కుంఠ అంటే కొరత కలది అని అర్థం. వైకుంఠ అంటే ఏ కొరతా లేనిదని భావం. అటువంటి వైకుంఠం శ్రీ మహా విష్ణువు లక్ష్మీదేవితో కూడి ఉండే నివాసం. విష్ణువు ఆ నివాసంలో లక్ష్మీదేవితో శేషశయ్యపై నివసిస్తాడు. త్రేతాయుగంలో రావణుని బాధలకు తాళలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠానికి వచ్చిన హరి దర్శనం చేసుకున్నారు. వారికి ఏకాదశియే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం కల్పించి మార్గదర్శి కావడం చేత వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చిందని అంటారు.
ఆధ్యాత్మికత, శాస్త్రీయతల కలయికకు ప్రతీకగా నిలిచే పర్వదినం వైకుంఠ ఏకాదశి. దక్షిణాయన పుణ్యకాలం పూర్తవుతూ, ఉత్తరాయణం సమీపించే సంధికాలంలో వచ్చే ఏకాదశి ఇది. మనకు గల ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇది అత్యంత పవిత్రమైనది. శ్రీ మహా విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని భక్తులకు దర్శనమిచ్చే అపూర్వ సందర్భం ఈ ఏకాదశి పర్వం. దీనినే ముక్కోటి ఏకాదశి, మోక్ష ఏకాదశి అని కూడా అంటారు.
ఏటా రెండు ఏకాదశులు
మన పూర్వీకులు ఏడాదిని రెండు ఆయనాలుగా, పన్నెండు మాసాలుగా విభజించారు. ప్రతి మాసంలో రెండు పక్షాలు వ్తాయి. అంటే ప్రతి నెల రెండుసార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఇలా ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు.. ఒక్కో దానికి ఒక్కో విశిష్టత. కానీ, వీటన్నిటిలో అత్యంత పవిత్రంగా భావించేది వైకుంఠ ఏకాదశి. ధనుర్మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. తెలుగు వారు అన్ని పండుగలను చాంద్రమానంలో ఆచరించినప్పటికీ ఈ ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. ఈ ఏడాది (2019) వైకుంఠ ఏకాదశి పర్వం డిసెంబర్ 8న వస్తుంది.
తొలి ఏకాదశికి శయనించి.. వైకుంఠ ఏకాదశికి మేల్కొని..
ఆషాఢ శుద్ధ ఏకాదశి మనకు తొలి ఏకాదశి. ఈనాడు మహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. ఈ ఏకాదశి నాడు పీఠాధిపతులు, సన్యాసాశ్రమంలో ఉన్న వారు చాతుర్మాస్య వ్రతదీక్ష చేపడతారు. తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణువు ఈ నాటి నుంచి యోగనిద్రలోకి వెళ్తాడు కాబట్టే దీనికి శయన ఏకాదశి అనే పేరు వచ్చింది. దీనికి నాలుగు నెలల తరువాత విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. అలా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు నిద్ర మేల్కొన్న విష్ణువును ఉత్తర ద్వారం నుంచి ముక్కోటి దేవతలు దర్శించుకుని తరిస్తారు. అదే వైకుంఠ లేదా ముక్కోటి లేదా మోక్షద ఏకాదశి. ఇది ధనుర్మాసంలో వస్తుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనూ రాశిలోకి ప్రవేశించే సమయం వరకూ ధనుర్మాసంగా పరిగణిస్తారు. ధనుర్మాసం 30 రోజులు. ఇది మార్గశిర, పుష్య మాసాల్లో విస్తరించి ఉంటుంది. ధనుర్మాస కాలం ఎంతో పుణ్యప్రదమైనదనీ, విష్ణువును ఈ మాసంలో ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి నాడు పూజించడం విశేషమైందని అంటారు. అందుకే మాసానాం మార్గశీర్షోహం అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. శ్రీ మహా విష్ణువుకు సూర్యచంద్రులు దక్షిణ, వామ నేత్రాలు. ఒకటి తేజస్సు, మరొకటి ఆహ్లాదం అందిస్తాయి. నేత్రాలు వేరైనా స్వామి కాంతితత్వ్తం ఒక్కటేనన్న మహా తత్త్వాన్ని ఈ పర్వం విశదపరుస్తుంది.
అమ్మాయిల రంగవల్లుల సందడి..
ధనుర్మాసమంతా అమ్మాయిలకు ఉత్సాహాన్నిస్తుంది. వేకువనే లేచి, ఇంటి ముందు కళ్లాపి చల్లి, రంగురంగుల రంగవల్లులపై గొబ్బెమ్మ లను అలంకరించి గొబ్బి పాటలు పాడతారు. ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్తం. ఆ సమయంలో వారు విష్ణుమూర్తిని దర్శిస్తారు. ఆ సమయం ఎంతో విలువైనది. ముక్కోటి దేవతలు వచ్చి ఆయనను దర్శించే సమయం. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన కథ ఒకటి పద్మ పురాణంలో ఉంది.
