దేవీ నవరాత్రులు..దుర్గాదేవి తొమ్మిది అవతారాలను తొమ్మిది రోజుల పాటు పూజించడానికి ఉద్దేశించినవి. ఆ తొమ్మిది అవతారాలు ఏమిటి? ఆ అవతారాల లక్ష్యం ఏమిటి? ఏయే సందర్భాలలో దేవి ఆ నవావతారాలను దాల్చింది? ఇవన్నీ ఆసక్తికరం. పూజ అంటే దేవీ దేవతల ప్రతిమలను పూజాపీఠంపై ఉంచి పసుపు కుంకుమలతో పూజించడం.. నైవేద్యాన్ని సమర్పించడం.. మనసులోని కోరికలను ఇష్టదైవానికి తెలుపుకోవడం.. ఇది కాదు పూజ పరమార్థం. మనం ఏ దేవతలను పూజిస్తున్నామో ఆ దేవతల అవతార వైశిష్ట్యం, పురాణ నేపథ్యం కూడా తెలుసుకోవాలి. అప్పుడే ఆ అవతారంలో ఇమిడి ఉన్న లక్ష్యం మన మనసుపై ప్రభావం చూపుతుంది. అదే అసలైన మానసిక పూజ. ఈ విజయదశమి నాడు మన మనసులను ఆ దిశగా లగ్నం చేసి దుర్గాదేవిని కొలుద్దాం. నవరాత్రుల్లో దుర్గావతారాలను, వాటి వైశిష్ట్యాన్ని తెలుసుకుని మనసారా తరిద్దాం. అక్టోబరు 19 విజయదశమి సందర్భంగా ఆ పర్వదిన విశేషాలపై ప్రత్యేక కథనం.
గుబిలి నుంచి మధు కైటభులు అనే ఇద్దరు రాక్షసులు పుట్టారు. విష్ణువు యోగనిద్రలో ఉండగా, వారు బ్రహ్మాదులకు కంటకులుగా మారారు. వారిని సంహరిం చేందుకు విష్ణువును మేల్కొలపాలని బ్రహ్మ ‘మహా మాయి’ని ప్రార్థించాడు. ఆ ప్రభావంతో విష్ణువు మేల్కొని ఐదు వేల సంవత్సరాల పాటు మధుకైటభులతో పోరాడినా విజయం సాధించలేక పోయాడు. అప్పుడు మహామాయి ఆ రాక్షసులను మాయా మోహితులను చేసింది. వారు బలదర్పములతో విర్రవీగి- తమతో అంతకాలం వరకు పోరాడినందుకు వరమును కోరుకొమ్మని విష్ణువును అడిగారు. ఆయన సరేనని మరణాన్ని కోరాడు. మహామాయి మాయ చేత వారలా వంచితులయ్యారు. విష్ణువుకు ఇలా విజయాన్ని చేకూర్చిన మహామాయి పది తలలు, పది కాళ్లు, నల్లని దేహకాంతి గలది కనుక ‘మహాకాళి’ అని విఖ్యాతి పొందింది. ఇది దుర్గాదేవి మొదటి అవతారం.
రెండో అవతారం మహిషాసుర మర్దిని
దుర్గాదేవి రెండో అవతారం మహిషాసుర మర్దిని. మహిష ముఖం గల రాక్షసుడు (మహిషా సురుడు) దేవత లందరినీ జయించాడు. ఇంద్రుడు స్వర్గాన్ని వదిలి పారి పోయి బ్రహ్మకు మొర పెట్టుకున్నాడు. బ్రహ్మ వారందరినీ తీసుకుని శివ, విష్ణువుల వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. వారు కోపో ద్దీపితులు కాగా, వారి నోటి నుంచి మంటలు వెలువడ్డాయి. దేవత లందరూ ఇలాగే మంటలు గక్కారు. ఆ మంటల నుంచి మహాశక్తి ఉద్భ వించింది. ఆమె సింహవాహిని అయి మహిషాసురుడిని సంహ రించింది. ఈమెకు ‘మహాలక్ష్మి’ అనే పేరు కూడా ఉంది.
