‘ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
అనురాగపు అంచులు చూస్తాం
ఆనందపు లోతులు చూస్తాం’’
ఇవి కొత్త సంవత్సరం మీద ఎవరైనా పెట్టుకొనే కొండంత ఆశలు. పాత సంవత్సరంలో సాధించలేనిది కొత్త సంవత్సంలో సాధించగలమని అనుకోవడం మానవ సహజం. అందుకే నూతన సంవత్సర ప్రారంభం అన్ని రోజుల్లాంటిదే అయినా ఆనందంతో గంతులేస్తారు. వారి కోరికలు తీరి భవిష్యత్తు బాగుపడ్డా లేకున్నా సంవత్సరపు తొలి రోజుల్లో ఆనందం వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. ఆనందానికి మించిన ఆరోగ్యం, విచారానికి మించిన అనారోగ్యం లేవు. అందుకే మన పెద్దలు ‘సంతోషమే సగం బలం’ అన్నారు. ఈ ఆనందానికి ఎన్నో నిర్వచనాలు. ఎన్నో మార్గాలు. ఇవి కాలానికి కాలానికి, మనిషికి మనిషికీ, ప్రదేశానికీ ప్రదేశానికీ మారవచ్చు.
ఆనందం సంతోషాలంటే…
రైల్వేస్టేషన్‍లో ఒకరోజు ఇద్దరు మిత్రులు కలుసుకుంటారు. ఒక మిత్రుడు కొంచెం సేపట్లో రాబోయే రైల్లో తన భార్యను ఎక్కించటానికి వస్తే రెండో మిత్రుడు అదే రైలులో వస్తున్న తన భార్యను రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. రైలు వచ్చింది. మొదటి మిత్రుడు తన భార్యను రైలు ఎక్కించి సంతోషంతో ముచ్చటిస్తున్నాడు. అయితే అదే రైలులో వచ్చిన రెండో మిత్రుని భార్య బండి దిగింది. దిగీ దిగడంతోనే వాదులాడుకోవడం మొదలు పెట్టారు ఆ భార్యా భర్తలు. కొంతసేపయిన తర్వాత రెండో జంట ఆనందంగా మాట్లాడుకోవడం గమనించి రెండవ మిత్రుని భార్య తన భర్తతో ‘‘వాళ్ళని చూసైనా నేర్చుకోండి, వచ్చీ రావడంతోనే గొడవ మొదలు పెట్టారు’’ అంటూ వెక్కిరించింది. దానికి సమాధానంగా రెండవ మిత్రుడు ‘‘తన భార్య వెళ్ళిపోతోంది, కాబట్టే వాడు ఆనందంగా ఉన్నాడు’’ అంటూ వెటకారంగా •వాబిచ్చాడు.
నిత్య జీవితంలో జరిగే అనేక సంఘటనలలో ఇది ఒక ఉదాహరణ. ఒకరికి సంతోషం కలిగించేది ఇంకొకరికి బాధ కలిగిస్తుంది. చాలామంది సంతోషం, ఆనందాలనేవి మిథ్యగా, మాయగా తలుస్తుంటారు. కొంతవరకు దానికి కారణం సుఖసంతోషాలు తాత్కాలిక మానసిక స్థితి కావడమే మన మానసిక స్థితి అడుగడుగునా మారుతుంటుంది. కాబట్టి గడిచిపోయిన స్థితిని, కొత్తగా వస్తున్న మానసిక స్థితి ప్రవాహంలో మరిచిపోవడం జరుగుతుంటుంది. ఆనందమే మిథ్యగా భావించేవాళ్ళు కూడా ఆనందాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు. కాబట్టి నిశ్చయంగా ఆనందం మాయ కాదు.
చాలావరకు ఆనందంగా గడిచే క్షణాలు చాలా తొందరగా గడిచి పోతుంటాయి. ఆ గడిచిన క్షణాలు తల్చుకుంటూ, ఆనందంగా గడిచాయి కదా అని వాటిని నెమరువేసుకోవడం కద్దు. అంటే తక్షణం మనం గుర్తించలేని ఈ లక్షణమే సుఖసంతోషాలను మరింత దూరం కావటానికి గురి చేస్తున్నాయి. అలాగే మనకు సంతోషం దేనివలన కలుగుతుందో అనే ప్రశ్న కంటే మనకు బాధ దేనివలన కలుగుతుందో సులభంగా జవాబు చెప్పగలు గుతాం. సంతోషానందాలు ఒక విశిష్టమైన వ్యక్తిగతమైన మానసిక స్థితి కావడం వల్ల ఒకరికి ఆనందం కలిగించేది ఇంకొకరికి ఆనందం కల్గించలేదు. అప్పుడయితే ఒకరికి ఆనందం ఇంకొకరికి చోద్యంగా కాని, బాధ కల్గించేదిగా ఉండొచ్చు.
