మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షి
చిట్టి పాప
చిన్న మా అమ్మాయి శ్రీ ముఖము చూసి
సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెరచు
పందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటే
పనసపండని జనులు పరుగులెత్తేరు
దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే
దోసపండని జనులు దోసిలొగ్గేరు
నీలాలు కెంపులూ నిలువు వజ్రాలు
నిత్యమూ అమ్మాయి నీళ్లాడు చోట
పగడాలు రత్నాలు పారిజాతాలు
పడలి మా అమ్మాయి పని చేయు చోట
చూడగా ముద్దమ్మ పాడగా ముద్దు
అందరికీ మా అమ్మి అల్లారు ముద్దు
బెదిరి ఉండుము తల్లి భేదంబు లేక
తత్తరంబడి విడిచి అత్తగారీ మాట
చిత్తమున జేర్చుకో చిత్తారు బొమ్మ
తలకొంగు మరువకు తలెత్తి చూడకు
పొలతులతో వాదు వలదు మాయమ్మా
పెద్దలు పిన్నలు వచ్చు మార్గము దెలిసి
గద్దెపై గూర్చున్న గక్కున దిగవే
హరిపగిది పీ మొగుడు అరయు దేవుండతడు
ధరణి యిద్దరు నీకు దైవసములమ
అత్తగారింటికి
అత్తగారింటికి అంపించవలె నిన్ను
అతిబుద్ధిగలిగుండు అంబరో నీవు
నీతి వాక్యములను నిర్మించి చెప్పెద
ఖ్యాతితో నుండుము నాతిరో నీవు
బిడ్డరో వినమ్మ బిరుసు మాటలు నీవు
అరయ బల్కకు తల్లి అత్తవారింట్ల
ఓర్పు సిగ్గులు కల్గి ఒరుల ఇంటికిబోక
ఒప్పిదంబుగ నుండు ఓ బిడ్డ నీవు
తల్లిమారు అత్త తగ జూడవే బిడ్డ
జగడమాడకు తల్లి జవ్వనులతోడ
తండ్రి మారు మామ తనవలె వదినెలు
కనవలె ఈ రీతి కపటంబు లేక
మగువ కొడుకుల మారు మరదులను భావించి
కరుణగలిగుండవే కమలాక్షి నీవు
చక్కిలిగింత పాట
ఇల్లు అలికి – ముగ్గు వేసి
పీట వేసి – ఆకు వేసి
పప్పు వేసి – పాయసం పెట్టి
అన్నం పెట్టి – అప్పచ్చీ పెట్టి
పాలు పెట్టి – పెరుగు వేసి
కూర వేసి – చారు పెట్టి
నెయ్యి వేసి – ముద్దా వేసి
నోట్టో పెట్టి – తినిపించి
చేయి కడిగి – మూతి కడిగి
చేయి తుడిచి – మూతి తుడిచి
తాతగారింటికి – దోవేదంటే
అత్తారింటికి – దోవేదంటే
ఇల్లా పోయి – అట్లా పోయి
ఇదిగో వచ్చాం – అదిగో వచ్చాం
చంకా ఎత్తి – చక్కిలి గిలిగిలి
చక్కిలి గిలిగిలి – చక్కిలి గిలిగి
Review పిల్లల ఆటపాటలు.