శ్రీకృష్ణ దేవరాయల వారికి ఒకరోజు పొరుగు దేశపు రాజు కొన్ని ఫలాలను బహుమతిగా పంపించాడు. వాటితో పాటు ఆ రాజు ఒక లేఖ కూడా రాశాడు.
‘మహారాజశ్రీ శ్రీకృష్ణ దేవరాయల వారికి భక్తితో రాయునది..
మా దేశంలో తప్ప ఇంకెక్కడా కాయని అపురూపమైన అద్భుత ఫలాలను మీకు బహూకరిస్తున్నాను. వీటిని తిన్న వారు దీర్ఘాయుష్కులవుతారు. వారికి వృద్ధాప్య మరణమే తప్ప అకాల మరణం ఉండదు’ అనేది ఆ లేఖ సారాంశం.
శ్రీకృష్ణదేవరాయల ముఖం ఆనందంతో పొంగిపోయింది. సభలోని వారంతా ఎంతో అపురూపంగా ఆ ఫలాలను తాకి చూడసాగారు. తెనాలి రామకృష్ణుడి వంతు రాగానే కుతూహలం ఆపుకోలేక ఒక పండును తీసుకుని కొంచెం కొరికి రుచి చూశాడు. రామకృష్ణుడి చర్యకు అంతా ఆశ్చర్యచకితులయ్యారు. దేవరాయల ముఖం కోపంతో జేవురించింది.
‘నా కోసం పంపిన ఫలాలను నువ్వు ఎంగిలి చేస్తావా? ఎంత ధైర్యం నీకు? అందరి ముందు నన్ను అవమానించినందుకు నీకు మరణశిక్ష విధిస్తున్నాను’ అని రాయల వారు కోపం పట్టలేక రామకృష్ణుడిని ఉరి తీయాలని సైనికులను ఆదేశించారు.
‘అయ్యో! పొరుగు రాజు మనల్ని ఎంత మోసం చేశాడు? అనవసరంగా ఆయన మాటలు నమ్మాను కదా! ఆ ఫలాలను తిన్న వారికి దీర్ఘాయుష్షు ఉంటుందని చెప్పాడు. ఒక చిన్న ముక్క తిన్నందుకే నేను చనిపోబోతున్నాను. మరి పూర్తి ఫలం తిన్న వారి పరిస్థితి ఏమవుతుందో?’ అంటూ అందరూ వినేలా బాధపడ్డాడు రామకృష్ణుడు.
ఆ మాటలు విని అందరి ముఖంలో నిజమే కదూ! అన్న భావం తొంగిచూసింది. రాయల వారిలో కూడా ఆ అభిప్రాయమే కలిగింది. విపత్తు సమయంలో కూడా ఎంతో సమయస్ఫూర్తిగా ఆలోచించగల రామకృష్ణుడి విజ్ఞతకు ఆయన సంతోషించారు.
రామకృష్ణుడిని క్షమించడమే కాక బహుమతిగా కొన్ని ఫలాలను ఇంటికి తీసుకు వెళ్లాలని నవ్వుతూ ఇచ్చారు శ్రీకృష్ణ దేవరాయలు.
Review అద్భుత ఫలాలు.