మూడో అవతారం మహా సరస్వతి
శుంభు నిశుంభులనే రాక్షసులు దేవతలను జయించి హిమాలయాల్లో దేవిని గురించి తపస్సు ప్రారంభించారు. ఒకనాడు పార్వతీదేవి గంగా స్నానం చేయడానికి వచ్చినపుడు ఆమె దేహం నుంచి ఒక దివ్య సుందరి ఉద్భవించింది. శుంభుడు ఆమెను మోహించి తనను పెళ్లాడాల్సిందిగా సుగ్రీవుడనే వాడిని రాయబాగా పంపాడు. దానికామె అంగీకరించలేదు. శుంభుడు కోపించి, ఆమెను పట్టి తెమ్మని ధూమ్ర లోచనుడనే సేనానిని పంపాడు. ఆమె సింహవాహనయై ఆ రాక్షస సైన్యాన్ని హతమార్చింది. పిదప శుంభుడు- చండముండులనే వారిని మరికొంత సైన్యంతో పంపాడు. వారంతా సింహవాహిని అయి ఉన్న ఆమెపై ఒక్కసారిగా పడ్డారు. కోపంతో ఆమె ముఖం కందిపోయింది. ఆమె ఫాలభాగం నుంచి ‘కాళి’ అనే దేవత ఉద్భవించింది. ఆమె చండుని శిరస్సు ఖండించి, ముండుని శూలంతో పొడిచి చంపింది. వారిద్దరి శిరస్సులను ఆమె దేవికి కానుకగా ఇచ్చింది. దేవి ఆమెకు ‘చాముండి’ అనే బిరుదునిచ్చి, ఈ పేరుతో నువ్వు పూజలు అందుకుంటావని ఆదేశించింది. అనంతరం శుంభునిశుంభులు పెద్ద సైన్యంతో చాముండితో తలపడ్డారు. ఆ సైన్యంలో రక్తబీజుడనే వాడు ఉన్నాడు. వాడి ఒంటి నుంచి ఎన్ని రక్తపుబొట్లు పడతాయో అంతమంది రాక్షసులు పుడతారు. కాళికాదేవి అతని రక్తం కింద పడకుండా తాగివేసి వాడిని చంపి వేసింది. రక్తబీజుని మరణంతో శుంభునిశుంభుల బలం సన్నగిల్లింది. అనంతరం దేవి వారినీ సంహరించింది.
నాల్గవ అవతారం ‘నంద’
దేవి నాల్గవ అవతారంగా ఓ నందుని ఇంట ‘నంద’ అనే పేరుతో జన్మించింది. వసుదేవుడు బాలకృష్ణుడిని రహస్యంగా చెరసాల నుంచి తీసుకువెళ్లి వ్రేపల్లెలో నందుడి ఇంట విడిచి, అతని బిడ్డ అయిన నందను తెచ్చి చెరలో తమ బిడ్డగా ఉంచుకున్నాడు. కంసుడు ఆమెను చంపడానికి రాగా, ఆమె తప్పించుకుని ‘నీ ప్రాణ శత్రువు నందుడి ఇంట సుఖంగా పెరుగుతున్నాడు’ అని చెప్పి అదృశ్యమైంది.
ఐదవ అవతారం ‘రక్తదంతి’
ఐదవ అవతారం ‘రక్తదంతి’. ఒక రాక్షసుడిని ఆమె చీల్చివేడం వల్ల దంతాలు రక్తసిక్తమయ్యాయి. అందుకే ఆ పేరు వచ్చింది.
ఆరవ అవతారం ‘శాకంబరి’
దేవీ అవతారాల్లో ఆరవది ‘శాకంబరి’ అవతారం. ఒకప్పుడు దారుణమైన క్షామం ఏర్పడి వందేళ్ల పాటు ప్రజల్ని పీడించింది. అప్పుడు ప్రజలకు శాకములు, ఫలాలు ప్రసాదించిన తల్లి కాబట్టి ఆమెకు ‘శాకంబరి’ అనే పేరు వచ్చింది.
ఏడవ అవతారం ‘దుర్గ’
దేవీ అవతారాల్లో విశిష్టమైనది ఏడవ అవ•రం. ఆమె దుర్గ. ఈ అవతారంలో ఆమె దుర్గముడనే రాక్షసుడిని సంహరించింది. అందుకే ఆమెకు ‘దుర్గ’ అనే పేరు వచ్చింది. ఇంకా ఎనిమిదో అవతారం ‘మాతంగి’గా, తొమ్మిదో అవతారం ‘భ్రామరి’గా ప్రసిద్ధి పొందాయి.
దేవీ పూజావిధులు
దేవీ ఉపాసన అత్యంత విశిష్టమైనది. ఆశ్వయుజ మాసంలోనే కాదు.. మహాకాళి హిందూ సంప్రదాయంలో నిత్య పూజాధికాలు అందుకునే దేవత. గ్రామాల్లో వేర్వేరు అమ్మవార్ల పేరుతో పూజలందుకునేది దుర్గాదేవియే. అయితే, దేవిని ఎలా పూజించాలి? ఆమెకు ఏమేం ప్రీతి? వంటివి ఆసక్తికరం.
