అనగనగా..అన్నకు తగిన తమ్ముడు

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో ఉంటుంది.

రామాపురంలో అనే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి చనిపోతూ ఇద్దరు కుమారులను దగ్గరకు పిలిచాడు. వారికి ఒక మామిడిచెట్టు, కంబళి, ఆవు ఇచ్చి, వాటిని ఇద్దరూ సరి సమానంగా అనుభవించాలని చెప్పి కన్నుమూశాడు.
ఆ ఇద్దరిలో తమ్ముడు అమాయకుడు. అన్న గడుసువాడు. అన్న తమ్ముడితో- ‘నాన్న మనకు ఒకే చెట్టు, ఒకే ఆవు, ఒకే కంబళి ఇచ్చాడు. కాబట్టి వాటిని ముక్కలు చెయ్యకూడదు. కనుక వాటిని ఇద్దరం కలిసి ఉపయోగించుకుందాం. మామిడిచెట్టు మొదలు భాగం నీది. పై కొమ్మల భాగం నాది. అలాగే ఆవు ముందు భాగం నీది. ఆవు వెనుక భాగం నాది. ఇక కంబళిని రోజూ పగటి పూట నువ్వు ఉపయోగించుకో. రాత్రి నాకు ఇవ్వు’ అన్నాడు.
అన్న మాటల్లోని కపటం తెలియక తమ్ముడు సరేనన్నాడు.
రోజూ తమ్ముడు మామిడిచెట్టు మొదట కుదురులో నీళ్లు పోసే వాడు. ఆవుకు మేత, కుడితి పెట్టేవాడు. కంబళిని పగలు నిద్రించేటపుడు తల కింద దిండుగా పెట్టుకుని వాడుకునేవాడు.
తమ్ముడు తనకు వచ్చిన భాగాల మేరకు పై విధంగా చేస్తుండగా, అన్న మాత్రం.. ఏపుగా పెరిగిన మామిడిచెట్టుకు కాసిన కాయలను తాను కోసుకునేవాడు. ఆవు వెనుక భాగం తనది కాబట్టి చక్కగా పాలు పితుక్కునేవాడు. రాత్రికి కంబళిని తీసుకుని వెచ్చగా కప్పుకుని పడుకునేవాడు.
ఇలా కొంత కాలం గడిచిపోయింది. తమ్ముడికి వివాహం అయ్యింది. అతని భార్య.. భర్త అమాయకత్వాన్ని గ్రహించింది. తన భర్తను తన బావగారు ఎలా మోసం చేస్తున్నాడో ఆమె తెలుసుకుంది. భర్తతో ఒకరోజు ఒక మాట చెప్పి.. ఇక నుంచీ ఆ విధంగా చేయాలని చెప్పింది.
భార్య మాట ప్రకారం తమ్ముడు ఒకనాడు ఒక గొడ్డలి తెచ్చి దానితో మామిడిచెట్టును నరకడం మొదలు పెట్టాడు. అన్న కంగారు పడుతూ పరుగెత్తుకుని వచ్చి, ‘ఎందుకు చెట్టు నరుకుతున్నావు?’ అని అడిగాడు.
‘ఈ చెట్టు మొదలు నాది కదా! నా ఇష్టం. నరుక్కుంటాను.. ఏమైనా చే•సుకుంటాను’ అన్నాడు తమ్ముడు.
‘మొదలు నరికితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది, కొట్టకు. ఇక నుంచి దీనికి కాసే కాయలను ఇద్దరం చెరి సగం పంచుకుందాం. చెట్టు నరికితే ఆదాయం కోల్పోతాం’ అని అన్న తమ్ముడికి నచ్చ చెప్పాడు.
తమ్ముడు సరేనన్నాడు.
మరో రోజు అన్న ఆవు పాలు పితుకుతుండగా, తమ్ముడు వచ్చి ఆవు ముట్టిపై గట్టిగా కొట్టాడు. దీంతో పాలిస్తున్న ఆవు ఒక్కసారిగా బాధతో వెనుక ఉన్న అన్నను గట్టిగా కాలితో తన్నింది. ఈ దెబ్బకు అన్నకు దిమ్మ తిరిగింది.
‘ఎందుకు ఆవును కొట్టావు?’ అని కోపంగా అడిగాడు.
‘ఆవు ముందు భాగం నాది కదా! నా ఇష్టం, కొడతాను ఏమైనా చేస్తాను’ అని తమ్ముడు బదులిచ్చాడు.
తమ్ముడి ధోరణి అన్నకు కొద్ది కొద్దిగా అర్థమవసాగింది.
‘సరే. ఇక నుంచి ఇద్దరం కలిసి ఆవును మేపుదాం. అది ఇచ్చే పాలను కూడా చెరి సగం పంచుకుందాం’ అంటూ తమ్ముడితో అన్న రాజీకి వచ్చాడు.
ఆ మర్నాడు తమ్ముడు కంబళిని పగలంతా నీటిలో నానబెట్టి ఉంచాడు. సాయంత్రానికి ఆ తడి కంబళిని అన్నకు ఇచ్చాడు. అన్న దానిని ఉపయో గించలేకపోయాడు.
చేసేదేం లేక అన్న ఈ విషయంలో కూడా రాజీకి వచ్చాడు. ఇద్దరం దానిని రోజుకొకరం చొప్పున ఉపయోగించుకుందామని ప్రతిపాదించాడు.
ఆ విధంగా అమాయకుడైన తమ్ముడు తన భార్య సాయంతో అన్నను దారికి తెచ్చాడు.
తన తప్పు క్షమించాలని అన్న తమ్ముడిని కోరాడు. ఆ తరువాత అన్నదమ్ములు ఇద్దరూ తండ్రి పంచి ఇచ్చిన మామిడిచెట్టు, ఆవు, కంబళిని సమానంగా పంచుకుని సుఖంగా బతికారు.
ఈ కథలోని నీతి ఏమిటంటే.. అమాయకులను మోసం చేయరాదు.

Review అనగనగా..అన్నకు తగిన తమ్ముడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top