మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. ఆయా పురాణ పాత్రల్లో రేణుక పాత్ర ఒకటి. ఈమె తన జీవితకాలంలో ఆశ్చర్యకరమైన అద్భుతాలనేమీ చేయలేదు. భర్త ఆగ్రహం, కుమారుడి ఆవేశం తన ప్రాణాన్నితీసినా కూడా.. తిరిగి జీవం పోసుకుని వారితోనే ప్రేమబంధాన్ని అల్లుకున్న విలక్షణ పాత్ర ఆమెది.
రేణుక:
ఈమె జమదగ్ని భార్య. పరశురాముని తల్లి. మన పురాణపాత్రల్లో ఈమె ప్రముఖురాలు.
ప్రసేనజిత్తు అనే ఇక్ష్వాకు వంశం రాజు కుమార్తె రేణుకాదేవి. జమదగ్ని గొప్ప మహర్షి. ఆయన పెరిగి పెద్దవాడయి కఠోర అధ్యయనం చేసి వేదాలపై పట్టు సాధించాడు. అనంతరం ఆయన సూర్య వంశానికి చెందిన రాజు ప్రసేనజిత్తు వద్దకు వెళ్లాడు. ఆ రాజు కుమార్తెను వివాహం చేసుకోవాలనే తన ప్రతిపాదనను చెప్పాడు. అనంతరం జమదగ్ని, రేణుక వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు కుమారులు. వాసు (రుమ ణ్వంతుడు), విశ్వవాసు, బృహు ధ్యాను, బృహు త్వాకణ్వ, రాంభద్ర అనేవి వీరి పేర్లు. రాంభద్రనే తరువాత కాలంలో పరశురాముడుగా ప్రఖ్యాతుడయ్యాడు.
రేణుకాదేవి మహా ఇల్లాలు. భర్త, పిల్లలతో హాయిగా సంసారం సాగిపోతోంది. ఒకనాడు రేణుక నీళ్ల కోసం చెరువు వద్దకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకాలాటలను తిలకిస్తూ ఆమె ఎక్కువ సేపు చెరువు వద్ద ఉండిపోతుంది. దీంతో ఇంటికి తిరిగి రావడం ఆలస్యమవుతుంది. ఇందుకు కోపించిన జమదగ్ని.. తన భార్య రేణుకను సంహరించాలని కుమారులను ఆదేశిస్తాడు. పెద్ద కుమారులు నలుగురూ అందుకు అంగీకరించరు. దీంతో తల్లిని, నలుగురు సోదరులను సంహరించాలని జమదగ్ని చివరి కుమారుడైన పరశురాముని ఆదేశిస్తాడు. పరశురాముడు తండ్రి చెప్పినట్టే చేస్తాడు. జమదగ్ని అందుకు సంతోషించి ఏదైనా వరం కోరుకోవాలని పరశురాముడికి చెబుతాడు. తల్లిని, సోదరులను బతికించాలని పరశురాముడు కోరతాడు. జమదగ్ని అట్లే చేస్తాడు. ఈ విధంగా పరశురాముడు తన తల్లిని, సోదరును తిరిగి బతి కించుకుంటాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మహిష్మతి నగరానికి తీసుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక భర్త మృతదేహంపై పడి రోదిస్తూ ఇరవై ఒక్కమార్లు (21) గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మహిష్మతి నగరానికి వెళ్లి కార్తవీర్యార్జునుని కుమారులను చంపి తన తండ్రి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బతికిస్తాడు.
రేణుక గ్రామ దేవతగా భారతదేశం నలు మూలలా పూజలందుకుంటుంది. పరశురాముని తల్లి అయిన ఈమె సాక్షాత్తూ పరాశక్తి అవతార మని భావిస్తారు. భర్తకు తగిన ఇల్లాలు. పరమ సాధ్వి. జమదగ్ని భార్యగా చివరి వరకు ఆశ్రమ ధర్మాన్ని పాటించింది. ఐదుగురు కుమారులనూ యోగ్యులుగా తీర్చిదిద్దింది. వారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంది. భర్త, కుమారుల సేవలోనే తన ఆనందాన్ని వెతుకుకున్న రేణుక ఆదర్శ గృహిణి.
ప్రశాంతమైన వదనం, కొట్టొచ్చి నట్టు ప్రతిబింబించే తేజస్సు, పట్టుదల, గాంభీర్యం, ఏకాగ్రత, హుందాతనం రేణుక మూర్తి తత్వానికి, వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే విశేషాలు. రేణుకాదేవిలో దాగున్న అద్భుతమైన కళ శిల్పకళ. ఆమె నిశ్చలతకు అది ప్రతిరూపం. నిజానికి జమదగ్ని భార్యగా తన జీవితకాలంలో అద్భుతాలను చూడలేదు. చేయనూ లేదు. ఈమె కథ విభిన్నం. ఎవరూ చూడని, చూడలేని అనుభవ రూపానికి ఆమె ప్రతీక. ప్రపంచ పోకడలూ, అరిషడ్వర్గాలూ, ఆలోచన లేని ఆవేశాలూ జీవితాల్ని పదునైన కత్తి చివరి అంచుదాకా తీసుకెళ్తాయనీ, అదే ప్రేమ బంధం మనుషులనూ, వారి జీవితాలనూ నింద లకూ, శిక్షలకూ తలొగ్గక పెనవేసు కుని ఉంటుందని తెలియ చెప్పింది రేణుక. ఈ కారణం గానే రేణుక పేరుతో పలు గ్రామాల్లో, పల్లెల్లో గ్రామ దేవతగా కొలువుదీరి ఆమె ఈనాటికీ పూజలందు కుంటుంది.
Review ప్రేమకు ప్రతిరూపం రేణుక.