దేవీ పూజ ముఖ్యంగా మూడు (3) రకాలు.
1. నిరామిషమగు నైవేద్యాలతో జరిపే సాత్త్విక పూజ.
2. బలులు, సామిషమైన నైవేద్యాలతో చేసేది తామస పూజ.
3. జప, యజ్ఞాలు లేక సురామాంసాద్యుపహారాలతో కూడినది రాజస పూజ.
ప్రస్తుతం దేశమంతటా సాత్త్విక విధానం అనుసరించే దేవీ పూజ జరుగుతోంది. సామాన్య పూజా పద్ధతి ఇది. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నాడు భక్తులు తమ మనోభీష్ట్యర్థం దీక్ష వహించి, కలశ స్థాపనం చేసి దేవీమూర్తిని ఆవాహనం చేయాలి. అది మొదలు నవమి నాటి రాత్రి వరకు దీక్షతో దేవీ పూజ సాగించాలి. ఆ రాత్రితో దీక్ష పరిసమాప్తమవుతుంది. ఒక్కోచోట శ్రీ చక్రపూజ ప్రధానాంగంగా కూడా ఉంటుంది. ఈ తొమ్మిది దినములు కన్యకా పూజ కానీ, సుమంగళీ పూజ కానీ జరుగుతుంది. దశమి నాడు ఉదయం దేవీ ప్రస్థానం నిర్వహిస్తారు.
ఐదు వేల ఏళ్ల క్రితమే దేవీ పూజలు
దేవీ పూజ అత్యంత ప్రాచీనమైనదని తెలుస్తోంది. ఐదు వేల ఏళ్ల నాటి సింధు నాగరికత శిథిలాలలో అనేక శక్తి స్వరూపిణి విగ్రహాలు, లింగములు లభించాయి. ఆనాడు దేవిని సృష్టికారిణిగా భావించి ఇంటింటా పూజించే వారని తెలుస్తోంది. హరప్పాలో ఒక మట్టి దిమ్మ మీద ఒక స్త్రీ నగ్న ప్రతిమ ఉంది. ఆమెను శీర్షాసనం వేసినట్టు చిత్రించారు. పైన కాళ్లను బార్లా చాపినట్టు ఉంటుంది. ఆమె గర్భాశయం నుంచి చెట్లు, చేమలు పుట్టినట్టు ఉంటుంది. ఈ భావనే శాక్త మత ఆవిర్భావానికి దారి తీసింది. ఇది తాంత్రిక మ••ం. శాక్తుల సంప్రదాయం ప్రకారం ప్రకృతి పరాశక్తి స్వరూపిణి. శివునికి ఈమె దేవేరి అయినా, అతనికీ మూల కారణం ఆమే! ఈమె సృష్టికారిణి కూడా. అందువల్లే ఆమె మహామాయిగా పూజలందు కుంటోంది. అవే నేడు మన దేశంలో జరుగుతున్న దుర్గా పూజలు.
వేద కాలం నుంచే దుర్గాదేవి ప్రసక్తి..వైదిక మతంలోని దుర్గాదేవి శక్తులను పోలి ఉంటుంది.
దసరా నాడు శమీ పూజ
నవరాత్రోత్సవం వెను వెంటనే ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు జరుపుకునే పండుగ విజయదశమి. దీనినే ‘దసరా’, ‘దశరా’ అని వ్యవహరిస్తారు. ఇది శరన్నవరాత్రులకు మకుటాయ మానం వంటి పర్వదిన విశేషం. శమీ పూజలు జరిగేది ఈనాడే.
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ
పై శ్లోకాన్ని పఠించి శమీపూజ చేస్తారు. కొన్నిచోట్ల దసరా నాడు రావణుని బొమ్మలను తగులబెట్టే ఆచారం ఉంది. ఈ కార్యక్రమాన్నే ‘రామలీల’ అంటారు.
‘విజయదశమి’ అనే పేరెలా వచ్చిందంటే..
‘విజయదశమి’ అనే పేరు ఈ పర్వానికి ఎలా వచ్చిందనే నేపథ్యం కాళి•ప్రకారం..
