నారు పోసిన వాడే నీరు పోస్తాడూ

ఇది వ్యవసాయదారుల్లో ఎక్కువగా వాడుకలో ఉన్న సామెత. నేలలో విత్తనాలు చల్లితే కొన్నాళ్లకు అవి మొలకలెత్తుతాయి. ఆ చిన్న చిన్న మొక్కలను మరో చోట పాతడానికి ఉపయోగిస్తారు. వాటిని నారు అంటారు. ఈ నారు వేసినపుడు, బాగా ఎండ కాస్తే నీటి తడులందక అవి ఎండుముఖం పడుతుంటాయి. అప్పుడు వాటిని బతికించుకోవడానికి రైతులు పడే ఇబ్బందుల నుంచే ఈ సామెత పుట్టిందని భావించాలి.
అయితే, ఈ సామెత రెండు విధాలుగా పుట్టుకొచ్చిందని అంటారు.
ఒకటి-బతకడం, బతికించుకోవడం అనేవి అంతా మన చేతుల్లోనే ఉందను కోవడం, ఆ గర్వంతో విర్రవీగడం వెర్రితనం. అంతా దైవానుగ్రహంతోనే జరుగుతుందనేది సత్యం. మనం ఎన్నాళ్లు బతుకుతామో, ఈ భూమ్మీద ఎన్నాళ్లు
ఉంటామో మనకే తెలియదు. కాబట్టి దైవంపై భారం వేసి.. ‘ఈ పుట్టుక ఇచ్చిన వాడు బతుకును కూడా ఇస్తాడు’ అనే ఆశాభావంతో బతకడమే మన కర్తవ్యం కావాలనేది ఈ సామెత బోధించే తత్వం. పుట్టించిన వాడే మన మంచి చెడ్డలు చూస్తాడనే భరోసాతో పుట్టిన సామెత ఇది.
రెండు- మనది వ్యవసాయ ప్రధాన దేశం. అయితే, సాగునీటి వనరులు అంతగా, అన్నిచోట్లా అందుబాటులో లేవు. దీంతో రైతులు పంటలు వేసి ఆకాశం వైపు వర్షాల కోసం ఎదురు చూడటం పరిపాటి. విత్తనాలు విత్తి, వర్షాలు సకాలంలో పడకుంటే, ఆ విత్తనాలు ఎండిపోతుంటే రైతులు ఆశతో మనసులోనే భగవంతుడికి చేసుకునే విన్నపమే ఈ సామెతగా పుట్టిందనేది మరో వాదన.
అటువంటి సందర్భాల్లోనే ‘నారు పోసిన వాడే నీరు పోస్తాడు’ అని వరుణుడిపైనే భారం వేసి రైతులు కాసింత ఊరట పొందుతారు.

Review నారు పోసిన వాడే నీరు పోస్తాడూ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top