తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లా ఆనందమంగళం వెళ్లాల్సిందే. ఇక్కడి ఆంజనేయుడికి ‘త్రినేత్ర దశభుజ వీరాంజనేయు’’డని పేరు. ఇక, ఈ ఆలయ చరిత్ర, విశేషాలలోకి వెళ్తే..

హనుమాన్‍ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అంతేకాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు.

హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో లేదా రాముని పాదాల వద్ద వినయంగా కూర్చున్న ముద్రలోనో కనిపిస్తాడు. ఇక, ఆంజనేయ ఆలయాల్లో ఆయన అభయహస్త ముద్రలో దర్శనమిస్తాడు. కానీ, తమిళనాడులోని ఆనందమంగళంలో మాత్రం విచిత్ర రూపంలో కనిపిస్తాడు. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడిని మనం చూడవచ్చు. ఈ రూపంలోని హనుమంతుడిని దర్శించు కునేందుకు భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు.

త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారం ఎత్తి రావణుడిని సంహరించిన అనంతరం నారదుడు ఆయనను కలుసుకున్నాడు.
‘స్వామీ! లంక నాశనంతో మీ యుద్ధం పూర్తి కాలేదు. రావణుని వారసులు ఇంకా చాలామంది ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై ఏదో ఒకనాడు యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్రం అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాక ముందే మీరు వారిని సంహరించాలి’ అని నారదుడు రాముడిని వేడుకున్నాడు.

అప్పుడు రాముడు నారదుడికి ఇలా బదులిచ్చాడట-‘నారద మహర్షీ! రామావతారంలోని నా కర్తవ్యం పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. నువ్వు చెప్పిన పనిని పూర్తి చేయడానికి మరెవరినైనా ఎంపిక చేయాల్సిందే’’.

రావణుడి వారసులను తుదముట్టించేందుకు ఎవరు సరైనవారా? అని నారదాదులు అంతా విచారించగా, చివరకు రాక్షస వధకు హనుమంతుడే సరి అని అంతా కలిసి నిర్ణయించారు. రావణ వారస మూకపైకి హనుమంతుడినే పంపాలని సంకల్పించారు.

ఈ యుద్ధంలో సహాయకారులుగా ఉండేందుకు విష్ణుమూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించాడు.
బ్రహ్మదేవుడు తన కమండలాన్ని హనుమంతుడికి అందచేశాడు.
శివుడు ఏకంగా తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించాడు.

ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన ఆంజనేయుడు దశభుజుడయ్యాడు. కైలాసనాథుడి నుంచి మూడో కంటిని పొందడంతో ముక్కంటిగా మారాడు.
వానర శ్రేష్ఠుడు, అంజనీపుత్రుడు అయిన ఆంజనేయుడు పై ఆకారంలో వీరవిహారం చేసి రాక్షస వధను పూర్తి చేసి విజయంతో తిరిగి వచ్చాడు.
ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసి నందును ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు.

రాక్షస వధ అనంతరం విజయంతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ‘ఆనందమంగళమ్‍’ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతారు.
దేశంలో మరెక్కడా ఆంజనేయుడి రూపం ఈ విధంగా ఉండదు. ఆనందమంగళమ్‍లోని ఆలయంలో మాత్రమే ఆంజనేయుడిని పది భుజాలు, మూడు నేత్రాలు గల రూపాన్ని దర్శించుకోగలం.

Review ఈ ఆంజనేయుడికి పది భుజాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top