మహా నవమి నాడే రావణుడు నిహతుడ య్యాడు. దేవతలు రాముని పట్ల కృతజ్ఞత ప్రకటించడానికి దేవిని విశేషంగా పూజించారు. దశమి నాడు ఆమెను వీడ్కొలిపారు. కనుక ఇది విజయదశమి అయ్యింది. దీంతో పాటు విజయదశమి ఎలా ఏర్పడిందనే దానిపై పలు ఉత్పత్తులు ఉన్నాయి. ఆశ్వయుజ శుక్ల దశమి సాయంకాలం నక్షత్రోదయ కాలాన్ని ‘విజయ’ అంటారు. ఇది సర్వ కామార్థ సాధనం. దశమి నాడే అపరాజితా పూజనం, సీమోల్లంఘనం, శమీపూజ చేయాలి. దేశాంతరం వెళ్లే వారు ఈనాడే బయల్దేరాలి. ఈ పూజ చేయడానికి ముందు గ్రామానికి ఈశాన్య దిక్కున శుచియైన ప్రాంతాన్ని అలికి, చందన కుంకుమలతో అష్టదళ పద్మాన్ని వేయాలి. పిదన ఈశాన్య దిక్కున ఉన్న శమీ వృక్షాన్ని పూజించాలి. శమీ వృక్షం లేనపుడు అశ్మంతకము (జమ్మి చెట్టు)ను పూజించవచ్చు. అయితే జమ్మిచెట్టు మొదలునున్న మట్టిని తేవాలి కానీ, జమ్మి పత్రిని తేకూడదని శాస్త్ర ప్రమాణం. జమ్మిచెట్టును ఇలా కింది శ్లోకంతో పూజించాలి.
అశ్మంతక మహావృక్ష మహా దోష నివారణ
ఇష్టానాం దర్శనం దేహి శత్రూణాంచ వినాశనం.
విశ్వమాతా.. జగద్ధాత్రీ..
జగన్మాత ఆవిర్భావాన్ని గురించి మన పురాణాల్లో ఎన్నో గాథలున్నాయి. ‘సప్తశతి’ రెండవ అధ్యాయంలో ఆమె అవతార గాథ అనేక సంకేతార్థాలలో కానవస్తుంది.
దేవదానవుల యుద్ధం వంద సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ యుద్ధంలో దేవతలు పరాజితులయ్యారు. నిలువ నీడలేక వారు త్రిమూర్తులను ఆశ్రయించారు. స్థితికారకుడైన శ్రీ మహా విష్ణువు దేవతల దుస్థితిని చూసి కోపిం చాడు. అతని ముఖం నుంచి క్రోధం వెలువడి కొద్దిసేపట్లో అది మహోజ్వలంగా వెలగసాగింది. ఆ మహాద్భుత శక్తిని చూసి బ్రహ్మ, రుద్రులు తల్లడిల్లిపోయారు. సృష్టి, లయ శక్తులు జ్వాలా రూపంలో వెలువడ్డాయి. తమ అంతఃశ్శక్తి తేజోరూపంలో బహిర్గతం కావడంతో త్రిమూ ర్తులు శక్తిహీనులయ్యారు. కానీ, కోపతప్తులుగా ఉన్నారు.
త్రిమూర్తుల నుంచి వెలువడిన తేజశ్శక్తి అగ్ని పర్వతంలా విజృంభించి సమస్త విశ్వాన్ని ఆక్ర మించింది. ఆ చిచ్ఛక్తి మాతృ రూపం దాల్చింది. మహామాత తే•ఃపుంజాలు లోకమంతటినీ కాంతిమంతం కావించాయి. దేవతలు ముగ్ధులై లోకమాతనవలోకించి ‘హే జగజ్జననీ!’ అంటూ కేలుమోడ్చారు. వాత్సల్యపూరితమైన ఆమె ప్రసన్న వదనం నిరాశా నిస్ప•హలను పటాపంచలు చేసింది.
త్రిమూర్తుల దివ్యశక్తులను పుణికి పుచ్చుకుని ఆవిర్భవించిన జగన్మాత ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా, త్రిగుణాత్మికగా స్తుతినందుకుంది. పరమేశ్వరుని శుద్ధ మంగళ స్వరూపం ఆమె ముఖంలో వికసించి ఆ తల్లి శుద్ధ మంగళ స్వరూపిణి అయ్యింది. ఆమె అనంత బాహువులు విష్ణువు యొక్క మహా శక్తి సంకేతాలు అయ్యాయి. విశ్వస్థితి కారకములైన ఆ హస్తములు శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు ప్రతీకలు. పూర్ణచంద్ర స్వరూపం గల ఆమె స్తనద్వయం మానవునికి అవసరమైన బౌద్ధిక, ఆధ్యాత్మిక క్షీరపానమును సమకూర్చుతున్నాయి. ఆమె పాద ద్వయం బ్రహ్మ సృష్టి శక్తి సంకేతం. అనంత చలనాన్ని సూచించే జీవ చైతన్యం.
