ఆ వస్తువు తీసి ల కోటాలో పెట్టు!

ఎవరో ఒకరు పుట్టించకుండా మాటలెలా పుడతాయి?
అవును. మన తెలుగులో ప్రసిద్ధ రచయితలు రాసిన, వాడిన పదాలు, మాటలను ఎవరూ పట్టించుకోకపోతే ఏమైపోతాయి?
ఇదీ నిజమే. మరీ ప్రాచీనకాలం నాటివీ కాదు.. అలాగని మరీ ప్రబంధ కాలం నాటివీ కాదు.. ఆధునిక యుగం ప్రారంభమయ్యాక వెలువడిన తాజా రచనల్లోని పదాలను కూడా మనం పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. నిజానికి అవెంతో అర్ధవంతమైనవి. మరెంతో అందమైనవి. అటువంటి ఆణిముత్యాల్లాంటి పదాలు మన తెలుగుకే సొంతం. కానీ, వాటిని మనం ఏనాడో వదిలేశాం. అటువంటి కొన్ని మాణిక్యాల వంటి తెలుగు పదాలను పరిచయం చేసుకుందాం.

లకోటా

1902లో భండారు అచ్చమాంబ ‘స్త్రీ విద్య’ అనే కథలో ఈ పదాన్ని ప్రయోగించారు. ‘కాగితంపై రాసిన ఉత్తరాన్ని తపాలా ద్వారా చిరునామాదారుడికి చేరవేసేందుకు వాడే కాగితపు సంచి’ అని లకోటా అనే పదానికి అర్థం. ఓ యువకుడు తన భార్యతో ‘నాకు ఉత్తరం రాసి లకోటాలో వేసి.. పోస్టులో వేయించితివి’ అంటాడు ఈ కథలో. కొన్ని నిఘంటువుల్లోకి కూడా ఈ పదం చేరింది. మనం అలవాటుగా వాడుతున్న ‘కవర్‍’ అనే ఆంగ్ల మాటకు ఇంత నిర్ధిష్టమైన అర్థం లేదు. ఎందుకంటే ఆంగ్లంలో ‘పాలిదీథీన్‍’ కవర్‍’, ‘పేపర్‍ కవర్‍’ అనే ప్రయోగాలు ఉన్నాయి. సిపి బ్రౌన్‍ ‘ది ఎన్వలప్‍ ఆఫ్‍ ఎ లెటర్‍’ అని స్పష్టంగా చెప్పాడు తెలుగు-ఇంగ్లిషు నిఘంటువులో.

లంకిణీగుడ్డ

కాకినాడ నుంచి వెలువడిన ‘హిందూ సుందరి’ మాస పత్రిక (1914, ఏప్రిల్‍)లో ఏకా వెంకటరత్నం అనే రచయిత్రి వాడిన మాట ఇది. గొడుగు గుడ్డ అని ఈ పదానికి అర్థం. ‘తాటాకు గొడుగుల స్థానంలో చెత్తపు గొడుగులు లంకిణీ గుడ్డలు వేసినవి వచ్చెను’ అని ఆమె రాశారు. శబ్దరత్నాకరంలో ఈ పదాన్ని అన్యదేశ్యంగా సూచించి ‘ఒక విధమైన బట్ట’ అనే అర్థాన్నిచ్చారు. కానీ సీపీ బ్రౌన్‍ తెలుగు-ఇంగ్లిష్‍ నిఘంటువులో లంకినీ, లంకినీ గుడ్డ, లంకినీలు అనే పదాలు ఇచ్చి ఇంగ్లిష్‍లో ‘నాన్‍కీన్‍ క్లాత్‍’ అంటారని, ‘గొడుగులకు వేసే దళముగా ఉండే గుడ్డ’ అనే అర్థాన్నిచ్చాడు. ‘నాన్‍కీన్‍ క్లాత్‍’ అంటే పసుపు పచ్చని నూలు వస్త్రం అని ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఉంది.
వాళీ
1935లో భమిడిపాటి కామేశ్వరరావు ‘మన తెలుగు’ అనే వ్యాసంలో ఈ పదాన్ని అలవాటు ‘వాడుక’ అనే అర్థంలో వాడారు. కొందరు వాళీ అవడం చేత ఇంగ్లిషు పదాలు వాడుతుంటారని అన్నారు. శబ్దరత్నాకరంలో ఈ పదం ఉంది. సీసీ బ్రౌన్‍ ‘కస్టమ్‍’, ‘యూసేజ్‍’ అనే ఇంగ్లిషు అర్థాలు ఇచ్చారు.
అంచె కూలి, తపాలా కూలి
‘హిందూ సుందరి’ పత్రికలో 1914 జూన్‍లో ప్రచురితమైన పదాలివి. వీటికి మనం పోస్టల్‍ చార్జీ, పోస్టేజీ అనే ఆంగ్ల పదాలను వాడుతున్నాం. ‘అంచె కూలి’ అనే పదం నిఘంటువుల్లో చేరలేదు. కానీ అంచెలు అంచియలు అనే పదాలు ‘టపా’, ‘దఫా’, ‘వరుస’, ‘కొంత దూరం పోయి విశ్రమించెడి చోటు’, ‘దారిలోని మకాములు’ అనే అర్థాలతో ఉన్నాయి. తపాలా వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో లేఖలను దూర ప్రాంతాలకు చేరవేయాల్సి వచ్చినపుడు వ్యక్తులే అంచల వారీగా చేరవేసే వారు. ఆ వంతులే అంచెలు. దానికి సంబంధించిన కూలినే ‘అంచె కూలి’ అనేవారు. ధనవంతుల ఇళ్లలో పూర్వం పల్లకీలు మోసే బోయీలు కూడా అంచెలుగా మోసేవారని బ్రౌన్‍ నిఘంటువును బట్టి తెలుస్తోంది.

కరడా

సురవరం ప్రతాపరెడ్డి ‘శబ్దాల ముచ్చట’ అనే వ్యాసంలో ఈ పదం గురించి చెప్పారు. ఈ పదం తెలంగాణలో వాడుకలో ఉందని అన్నారు. దస్తూరీ చక్కగా అలవడటానికి బడిలో పిల్లలతో రాయించే కాపీ అనే ఆంగ్ల పదానికి తెలుగు పదమే ‘కరడా’. ‘కాపీ’కి ఉన్నంత విస్త•తమైన అర్ధం కాక నిర్ధిష్టమైన అర్థం ఉంది కరడాకి. తెలుగు నిఘంటువుల్లో ఈ మాట చేరలేదని ప్రతాపరెడ్డి గారు అన్నారు. కానీ, ఆ తర్వాత చేర్చినట్టున్నారు. అనంతరం కాలంలో ముసునూరి వేంకటశాస్త్రి ‘ఆంధ్ర నామ సర్వస్వం’లోనూ, ‘శ్రీహరి నిఘంటువు’లోనూ ఈ పదం ఉంది.

Review ఆ వస్తువు తీసి ల కోటాలో పెట్టు!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top