పూర్వం మురాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను హింసించడమే కాక, ఇంద్రుడిని కూడా జయించాడు. ఇంద్రుని ప్రార్థనపై విష్ణువు మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి బదరికాశ్రమం చెంత ఉన్న హైమవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయాడు. అది తెలుసుకున్న మురుడు విష్ణువును సంహరించడానికి అదే తగిన సమయమని భావించి, గుహలో ప్రవేశించాడు. ఆ సమయంలో విష్ణువు శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించింది. ఆమె తీవ్రమైన చూపులతో మురాసురుడిని బూడిద చేసింది. శ్రీహరి మేల్కొని అక్కడున్న కన్యను, పడి ఉన్న బూడిద కుప్పను చూశాడు. ఆ రోజు ఏకాదశి. ఆ కన్య జరిగినదంతా విష్ణువుకు చెప్పింది. సంతోషించిన విష్ణువు ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. దానికి ఆ కన్య ‘ఏకాదశి నాడు నీ దేహం నుంచి జన్మించాను. కనుక నా పేరున వ్రతం ఆచరించి, ఉపవసించి, నారా యణుడిని పూజించిన వారు ఐహికా ముష్మికాలు పొందేలా వరం ఇవ్వాల’ని కోరింది. శ్రీహరి తథాస్తు అన్నాడు.
మరొక కథ ప్రకారం.. మధు కైటభులను మహా విష్ణువు సంహ రించగా, వారు దివ్య రూపాలను, దివ్య జ్ఞానాన్ని పొంది వైకుం ఠాన్ని నిర్మించి, ‘దేవా! ఏకాదశి వ్రతం నాడు ఉపవాసం ఉంది, ఉత్తర మార్గం ద్వారా నిన్ను దర్శించే వారికి మోక్షం ప్రసాదించాలి’ అని అర్థించారు. ఆ కారణంగా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేస్తే మోక్షం లభిస్తుంది. ఆ కారణంగా ఈ ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అనీ అంటారు.
సంతానాన్ని ప్రసాదించే పుత్రద ఏకాదశి..
వైకుంఠ ఏకాదశినే ‘పుత్రద ఏకాదశి’ అని కూడా అంటారు. సంతానం లేని వారు ఆనాడు ఉపవాసంతో పాటు విష్ణువును పూజిస్తే సంతానం కలుగు తుందని విశ్వాసం. భద్రావతి రాజ్యాన్ని పరిపాలించిన సుకేత మహారాజు భార్య శైవ్యతో కలిసి విష్ణువును ఏకా దశి నాడు మునులు పూజిస్తున్న విష యాన్ని తెలుసుకుని తానూ ఆచరించి సంతానాన్ని పొందాడు. అలా వైకుంఠ ఏకాదశికి పుత్రద ఏకాదశి అనే పేరు వచ్చింది.
ఎలా ఆచరించాలి?
ప్రతి నెలా వచ్చే ఏకాదశుల్లో ఉపవాసం చేయలేని వారు కనీసం ఈ వైకుంఠ ఏకాదశి నాడైనా వ్రతం ఆచరించాలి. ఈ రోజున ప్రాతకాలం లోనే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఇంట్లోని దేవుని గదిలో దీపారాధన చేసి విష్ణు భగవానుడిని ఆరాధించాలి. అవకాశం ఉంటే తామర వత్తులు, నెయ్యి లేదా కొబ్బరినూనెతో దీపారాధన చేయాలి. తులసి, బిల్వదళం, జాజిపూలు, సంపెంగలతో విష్ణు ఆరాధన చేయాలి. అనంతరం ‘ఓం నమో నారాయణాయ నమ:’ లేదా మరేదైనా విష్ణు నామాన్ని జపించాలి. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునే వారు తమ తమ శరీర్ధర్మాలను బట్టి ముందు రోజు రాత్రి, అంటే దశమి రాత్రి కేవలం అల్పా హారం తీసుకోవాలి. ఏకాదశి నాడు పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండాలి. ద్వాదశి నాడు పారాయణం చేయాలి. అంటే ఏకాదశి మర్నాడు ఉదయమే నిద్రలేచి పూజాదికాలు పూర్తి చేసుకుని దేవునికి నైవేద్యానిన సమర్పించి, వెంటనే భోజనం చేయాలి. అవకాశం ఉంటే ఎవరినైనా భోజనానికి ఆహ్వానించి అర్ఘ్యపాదాలు ఇచ్చి అతిథితో కలిసి భోజనం చేస్తే విశేషమని అంటారు. అలాగే, ద్వాదశి రాత్రి కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి.
ఉపవాసం ఎలా చేయాలి?
ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం. కేవలం నిరాహారంగా ఉండటం మాత్రమే ఉపవాసం అనిపించుకోదు. విష్ణు నామ పారాణయం, భజనలు, కీర్తనలు.. ఇలా ఏదో విధంగా దేవుడికి దగ్గరగా ఆ రోజంతా గడ పాలి. సమీపంలోని విష్ణువాలయానికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉంటే పేదలకు దానధర్మాలు చేయాలి. శరీరం సహకరించని వారు, లౌకిక అవసరాలతో ఉపవాసం చేయలేని వారు కనీసం ఆ రోజు అంతా భగవన్నామ స్మరణతో తమ దైనందిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల 12 రకాల ప్రయోజనాలు ఉంటాయని అంటారు. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు.. మొత్తం పదకొండింటిని భగవంతునికి సమర్పించాలి. వీటిని బుద్ధితో ఒకటిగా చేయడమే శుద్ధత్వం. అదే ఏకాదశి వ్రతం.
ఏకాదశి నాడు తింటే..
బ్రహ్మ వరంతో మురాసురుడు అనే రాక్షసుడు ఏకాదశి నాడు ఎవరైతే ఆహారం తీసుకుంటారో వారి ఆహారం నుంచి వచ్చిన శక్తిని తనకు ఆహారం (శక్తి)గా పొందేలా వరం పొందాడు. కాబటి
Review మోక్ష మార్గం.. వైకుంఠ ద్వారం.