దసరా వేడుకల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రం లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే కళారాల ఊరేగింపును చూసి తీరాల్సిందే. దుష్ట శిక్షణ పూర్తి చేసుకుని వస్తున్న అమ్మవారికి.. భక్తజనం జయ జయధ్వానాలతో స్వాగతం పలుకుతారు. అదే కళారాల ఊరేగింపుగా ప్రసిద్ధి.
నాలుకనే రణభూమిగా చేసుకుని, రక్తబీజుడిని కడతేర్చిన తల్లి..ఆ రౌద్ర రూపంలోనే ఊరేగింపునకు బయల్దేరుతుంది. సరిగ్గా నడిరేతిరి ఆ సంరంభం మొదలవుతుంది. భేరీనాదాలూ, చిత్ర విన్యాసాలూ, విచిత్ర వేషధారణలూ ఆ కోలాహలానికి తోడవుతాయి. ఎంత సందడి ఉన్నా.. నగరోత్సవానికి ప్రధాన ఆకర్షణ అమ్మవారి కళారాలే. నాలుక చాచిన ఆ ముఖచిత్రాలను చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. దసరా సమయంలో, ఒంగోలులో తప్పించి ఇలాంటి ఉత్సవం మరెక్కడా జరగదని సగర్వంగా చెబుతారు స్థానికులు.
పురాణ కథనం
శుంభునిశుంభులు, మధుకైటభులు.. ఒకరా ఇద్దరా, ఎంతోమంది రాక్షసులు నేలకొరిగారు. రక్తబీజుడి వంతు వచ్చింది. అతని ఒంట్లోంచి పడే ప్రతి రక్తపుచుక్క నుంచీ మరో రక్తబీజుడు పుడతాడు. పరమేశ్వరుడు అతనికా వరం ఇచ్చాడు. మహాకాళి ఆ లోకకంటకుడిని ఎలా సంహరిస్తుందా అని ముక్కోటి దేవతలూ ఆకాశంలోంచి ఉత్కంఠతతో చూడసాగారు. అమ్మ తన నాలుకను భీకరంగా చాచింది. జిహ్వ పెరిగి పెద్దదై రక్షక్షేత్ర మైంది. ఆఖరి చుక్క వరకూ ఆ రాక్షసుడి రక్తాన్ని పీల్చేసుకుంది మహాకాళి. అసుర సంహారం తర్వాత కూడా ఆమెలోని రౌద్రాంశ శాంతించలేదు. దేవతలు, మునులు స్తుతించడంతో శక్తిస్వరూపిణి కాస్త కరుణించింది. నాలుక బయటకు చాచిన తన శిరస్సును ఎవరైతే ఘనంగా ఊరేగిస్తారో, భక్తితో పూజిస్తారో ఆ గ్రామానికి కానీ, నగరానికి కానీ ఎటువంటి దుష్టశక్తుల భయం ఉండదని అభయమిచ్చింది. ఒంగోలులో నగ రోత్సవం నాలుగు వందల ఏళ్ల నాడు ప్రారంభమైనట్టు స్థానికులు చెబుతారు.
అప్పట్లో అమ్మవారి శిరస్సు ఆకారాన్ని అట్టతో రూపొందించి.. గూడు బండ్లు కట్టి ఊరేగించే వారు. వందేళ్ల కిందటి నుంచి అట్టల స్థానంలో రాగి రేకునూ, ఇతర లోహాల మిశ్రమాన్నీ వాడటం మొదలు పెట్టారు. ఇవి చాలా బరువుగా ఉంటాయి. వాహనం మీద అలం కరించడం, శిరస్సు కదులుతున్నట్లుగా తిప్పడం కష్టమైన పనే. ఓ ప్రత్యేక బృందం ఈ బాధ్యత తీసుకుంటుంది.
ఆరు కళారాలు
ఒంగోలు నగరంలో మొత్తం ఆరు కళారాల ఊరే గింపు జరుగుతుంది. దుర్గాష్టమి నాడు బాలాజీరావు పేట కనకదుర్గ, అంకమ్మపాలెం కాళికాదేవి, కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు నరసింహస్వామి- అమ్మవార్ల కళారాలు ఊరేగిస్తారు. మహర్నవమి రోజున గంటాపాలెం పార్వతమ్మ, కేశవస్వామిపేట విజయదుర్గాదేవి, బివిఎస్ హాలు సెంటరులోని బాలాత్రిపుర సుందరి కళారాల ఊరేగింపు జరుగుతుంది. దుష్ట సంహారంలో నర సింహ స్వామి అమ్మవారికి తోడుంటాడన్నది భక్తుల భావన.
అన్నీ ఒకచోట..
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభ మయ్యే కళారాల వెంట స్థానికులు కేరింతలు కొడుతూ బయల్దేరతారు. వాద్యకారులు భీకర శబ్దాలతో హోరెత్తి స్తుంటారు. నృత్యాలు చేసేవారు, కాళికాంబ వేషధారణతో నోట్లోంచి నిప్పులు వెదజల్లే వారు.. ఒకటేమిటి కోలా హలమంతా ఇక్కడే కొలువుంటుంది.
ఇలా ఊరేగింపుగా వస్తున్న అమ్మవారిని దర్శించి, కొబ్బరికాయలు, కర్పూర నీరాజనాలు సమర్పించడం తమ అదృష్టమని భావిస్తారు మహిళలు. ఆ తల్లి రాక కోసం రాత్రంతా మేల్కొని మరీ ఎదురు చూస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు.. ఆ రోజు బయల్దేరిన అన్ని కళారాలు ట్రంక్ రోడ్డులోని మస్తాన్ దర్గా వద్దకు చేరుకుంటాయి. టపాసులు కాలుస్తూ, ఈలలు వేస్తూ పరస్పరం స్వాగతించుకుంటారు భక్తులు. ఆ వైభవాన్ని చూడ్డానికి జనం వేలాదిగా గుమికూడతారు. రెండు గంటల అనంతరం అక్కడి నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు.. నగరానికి ఉత్తరం వైపు పొలిమేరగా భావించే కొణిజేడు బస్టాండ్ రావిచెట్టు వద్దకు చేరుకుంటుంది. తిరుగు పయనం ప్రారంభించి, రెండో రోజు మధ్యాహ్నానికి ఆలయానికి చేరుకుంటుంది. దీనివల్ల ఏడాది పాటు దుష్టశక్తులు నగరానికి రాకుండా ఉంటాయనేది స్థానికుల నమ్మకం.
రకరకాల ఆకారాలు
కనకదుర్గ, పార్వతి, బాలాత్రిపుర సుందరి, విజయ దుర్గాదేవి కళారాలు పచ్చటి పసిమి ఛాయతో, ధగధగలాడే కిరీటాలతో మెరిసిపోతుంటాయి. కాళికా అమ్మవారి కళారం రక్తవర్ణంతో కడు భీకరంగా ఉంటే, నరసింహమూర్తి ధవళ వర్ణంలో తళతళలాడుతుంటాడు. ఈ కళారాల తయారీపై బెంగాల్ సంప్రదాయ
Review భళారే… కళారం.