వయస్సుకు తగ్గ ఆనందం
పుట్టిన వెంటనే బిడ్డ ఆనందం చవిచూస్తుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అన్ని భావాల్లోను సంతోషం, బాధ మనం మొట్ట మొదట నేర్చు కొనేవి. మొదటి నెల కల్లా పిల్లలు సంతోషాన్ని గుర్తించడం, సంతోషాన్ని ప్రకటించడం చేస్తుంటారు.
ఒకటి రెండు సంవత్సరాల వరకు తనకు కావల్సిన పనులు చేయడంలో ఆనందాన్ని పొందుతారు. క్రమేనా వయస్సు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల, మిగతా పెద్దల మెప్పు పొందడంలో ఆనందాన్ని చవిచూసి తర్వాత మెప్పు కోసం కొన్ని పనులు చేయడంలో నిమగ్నమవుతారు. అందులో భాగంగానే చదువుకోవడం, ఆటల్లో, వివిధ కళలలో ప్రావీణ్యులు కావడం ఆ పనుల్లో నిమగ్నం కావడమూనూ. ఆ పట్టుదలే వారి నడవడికకు మూలం అవుతుంది.
ఇక యవ్వనంలో సాంఘికపరంగా జరిగే వత్తిడిలో ముఖ్యంగా ఈ పోటీ యుగంలో జరుగుతున్న అనేక పోరాటాల్లో అనేక రకమైన భావనాందాలకు తావు చేసుకుంటారు. ఈ సమయంలోనే సొంత బాణీ గురించి, వ్యక్తిగతమైన లక్షణముల గురించి పునాదులు ఏర్పడతాయి. తన ఇష్టాఇష్టాలు గురించి ప్రత్యేకమైన భావాలు ఏర్పరుచుకునే సమయం తమ స్వార్థం గురించి ప్రతి వయస్సులోనూ సాధించవలసిన లక్ష్యాలు సాధించుకుంటూ, ప్రతి మెట్టులోను తమ తర్వాత లక్ష్యాలలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ, సంతోషాన్ని చవిచూసుకుంటూ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. దీనిలో భాగమే, పెళ్ళి, పిల్లలు, పిల్లల అభివృద్ధి, పిల్లల పెళ్ళి – ఇలా ఒకటి తరువాత ఒకటి మనకు తృప్తినిస్తూ ఉంటాయి. వృద్ధాప్యంలోకి వచ్చాక తాము తమ జీవితంలో సాధించిన (సాధించామనుకొన్న) సంగతులు, సంఘటనలను నెమరువేసు కోవ టంలో ఒక రకమైన ఆనందం, సంతృప్తి ఉంటాయి.
అలాంటివారిలో ఈర్ష్యా ద్వేషం, స్వార్థం అనేవి ఇతరులతో పోల్చుకోవడం వల్ల కాని, ఇతరులతో అసమాన పోటీలో తాము వెనుకబడి ఉండటము ఓర్చుకోలేకపోవటం వంటి భావనలు కలుగుతుంటాయి. అలాగే తమ స్థాయిబట్టి తమ లోని సాధించే శక్తిని సరిగ్గా గుర్తించి, తమకు తగ్గట్టు, తమకు వీలైన పరిధిలో తమ ఆశయాల సాధనకు ప్రయత్నించి, సాధించిన దానితో తృప్తి చెందుతూ, ఆనందము పొందుతూ గడపడమనేది ఆదర్శ మైన పద్ధతి. అది కొందరు చిన్న వయస్సులోనే తెలుసుకోగలరు. కొందరు ఎంత వయస్సు వచ్చినా తెలుసుకోలేకపోవడము మూలంగా మానసికానందాన్ని దూరం చేసుకున్న వారవుతారు.
ఇతరుల ఆనందమే తమ ఆనందంగా…
కొంతమందిని మనం చూస్తూ ఉంటాం… వాళ్ళు తన చుట్టూ ఉన్నవారి సుఖసంతోషాల గురించి చాలా కష్టపడుతుంటారు. త్యాగాలు చేస్తారు. ఎంత కష్టమైనా కాని వాళ్ళు భరిస్తూ ఉంటారు. ఈ కోవకు చెందినవాళ్ళు ఎప్పుడూ ఇతరుల సహాయార్థానికి ఏ పని చేయాలన్నా సిద్ధంగా ఉంటారు. ఒక్కొక్క పని తమకు వశం కాని పరిస్థితుల్లో కూడా చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులలో ఆ పని సాధించిన తరువాత కలిగే ఆనందం వాళ్ళని అడిగి తెలుసుకోవటమే తప్ప అంచనా వేయడం కష్టమే మరి!
