‘‘మీ అబ్బాయికి ఎన్నేళ్ళు ?’’ అని అడిగింది సరళ. ‘‘రెండేళ్ళు-’’ అని జవాబు చెప్పింది ఊర్మిళ. ఆ మాట వింటూనే ఉలిక్కిపడింది సరళ-’’ అమ్మో … అయితే రెండేళ్ళ రౌడీ అన్నమాట-’’ అంటూ నవ్వింది.
‘‘ఆ మాట నిజమే. అవటానికి రెండేళ్ళే కాని మావాడు చేసే అల్లరి అంతా యింతా కాదనుకో – ప్రాణాలు విసిగించేస్తున్నాడు. ఏ వస్తువూ కింద పెట్టటానికి వీల్లేదు కదా అన్నింటినీ పారబోస్తాడు. ఒక చోట వుండడు. తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళి ఎక్కడో పడి కెవ్వుమంటాడు. ఒక క్షణం ఏమరుపాటుగా కూర్చొవటానికి వీలు లేదు కదా-’’ అంటూ ఊరిళ్ళ యింకా ఏదో చెప్పబోతూనే వుంది. ఇంతలో ఘల్లుమన్న శబ్దమూ, ఆ వెంటనే కెవ్వుమన్న ఏడుపూ వినపడ్డాయి.
ఊర్మిళ కొడుకు గాజుగ్లాసులున్న టేబుల్ దగ్గరకు వెళ్ళి టేబుల్ క్లాత్ అంచులు పట్టుకు లాగాడు. దాంతో గాజుగ్లాసులన్నీ ఘల్లున కింద పడి, భళ్ళున బద్దలైపోయాయి. ఊర్మిళ సుపుత్రుడు హడలిపోయి ఏడుపు లంకించుకున్నాడు. గాజు పెంకులు ఎక్కడ గుచ్చుకుంటాయోనని కంగారు పడిపోతూ పరిగెత్తి ఊర్మిళ కొడుకును చంకన వేసుకుంది. ఆ తర్వాత తీరిగ్గా ‘‘నిక్షేపమంటి గాజుగ్లాసులు నాశనం చేశావు వెధవా’’ అంటూ విసుక్కుంది. అబ్బాయి చిద్విలాసంగా నవ్వాడు. అబ్బాయి నవ్వు చూసి గాజుగ్లాసులు మాట మరిచిపోయి- ‘‘ఇంకా నయం… లేచిన వేళ మంచిది. గాజు పెంకులు గుచ్చుకున్నాయి కాదు’’ అంటూ కొడుకును గుండెలకు హత్తుకొంది. ఈ తల్లీకొడుకుల సరాగాలు చూస్తూ సరళ పెద్దగానే నవ్వింది. ‘‘నేను చెప్పలేదా రెండేళ్ళ రౌడీలతో వేగటం కష్టమని.’’ అంది.
ప్రయోగాలు ప్రారంభం
సరళ అన్న మాటలు నిజమే. రెండు మూడు సంవత్సరాల మధ్య పిల్లలు చాలా ఎక్కువగా అల్లరి చేస్తారు. ఈ వయస్సులోనే వారు అన్నిటిని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నాలు ప్రారం భిస్తారు. తమ పరిసరాలను గురించి తమకు కనపడుతున్న వస్తువుల గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఈ వయసులోనే జాస్తి అవుతుంది. దాంతో తమకు తారసపడ్డ ప్రతి వస్తువుతో ప్రయోగాలు ప్రారంభిస్తారు. చేతులతో తాకి, ముక్కుతో వాసన చూసి, కొరికి రుచి చూసి – ఆ వస్తువు గట్టిగా వుందో మెత్తగా వుందో దాని వాసన ఎలా వుందో, రుచి ఎలా వుందో తెలుసుకోటానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీమనకు చెప్పకపోవచ్చు – వారి చేష్టలు మనకు సరిగా అర్థం కాకపోవచ్చు కాని పిల్లలు మాత్రం తమ చిట్టిచిట్టి ప్రయోగాల ద్వారానే ప్రతి విషయాన్ని గ్రహించాలని ఆరాటపడుతూ వుంటారు. ఆ కుతూహలంతోటే ప్రతి వస్తువును తాకుతూ, కొరుకుతూ, వాసన చూస్తూ వుంటారు. అవి గాజు వంటి సున్నితమైన వస్తువులైతే కిందపడి పగిలిపోవటం పెద్దవారి విసుగుకు కారణమవటం జరుగుతూవుంటుంది. అయినా పిల్లల ఉత్సాహానికి మాత్రం అంతుండదు.
రెండు మూడు సంవత్సరాల మధ్య వయస్సు లోనే పిల్లలు ఎన్నో విషయాలను తెలుసు కుంటారు. తమ చేతులను, కాళ్ళను, కళ్ళను, చెవులను ఉపయోగించి విషయ సేకరణ చేస్తూ వుంటారు. పిల్లలకు తమ పరిసర ప్రపంచం తోటి స్థూల పరిచయం ఈ వయసులోనే ఏర్పడుతుంది.
ఆట కాదు, పనే!
తమకు కనపడ్డ ప్రతి వస్తువును చేతితో పట్టుకొని అదేమిటో తెలుసుకోవాలని ప్రయత్ని స్తారు. ఆ వస్తువును తలక్రిందులు చేసి తమాషా చూస్తారు. కిందపడేసి శబ్దాన్ని ఆలకిస్తారు. ఏద యినా ఒక వస్తువు కిందపడినప్పుడు ఘల్లుమన్న శబ్దం వచ్చినట్లయితే – ఆ శబ్దాన్ని తిరిగి వినటానికి ఆ వస్తువును మళ్ళీమళ్ళీ కింద పడేస్తూ వుంటారు. ఇదంతా ఆట అనో అల్లరి అనో పెద్దవాళ్ళు అనుకుంటారు కాని అది సరికాదు. పిల్లలకు సంబంధించినంత వరకు అది ఒకపనే. ముఖ్యమైన పని కూడా. ఈ పని వల్లే వారెన్నో విషయాలను తెలుసుకుంటారు.
