
అక్బర్ చక్రవర్తికి వేటాడటం ఒక సరదా. ఆ సరదా వల్ల రాజ్యంలోని అడవిలోని జంతువులన్నీ నిర్వీర్యమైపోవడం బీర్బల్‌ను ఎంతగానో బాధించింది. బీర్బల్ ఈ విషయాన్ని అక్బర్ చక్రవర్తి దృష్టికి తీసుకురావాలని అనుకున్నాడు. తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు.
ఒకరోజు అక్బర్ తన పరివారంతో కలిసి వేటకు వెళ్లాడు. బీర్బల్ కూడా అతని వెంట ఉన్నాడు. అడవికి వెళ్లే తోవలో వారు ఒక చిలకల గుంపు చెట్టుపై కూర్చుని అరవడం చూశారు. అక్బర్ బీర్బల్తో ‘బీర్బల్! నువ్వు పక్షుల భాషను అర్థం చేసుకోగలనని ఒకసారి చెప్పావు కదా! ఆ చిలకలు ఏమని అనుకుంటున్నాయో చెప్పగలవా?’ అని అడిగాడు.
బీర్బల్ వాటి మాటలను శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ ఇలా అన్నాడు-
‘రాజా! ఈ చిలుకలు పెళ్లి పద్ధతుల గురించి మాట్లాడుకుంటున్నాయి. పిల్ల వాడి తండ్రి ఏ పక్షులూ, జంతువులూ లేని ఐదు అడవులను వరకట్నంగా కావాలని అడుగుతున్నాడు. పెళ్లికూతురు తండ్రి ఇదేం కర్మ? పది ఖాళీ అడవులైనా కట్నంగా ఇవ్వడం సమ్మతమే అంటున్నాడు’.
ఆ చిలుకలు ఇంకా ఏం మాట్లాడుకుంటున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో అక్బర్, ‘మరి పెళ్లికొడుకు తండ్రి ఏమంటున్నాడు?’ అని అడిగాడు.
బదులుగా బీర్బల్- ‘మహారాజా! పెళ్లికొడుకు తండ్రి అంత సులభంగా ఖాళీ అడవులను ఎలా ఇవ్వగలవని పెళ్లి కూతురు తండ్రిని అడిగాడు. పెళ్లి కూతురు తండ్రి అయిన చిలుక పెళ్లికొడుకు తండ్రితో- ‘ఈ రాజ్య చక్రవర్తికి వేటాడటం సరదా. ఆ సరదాతో ఎన్నో అడవులను నాశనం చేశాడు. ఆయన తన సరదాతో కూడా పక్షులు, జంతువులు లేని అడవులుగా మారుస్తాడని చెబుతున్నాడు’ అని వివరించాడు. చిలుకలను సాకుగా చేసుకుని బీర్బల్ తను చెప్పాలనుకున్న మాటలను తెలవిగా అక్బర్‌కు చెప్పేశాడు.
Review చిలక పలుకులు.