పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో ఉంటుంది.
పూర్వం సూర్య వంశంలో పుట్టిన సుదర్శనుడు అనే రాజు అయోధ్యాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండే వాడు. ఆయన నిత్యం అన్నదానాలు క్రమం తప్పకుండా చేస్తూ దేవతల మెప్పు కోసం యజ్ఞ యాగాలు చేస్తూ మిక్కిలి పేరు పొందాడు.
అయితే, ఒకనాడు సరయు నదీ తీరంగా యజ్ఞం చేస్తుండగా, త్రిలోక సంచారి అయిన నారద మహర్షి అక్కడకు వచ్చాడు.
అప్పుడు సుదర్శనుడు నారదుడిని భక్తితో పూజించి అర్ఘ్య సమర్పించి వినయంగా ఇలా అన్నాడు-
‘ఓ మహానుభావా! మీ రాక వల్ల కృతార్థుడను అయ్యాను. మా రాజ్యం పావనమైంది. తమరు ఇంకా ఏయే ప్రదేశాలు చూసి వచ్చారో, వాటి విశేషాలు ఏమిటో మాకు తెలియ చేయండి’ అని వినయ విధేయతలతో అడిగాడు.
అందుకు నారదుడు రాజు గారి సేవలకు మెచ్చి, ‘పరమధర్మశీలుడవైన ఓ రాజా! నీ కీర్తి బ్రహ్మలోకంలో నలు దిశలా పొగడబడుతున్నది. నీ దాన ధర్మాల గురించి, నీ ప్రాశస్త్యం గురించి విని నిన్ను చూడాలని ఇలా భూలోకానికి వచ్చాను’ అని చెప్పాడు.
‘స్వామీ! నాపై దయతో మీరు ఇలా వచ్చారు కానీ, నేనెంతటి వాడను’ అని సుదర్శనుడు వినయంతో నారదుడికి నమస్కరించాడు.
‘ఓ ధరణీశా! నీ చరిత్ర బ్రహ్మలోకంలో చర్చకు వచ్చింది. అంతకంటే ఏం కావాలి? నీవంటి వారికి సాధ్యం కానిదేదీ లేదు. స్వధర్మాన్ని త్యాగం చేయ కుండా నిర్మల జీవితాన్ని గడిపే వారికి దుస్సాధ్య మైనదేదీ ఉండదు’ అని నారదుడు చెప్పి, ‘రుషి పత్నులు ఇసుకతో చేసిన కలశాల్లో నీళ్లు నింపు కోవడం నీకు తెలుసు కదా. కావాలంటే దీనికి నిదర్శనంగా ఇదిగో నువ్వు కూడా ఈ ఇసుకతో కుండను చేసి నీళ్లు నింపి చూడు. నీరు నిలబడు తుంది’ అని ఇంత ఇసుక తీసి రాజుకు ఇచ్చాడు.
సరేనని రాజు ఆ ఇసుకతో కుండను చేసి అందులో నీరు నింపాడు. అందులో నీరు నిలిచే సరికి రాజు ఆనందభరితుడయ్యాడు.
అప్పుడు నారదుడు- ‘ఈ విధంగా పుణ్యచరితు డవై కీర్తి ప్రతిష్ఠలతో చిరకాలం వర్థిల్లు’ అని దీవించి వెళ్లిపోయాడు.
ఆ రోజు మొదలు సుదర్శనుడు మట్టికుండల్లో కాక ఇసుక కుండల్లో అన్ని పదార్థాలు వండించి, చక్కగా రకరకాలపైన పదార్థాలతో అన్నదానం చేస్తున్నాడు.
ఇలా ఉండగా ఒకనాడు తన వంటశాలలోకి వెళ్లాడు. అక్కడ కొన్ని ఇసుక కుండలలో వండిన ఆహార పదార్థాలను చూసి ఉబ్బితబ్బిబ్బు అయి ‘ఆహా! నేనెంతటి ఘనుడను’ అని గర్వంతో పొంగిపోయాడు. అంతే.. తక్షణం ఆ కుండలన్నీ కరిగిపోయి ఇసుక కుప్పలుగా మారిపోయాయి. కారణం తెలియక సుదర్శనుడు చింతాక్రాంతుడయ్యాడు.
‘అయ్యో! నా వల్ల ఏ పొరపాటు జరిగిందో? లేదా భోక్తలు అనర్హులా? ఏ చెడు జరిగిందో’ అని వాపోయాడు.
అదే సమయంలో మళ్లీ నారదుడు ఆకాశ మార్గాన వెళ్తూ, విషయం తెలుసుకుని ‘ఓ రాజా! గర్వత్కారణం వినశ్యతి అన్న పెద్దల వాక్యం వినలేదా? పర్వత సానువుల్లో రథం, గర్వం వల్ల ధర్మకార్యం, భూమి మీద స్త్రీ సాంగత్యం వల్ల బ్రహ్మచర్యం సక్రమంగా నడవవు. నీ గొప్పతనానికి నువ్వే గర్వపడే సరికి నీ మహిమ నీరు గారిపోయింది’ అని వివరించాడు.
నీతి: గర్వం, పౌరుషం, మనల్ని మనం పొగుడుకోవడం వంటివి ఉత్తమ లక్షణాలు కాదు. మనిషికి గర్వం, అహం వంటి చెడ్డ గుణాలు అలంకారాలు కాబోవు.
Review నీ గర్వమే నీ పతనం.