ఒక గద్దకు, నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టు మీద గూడు కట్టుకుని ఉంటే, ఆ చెట్టు కింద గల బొరియలో నక్క నివాసం ఏర్పర్చుకుని జీవిస్తోంది.
కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే, ఒకరోజు నక్క ఆహారం కోసమని అడవిలోకి వెళ్లింది. అది అదనుగా చూసుకుని, గద్ద నక్కపిల్లను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి, తనూ హాయిగా ఆరగించింది.
కాసేపటి తరువాత తిరిగి వచ్చిన నక్కకు తన పిల్ల కనిపించలేదు. గద్దను అడిగితే తనకేం తెలియదంటూ అమాయకత్వం ఒలకబోసింది. నక్క తన పిల్ల కోసం అడవంతా గాలించింది. అయితే, ఆలోచించగా నక్క గద్ద చేసిన ద్రోహాన్ని తొందరలోనే కనిపెట్టింది. అయినా ఏమీ చేయలేక మౌనంగానే రోదించింది.
ఇలా ఉండగా, కొద్ది రోజుల తరువాత తన గూటికి దగ్గరిలో కొందరు వ్యక్తులు ఒక గొర్రెను బలి ఇచ్చి, మాంసాన్ని కాల్చడాన్ని గద్ద గమనించింది. ఎలాగైనా ఒక మాంసం ముక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది. మెల్లగా వెళ్లి కాస్తంత మాంసాన్ని నోట కరుచుకుని పైకి ఎగిరింది. ఆ వ్యక్తులు ఎక్కడ పట్టుకుంటారోనని భయపడి గబగబా గూటికి చేరుకుంది.
అయితే, మాంసాన్ని దొంగిలించే క్రమంలో దాని తోకలోని ఒక ఈకకు నిప్పురవ్వ అంటుకుంది. గద్ద గాల్లోకి ఎగిరినపుడు ఆ రవ్వ మెల్లగా రాజుకుంది. గద్ద గూటికి చేరగానే, ఎండుపుల్లలతో నిర్మించిన ఆ గూటిలోని పుల్లలకు నిప్పురవ్వ అంటుకుని మరింతగా మంటలు లేచాయి. గూడంతా మంటలు అలముకున్నాయి. ఆ బాధకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్ద పిల్లలు కింద పడిపోయాయి. అది చూసి నక్క వాటిని తినేసింది. కళ్ల ముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా రోదించింది. ఆ రోజు నక్కకు తాను ద్రోహం చేయకుండా ఉండి ఉంటే, ఈ రోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది.
నీతి: నమ్మిన వాళ్లను మనం బాధపెడితే చివరకు మనకూ బాధే మిగులుతుంది.
Review నమ్మకద్రోహం.