ఒక ప్రముఖ వ్యక్తి వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోటు బయటకు తీశాడు. ఆ గదిలో కనీసం రెండు వందల మంది వరకు ఉన్నారు. ఆయన అందరినీ ఇలా అడిగాడు-
‘ఈ వెయ్యి రూపాయల నోటు ఎవరెవరికి కావాలి?’. అంతే. చేతులు ఒక్కొక్కటిగా పైకి లేచాయి. దాదాపు అందరూ చేతులు పైకి ఎత్తారు.
‘నేను మీలో ఒకరికి మాత్రమే ఈ వెయ్యి రూపాయల నోటు ఇస్తాను. కానీ, దానికి ముందు నేనొకటి చేస్తాను’ అంటూ ఆ నోటును చేతితో నలపడం ప్రారంభించాడు. రెండు నిమిషాల తరువాత మళ్లీ అడిగాడు. ‘ఇప్పుడు ఈ నోటు ఎవరికి కావాలి?’.
అయినా కూడా అందరూ చేతులు ఎత్తడం ఆపలేదు.
‘సరే!’ అంటూ ఆయన తన చేతిలోని ముడతలు పడి నలిగిన వెయ్యి రూపాయల నోటును కింద పడేసి బూటు కాలితో నలపడం మొదలు పెట్టాడు. కొద్దిసేపటి తరువాత దానిని చేతిలోకి తీసుకుని ‘ఇప్పటికీ ఇది ఎవరికి కావాలి?’ అని అడిగాడు.
నలిగిపోయి, మాసిపోయినా ఆ నోటు కోసం ఎవరికి వారే తమకు కావాలంటూ చేతులు ఎత్తి అంగీకారం తెలిపారు.
‘ప్రియ మిత్రులారా! మనం ఇప్పటి వరకు ఒక విలువైన పాఠం నేర్చు కున్నాం. డబ్బుకు ఎంత చిరుగులు పడినా, నలిగిపోయినా దాన్ని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అది దాని విలువను ఎంత మాత్రం కోల్పోలేదు కాబట్టి ఈ నోటు ఇప్పటికీ, ఎప్పటికీ వెయ్యి రూపాయల నోటే. ఈ నోటులాగే మన జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం ఎందుకూ పనికిరాని వారమని, మన బతుకులు వ్యర్థమని అనుకుంటాం. కానీ, ఏం జరిగినా, ఏం జరగబోతున్నా మన విలువను మాత్రం కోల్పోం. మనల్ని ప్రేమించే వారికి మనం ఎల్ల ప్పుడూ అమూల్యమైన బహుమతులమే అని వివరించాడు ఆ వ్యక్తిత్వ వికాస ఉపన్యాసకుడు.
Review అమూల్య బహుమతి.