జీవితంలో సంతృప్తి
వేదాంతులు అనేక శతాబ్దాల క్రితమే సంతోషం, సంతృప్తి గురించి వ్యాఖ్యానించారు. జీన్‍లాక్ సంతోషం మనో సంతృప్తి నుంచి కలుగుతుంది అని వివరించారు. అయితే మానసిక వేత్తలు సుఖ సంతోషాల గురించి గత మూడు దశాబ్దాలుగా విశిష్టమైన విస్త•తమైన పరిశోధనలు చేస్తూ వచ్చారు. అందులో సాంఘిక శాస్త్రాన్ని కూడా విపులంగా క్రోడీకరించారు.
ఈ మధ్య జరుగుతున్న పరిశోధనలలో ముఖ్యమైనది ‘జీవితంలో తృప్తి’, ‘మానసికా నందం’ అనే భావన లాంటి పదాలు ఎక్కువగా వాడతారు. సంతృప్తికి, ఆనంద సంతోషాలకు గల అవినాభావ సంబంధాన్ని గుర్తించడమే కాకుండా, ఏఏ కారణాలు వలన అనేక పరిస్థితులలో సంబంధాలు దెబ్బతింటాయో కనుక్కొనేందుకు ప్రయత్నాలు జరుతూనే ఉన్నాయ. అలెక్స్ మైఖలోస్ ఆధ్వర్యంలో ఒక మహోన్నతమైన పరిశోధనలో ముప్పయి తొమ్మిది దేశాలకు చెందిన అనేక వేలమందిని విపులంగా పరీక్షించిన పిదప సంతోష ఆనందాల గురించి తన పరిశోధనా ఫలితాలను వివరించారు. అందులో ముఖ్యంగా ఆరోగ్యం, స్నేహం, బంధువులతో సంబంధాలు, కుటుం బంలో సాన్నిహిత్యం, ఉద్యోగ సంతృప్తి, భార్యా భర్తల మధ్య సంబంధాలు, సెక్స్ విషయంలో తృప్తి ముఖ్యమైన కారణాలుగా పరిశోధించారు. అందులో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. స్త్రీ పురుషుల గల తేడాలు కూడా ఇందులో ముఖ్యం.
డా. మైఖోలోస్ ప్రకారం ఆడవాళ్ళలో సంతోషం స్కోరు మగవాళ్ళకన్నా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అంటే తృప్తి అనేది స్త్రీలలో ఎక్కువ. అందరూ సంతోషానికి మంచి పరస్పర సంబం ధాలు అన్నింటికన్నా ముఖ్య కారణంగా గుర్తించారు. ఈ కారణం డబ్బు సంపాదన, ఉద్యోగం, వస్తు సంపాదన కన్నా ముఖ్యంగా ఎంచుకున్నారు. పురుషుల కన్నా స్త్రీలలో మంచి కుటుంబ సంబంధాల వలన తృప్తి స్నేహితులతో సత్సం బంధాలు ఉంచుకోడంలో ఆనందం, భార్యా భర్తల మధ్య సంబంధంలో తృప్తి మొదలైనవి వున్నట్టు కనుక్కున్నారు. దానికి కారణం స్త్రీలలో సాంఘిక భావం ఎక్కువ ఉండడమే! సాంఘికతను పెంపొందించే గుణం స్త్రీలలో ఎక్కువగా ఉండడం ముఖ్య కారణం అని డాక్టర్ మైఖోలోస్ భావిస్తు న్నారు. ‘‘స్త్రీలలో ఇతరుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అనే ఆతృత ఎక్కువ. అలాగే ఆ సంబంధాల గురించి వారికి ఉన్న భావాలను నిజంగా వ్యక్తపరుస్తారు కాబట్టి ఆ సంబంధాలను పెంపొందించేదిగా సహాయపడగలరు’’ అని మైఖో లోస్ తన అభిప్రాయాన్ని చెబుతారు. అందువల్లనే కాబోలు స్త్రీలలో ఈ విషయాలలో తృప్తి ఆనం దాలు మెండు.
స్త్రీలు, పురుషుల కంటే సంతోషంగా ఉంటే, కొందరు స్త్రీలు మిగతా స్త్రీలకన్నా ఎక్కువ సంతోషంగా ఉంటారన్నది మరో నిజం.