రెండు మూడు సంవత్సరాల మధ్య వయసు కల పిల్లలు వస్తువులను స్ప•శించటం, కొరకటం, విసిరి వేయటం చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయటం వంటి వాటి ద్వారా చాలా విషయాలను తెలుసుకుంటారు. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా తామంత•తామే స్వయంకృషితో సొంతంగా ప్రయోగాలు చేస్తూ తమ పరిజ్ఞానాన్ని వృద్ధి చేసుకోటానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో తల్లిదండ్రులు కూడా సహకరించి వారిని ప్రోత్సహిస్తూ – ఆటలు అల్లరి అను కుంటున్న వారి కృషిలో తామూపాలు పంచు కొన్నట్లయితే పిల్లలు నేర్చుకోగలగటం మరింత సులభమౌతుంది. కాని చాలా మంది తల్లి దండ్రులు యీ విధంగా ఆలోచించరు. పిల్లలు అల్లరి చేస్తున్నారనో, వస్తువులు పాడు చేస్తారనో భావించి వీలయినంత వరకు వారికి ఏ వస్తువూ అందకుండా చేస్తారు. పగిలే వస్తువులూ, వారికి హానికలిగించే వస్తువులూ అందుబాటులో లేకుండా చేయవచ్చుకాని – అసలు ఏ వస్తువూ అందకుండా వారి కాళ్ళు చేతులు కట్టేసినట్లు చేయటం మాత్రం ఉచితం కాదు. ఇలా చేయడం వారి గ్రహణశక్తికి ఆటంకం కలిగించినట్లే అవు తుంది.
నీటితో ఆటలు
ఒక బాబు లేక పాప ఒక గ్లాసులోని నీళ్ళు మరొక గ్లాసులోకి వంపుతూ వినోదిస్తుంటే నీళ్ళు పారపోస్తున్నారనీ, ఇల్లంతా మడుగు చేస్తున్నారనీ కంగారుపడే తల్లిదండ్రులు అనేక మంది వున్నారు. అంతేకాని అలా చేయటం ద్వారా నీటికి కల ప్రవహించే శక్తిని గురించి, ఏ పాత్రలో ఎన్ని నీళ్ళు పడతాయో వంటి పరిమాణ సూత్రాలను గురించి పిల్లలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నా రని గ్రహించరు. కాని పిల్లలు ఈ మాదిరి ప్రయోగాల ద్వారానే యిటువంటి విషయాలను తెలుసుకుంటారు.
ప్రతి వస్తువుని కింద వేసి చూడటం, పూల కుండీల్లోని మొక్కలను సైతం పీకి పరీక్షించటం వంటి పనులు కూడా చిన్న పిల్లలు చేస్తుంటారు. అలాంటి సందర్భాలలో గాజు సామాను గురించి, వాటి పగిలిపోయే స్వభావాన్ని గురించి కొంచె మైనా అర్థమయేలా పిల్లలకు చెప్పాలి. అలాగే నేల మీద మట్టిలో నుంచి కాని, పూల కుండీలో నుంచి కాని మొక్కలను పీకినట్లయితే అవి చచ్చిపోతాయిని – మొక్కలను పీకకూడదని చెప్పాలి. కొంచెం ఓర్పుగా పిల్లలకు అర్థమయేలా – వారికి కొన్ని కొత్త విషయాలను నేర్పినట్లే అవుతుంది. తర్వాత వారు గాజు సామాను జోలికి వెళ్లకుండాను మొక్కలను పీకకుండాను వుంటారు.
అంతేకాక….
ఈ వయసులోనే పిల్లలకు వస్తువుల పేర్లు చెప్పి, వాటిని గుర్తించటం నేర్పాలి. రంగుల గురించి, వస్తువుల ఆకారాలను గురించి చెప్పాలి. ఒకే ఆకారం లేదా ఒకే రంగు కల వస్తువులను ఒకచోట చేర్చటం వంటి ఆటల ద్వారా పిల్లలు రంగులు, ఆకారాల గురించి తెలుసుకోగలుగు తారు.
రెండు మూడు సంవత్సరాల మధ్య వయ స్సులో పిల్లలలో ఉత్సాహం పొంగి పొర్లుతూ వుంటుంది. అన్నింటినీ గురించి తెలుసుకోవాలనే ఆరాటం అధికమౌతుంది. అ ఉత్సాహం, ఆరాటాల వల్లే అన్ని వస్తువులను పడేస్తూ, పార బోస్తూ, ధ్వంసం చేస్తూ తాము పడుతూ దెబ్బలు తగిలించుకుంటూ తల్లిదండ్రులకు ఊపిరి సలప కుండా చేస్తూవుంటారు. రెండేళ్ళ రౌడీలు అన్న పేరును కూడా సంపాదించుకుంటారు. ఈ అల్లరీ ఆగడాలన్నీ, తమ పరిసరాలను గురించి వారు తెలుసుకోటానికి చేసే ప్రయత్నాలని గ్రహించి ప్రోత్సహించినట్లయితే – ఒక క్రమపద్దతిలో వారు తెలుసుకునేటట్లు చేయగలిగినట్లయితే అది వారి భవిష్యత్ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది.
Review అల్లరి పనులు కాదు అవే వాళ్ళ ప్రయోగాలు..