గంట కొట్టేదెవరు?

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో ఉంటుంది.

ఒక గ్రామంలో ఒక దొంగ ఆలయంలోని గంట దొంగిలించి అడవిలోకి పారిపోయాడు. ఊరిలోని వారంతా అతని వెంట పడ్డారు. దొంగ పరుగెడుతుంటే చప్పుడు అవుతుంది కదా. దీంతో ఆ చప్పుడు విన్న గ్రామస్తులు తనను సులభంగా పట్టేస్తారని భావించిన దొంగ ఆ గంటను అడవిలో దాచివేసి తనూ వేరేచోట దాక్కున్నాడు. దొంగ కోసం వెతికి.. ఎంతకీ దొరక్క పోయేసరికి గ్రామస్తులంతా వెళ్లిపోయారు.
కాలక్రమేణా ఈ సంఘటన గురించి అందరూ మర్చిపోయారు.

ఒకరోజు సాయంత్రం హఠాత్తుగా గంట మోగడం మొదలుపెట్టింది. అడవిలో నుంచి గంట చప్పుడు గ్రామంలోని వారందరికీ బిగ్గరగా వినిపించసాగింది. గ్రామస్తులంతా భయపడ్డారు. గంట కొడుతున్నది ఎవరు? అని ఒకరితో మరొకరు చర్చించుకున్నారు.
చివరకు సమాధానం లభించని నేపథ్యంలో.. అడవిలో ప్రేతాత్మలు ఉన్నాయని, అవే గంట కొడుతున్నాయనే ఒక ఆధారం లేని వదంతి మొదలయింది. గ్రామంలోని వారంతా భయపడి అడవి వైపు వెళ్లడం మానేశారు. కానీ, ఇది ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే పాత కాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవి కావు. పొయ్యిలోకి కట్టెలు కావాలన్నా, వేటాడాలన్నా, చేపలు పట్టాలన్న, వేరే గ్రామాలకు వెళ్లాలన్నా అడవిలో నుంచి వెళ్లక తప్పదు. ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్లకపోతే గ్రామస్తులకు రోజు గడవదు కదా! కడుపు నిండదు కదా!. అయినా భయపడి ఎవరూ అడవికి వెళ్లే వారు కాదు.
అయితే, మాటి మాటికీ గంట శబ్దం వినిపించడం ఒక సాధారణ విషయం అయిపోయింది. గంట మోగినప్పుడల్లా ఊళ్లో వాళ్లకి చెప్పుకోలేనంత భయం కలిగేది. ఈ భయం పడలేక కొందరైతే ఏకంగా ఊరిని వదిలి వెళ్లిపోయారు.

రోజులు ఇలా గడిచిపోతుండగా, ఒక అవ్వ మాత్రం ధైర్యం చేసింది.

‘అసలు గంట ఎవరు కొడుతున్నారు?’ అనేది తెలుసుకోవాలనే కుతూహలం ఆమెకు కలిగింది. దెయ్యాలు, ప్రేతాలపై ఆమెకు నమ్మకం లేదు.
ఒకరోజు గంట చప్పుడు వినిపిస్తోంటే ఉండబట్టలేక పోయింది. అడవిలోకి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంది.
ఒకరోజు అలాగే వెళ్లింది కానీ, ఎక్కడా గంట ఎవరు కొడుతున్నారో కనిపించలేదు. అడవిలో కొద్దిసేపు అటూఇటూ తిరిగి ఇంటికి వచ్చేసింది.
మర్నాడు మళ్లీ గంట శబ్దం వినిపించింది. ఈసారి ఆ అవ్వ మళ్లీ గంట శబ్దం వినిపిస్తున్న దిశగా వెళ్లసాగింది. పరిశీలనగా వెళ్లేసరికి గంట చప్పుడు ఎటువైపు వస్తుందో ఆమె గుర్తించగలిగింది. కొంత సేపటికి ఆమె అంచనా నిజమైంది. గంట శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించడంతో పాటు గంట శబ్దం ఎలా వస్తుందో కూడా చూసి ఆశ్చర్యపోయింది. దాంతో పాటు పడీపడీ నవ్వడం మొదలు పెట్టింది.
ఎందుకంటే ఆ గంట ఒక చెట్టుకు వేలాడుతోంది. ఆ చెట్టు మీద బోలెడన్ని కోతులు ఉన్నాయి. గాలి సవ్వడికి, కోతుల అలికిడికి ఆ గంట శబ్దం చేస్తోందని ఆ అవ్వ గ్రహించింది.

అవ్వ జరిగిందానికి నవ్వుకుంటూ ఊరిలోకి వెళ్లిపోయింది. వెళ్లి ఊరి పెద్దను కలిసింది.

‘ఈ గంట బాధ నుంచి ఎలా విముక్తి చేయాలో ఒక ఉపాయం తట్టింది. దానికి నాకు కొంత సామగ్రి కావాలి. మీరు కొంత డబ్బు ఇప్పిస్తే, నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను. ఇంకెవ్వరూ గ్రామం వదిలి పోనవసరం లేదు’ అని ఊరి పెద్దతో అవ్వ చెప్పింది.
ఊరి పెద్ద ఆ అవ్వకు కొంత డబ్బిచ్చి పంపించాడు. మరన్నాడు అవ్వ తన పెద్ద కొడుకును వెంటబెట్టుకుని బజారులోకి వెళ్లి అరటి, మామిడిపండ్లు, వేరుశనగ పల్లీలు కొనింది. ఇద్దరూ కలిసి వాటిని తీసుకుని అడవికి వెళ్లారు. అవ్వ ఏదో పూజ చేస్తుందని ఊరి వారంతా అనుకుని, ఏం చేయబోతుందా అని ఆసక్తిగా చూడసాగారు.
అవ్వ నేరుగా గంట ఉన్న చెట్టు వద్దకు వెళ్లి అరటి, మామిడి పండ్లు, పల్లీలు విసిరింది. వాటిని కోతులు చెట్టు దిగి వచ్చి తినసాగాయి. అవ్వ కొడుకు ఇదే అదనుగా చటుక్కున చెట్టెక్కి గంటను తీసుకుని కిందకు దిగిపోయాడు.

ఇద్దరూ గంట తీసుకుని గ్రామంలోకి వచ్చారు. అవ్వ చెప్పినదంతా విని గ్రామస్తులంతా ఆమె తెలివితేటలను మెచ్చుకున్నారు.

Review గంట కొట్టేదెవరు?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top