ఆమె త్రిలోచన. సూర్యచంద్రాగ్నులు ఆమె త్రినేత్రాలు. ఒక కన్ను విశ్వ జీవనాధారం. మరొకటి విశ్వ సౌందర్య ప్రతీక. ఆమె కను బొమలు ఉదయసంధ్యల సంకేతాలు.
త్రిశక్త్యాత్మిక, విశ్వస్వరూపిణి, జగజ్జనని ఆమే. చండీ, దుర్గ, కాళీ, మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతి ఆమే. ఆమే బాలా, లలితా, రాజరాజేశ్వరి, త్రిపురసుందరి.
మహా శివుడు తన త్రిశూలంతో మరొక త్రిశూలాన్ని నిర్మించి ఆమెకు ఇచ్చాడు. త్రిశూలం దైహిక, మానసిక, ప్రాపంచిక ప్రవృత్తులను అణచి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే సంకేతం. విష్ణువు తన ధర్మచక్రం నుంచి మరొక చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు. జగత్తు యొక్క ఆవిర్భావానికి చలనానికి ప్రతీక ఆ చక్రం. ప్రజాపతి అక్షరమాలను ఇచ్చాడు. శ్రీమాత అకారాది క్షకారాంత వైఖరీ వాక్ స్వరూపిణి అయ్యింది. జగచ్ఛక్షువైన సూర్యుడు తన ప్రకాశాన్ని ఆమెకు సమర్పించాడు. సముద్రుడు కమలహారాన్ని, కుబేరుడు పానపాత్రను జగన్మాతకు సమర్పించారు.
ఈ కానుకలన్నీ స్వీకరించి లోకమాత నవ్వింది. ఆ నవ్వు దానవ సమూహాన్ని భయ కంపితం చేసింది. ఆమె దరహాస వదన దర్శ నంతో దేవతా సమూహం ఆనందోత్సాహంతో నృత్యం చేస్తూ..
‘‘విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ
ప్రగల్భా పరమోదారా పరామోదా మనో మయా’’ అంటూ ప్రస్తుతించసాగింది. ఈ రీతిగా అవత రించిన విశ్వమాతను దసరా నాడు, శరన్నవ రాత్రుల వేళ అర్చించి ఇష్టార్థాలు పొందుతున్నారు భక్తులు.
ముగ్గురమ్మలు..
‘దేవి’ అంటే త్రిరూపిణి. అంటే- లక్ష్మి, సర స్వతి, పార్వతి.. ఈ ముగ్గురూ. అందుకే నవరాత్రుల్లో ఈ ముగ్గురికీ మూడు రోజుల చొప్పున పూజలు జరుగుతాయి. విజయ వంతంగా కార్యసిద్ధి కలగాలంటే విజయదుర్గను పూజించాలి. ఆయుధ పూజ అనేది వీరుల సంప్రదాయం. వృత్తులపై ఆధారపడి బతికే వారు తమ సాధనాలనే ఆరాధిస్తారు. పిల్లలు ఒక సైన్యంలాగా బయల్దేరి ‘జయీభవ.. విజయీభవ’ అని ఉత్సాహంగా విల్లంబులు ప్రదర్థిస్తూ పప్పుబెల్లాలతో సంబరం చేసుకోవడం ప్రాచీన సంప్రదాయం. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు అందరూ అనాదిగా దుర్గను పూజిస్తున్నారు. రుగ్వేదంలో దేవీ సూక్తం ఉంది. దుర్గను అందులో బ్రహ్మవాదిగా, అగ్నివర్ణగా, తపోమయిగా వర్ణించారు. కేనోపనిషత్తులో దుర్గాదేవి ‘ఉమ’గా దేవతలకు దర్శనం ఇస్తుంది. ఉపనిషత్తుల్లో అగ్ని యొక్క ఏడు నాలుకలుగా ఈ దేవి నామాలు ఉంటాయి. కాళీ, కరాళీ మొదలైన పేర్లు అవే. సకల పురాణాల్లోనూ దుర్గాదేవిని దుష్ట సంహారిణిగా వర్ణించారు. లక్ష్మి అష్టోత్తర నామాల్లో ‘దుర్గ’ ఉంటుంది. లలిత, అంబిక, గౌరి, భవానీ, అన్నపూర్ణ, వల్లీ అష్టోత్తరాల్లో ‘దుర్గ’ నామం వినవచ్చు. వీటిని బట్టి సమస్త స్త్రీ దేవతలనూ దుర్గానామం ప్రతిపాదిస్తున్నది.
Review జయ జయహే...