
శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. తన చమత్కారాలు, సమయస్ఫూర్తితో రాయల వారిని సంతోషపరిచి ఎన్నో బహుమతులు పొందేవాడు.
ఒకసారి నలుగురు పేరుమోసిన దొంగలు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి, రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయ్యింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి వెళ్లాడు. అనుకోకుండా అరటి చెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యను పిలిచి పెద్దగా ఇలా అన్నాడు.
‘ఊళ్లో అసలే దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు, నాణాలు ఇంట్లో ఉంచకు. వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం’.
ఇలా అంటూనే రామలింగడు తన భార్య చెవిలో ఏదో చెప్పాడు.
ఇదంతా దొంగలు వింటూ, చూస్తూ ఉన్నారు.
అనంతరం రామలింగడు ఇంటి లోపలికి వెళ్లి ఒక మూటను తయారుచేశాడు. దాన్ని భార్య సాయంతో బావిలో పడేశాడు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిద్రపోయే దాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. దీంతో నీరు బయటికి తోడితే మంచిదని మరో దొంగ సలహానిచ్చాడు. సరేనని చేదను బావిలోకి వదిలి చాలాసేపు నీరు తోడిపోశారు.
రామలింగడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు. మళ్లీ మరో ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటిలోకి వెళ్లి అరటి చెట్లకు నీళ్లు బాగా పారేలా పాదులు చేశాడు. వంతుల వారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారుజామున కోడికూసే వేళ వరకూ దొంగలు అలా నీటిని తోడిపోస్తూనే ఉన్నారు. చివరకు బావిలో మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని దొంగలు మురిసిపోయారు. ఎంతో ఆశగా మూట ముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్లు ఉన్నాయి. దొంగలకు నోటమాట రాలేదు. రామలింగడు తమను మోసం చేశాడని వారికి అర్థమైంది. ఇంకా అక్కడే ఉంటే తమను సైనికులకు పట్టిస్తాడేమోనని భయపడి అక్కడి నుంచి జారుకున్నారు.
ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసి పడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కానీ, రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. తెలివిగా రామలింగడే దొంగల చేత తన అరటి తోటకు నీరు పారించగలిగాడు. ఇదంతా శ్రీకృష్ణదేవరాయలకు మరా
Review రామలింగడు.. నలుగురు దొంగలు.