అయితే సంతోషాన్ని తగ్గించే అంశాలలో ఒంటరితనం. ఇతరుల మీద ఆధారపడే మన స్తత్వం ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు అంటే ఇతరుల మీద మానసికంగా ఆధారపడి ఉండి, వారి నుంచి ఎక్కువ ప్రేమ, వాత్సల్యాలను ఆశించి అది లభించకపోవడం తమ సంతోష లేమికి కారణాలుగా అనేకమంది గుర్తించారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పిల్లల వలన భార్యా భర్తల మధ్య దూరం కొంత పెరిగింది అని అనేకమంది ఒప్పుకోవడం. డాక్టర్ మైఖోలోస్ దీన్ని ప్రస్తావిస్తూ పిల్లలు వారి మధ్యన ఉండటం వలన వారు మనసు విప్పి మాట్లాడలేకపోవడం ఒక కారణం గావచ్చునని అంటారు.
ఉద్యోగంలో తృప్తి సంతోషానికి కారణంగా కేవలం ఇరవై శాతం ఉండొచ్చు. ఇది స్త్రీ పురు షులలో దాదాపు సమానంగా భావిస్తున్నారు. అయితే ఈ ఫలితం 1950, 1960లో తెలిసిన కారణాలకు విరుద్ధముగా ఉండడం గమనించదగ్గ విషయం. అప్పట్లో ఫలితాలు ఆదాయం, ఇల్లు, ఆస్తులు ముఖ్యంగా సంతృప్తినిస్తాయి అని తెలి పాయి.
స్థిర సంతోషం – ఆనందం
అందరితో కలిసి ఉన్నాం అనే తృప్తి, అందరి తోనూ సత్సంబంధాలు కలిగి ఉండటం అనేవి ఎక్కువగా స్థిర ఆనందాలను ఇస్తుంటాయి అని చాలామంది తెలిపారు. అలాగే వారి మానసిక పరిస్థితి అదుపులో ఉంచుకోగలగడం తద్వారా వారి జీవితాన్ని మలచుకోగలగడం కూడా అత్యధిక ఆనందాన్ని ఎక్కువసేపు ఉండేలా చేస్తాయి అని అనేకమంది భావించారు. అందరికీ పనికి వచ్చేలా ఉండడం తమకు తృప్తినిచ్చేపనులలో నిమగ్నం కావడం స్థిర సంతోషానికి ఇతర కారణాలుగా గుర్తించారు.
మనసును నొప్పించే బాధలు, ఆలోచనలు దూరంగా ఉంచడం వలన దిగులును దూరం చేసుకోగలుగతామని మానసిక శాస్త్రవేత్తలు, మానసిక వైద్యులు ఎంతో కాలంగా గుర్తిస్తూ వచ్చారు. అలాగే సంతోషంగా ఉండాలంటే నీ గురించి నీవు మరిచిపోవాలి. ‘నేను ఎలా కనబడతాను’ అనే తపన నా ఉద్యోగంలో పైకి ఎలా వస్తాననే ఆదుర్దా తగ్గించుకోవాలి అంటారు. అంటే నీమీద, నీ కుండే స్వయం దృష్టి, నీమీద కాకుండా ఇతరుల మీదకు మరలేలాగా చూసు కోవాలి. నీ భయాలను, ముఖ్యంగా అనవసర భయాలను వదిలిపెట్టాలి అని నొక్కి చెపుతారు.
అలాగే ఇతరులకు కావలిసినవి చేసిపెట్టడానికి మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించడం వల్ల కలిగే తృప్తి ఆనందం అనిర్వచనీయం.
మానసిక ఆనందాలకు అప్పుడప్పుడు చాలా చిన్న మార్పులు కూడా సహాయ పడతాయి. మనం నిత్యం చేసే పనుల నుంచి అప్పుడప్పుడు కొంచెం మార్పుకోసం వేరే ప్రదేశాలకు వెళ్లడం, లేక మనకున్న దానితోనే బయట భోజనం చేయడం లాంటి చిన్నపనులు మానసికంగా ఎంతో రిలీఫ్‍ను ఇస్తాయి. జీవితానికి ఒక లక్ష్యం, క్రమశిక్షణ ఏర్పాటు చేసుకొంటే, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎటువంటి కష్టాలకు గురి కావలసి వచ్చినా ఎటువంటి నష్టాలకు వీలు కాని, గురి తప్పని విలుకాని జీవితంలో ఆనందం తప్పక మన సొంతం అవుతుంది.
Review ఆనందమే జీవిత మకరందం.