బాలలూ! విద్యారంగంపై ప్రపంచీకరణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కోర్సులు, మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్‍లు వస్తున్నాయి. చాలావరకు ఈ కోర్సులన్నీ ఇంగ్లీషు మాథ్యమంలోనే ఉండడంతో తమ పిల్లల్ని ప్రాథమిక దశ నుంచి కూడా ఇంగ్లీషు మీడియంలోనే చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు.
అమ్మా నాన్నల ఆలోచనలను మీరు ఆచరణలో పెట్టవలసి వస్తోంది. ఇంగ్లీషు ఆధిపత్యం స్పష్టమవుతున్న ఈ రోజుల్లో మాతృభాష అక్కరకు రానిదిగా చాలామందికి అనిపిస్తోంది. పట్టణాల లోనే కాదు పల్లెల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని వుంది. దీని వలన ఒన గూరే ప్రయోజనాల కోణం నుంచి తప్ప ప్రాథమిక దశలో మాతృ భాషకు దూరమైతే కలిగే నష్టాల దృక్కోణంలో తల్లిదండ్రులు అంతగా ఆలోచించకపోవడంతో నేడు చాలామంది పిల్లలు తమకు తెలియ కుండానే మాతృభాషకు దూరమవుతున్నారు.
ప్రాథమిక దశలో విద్యార్జన ప్రధానంగా శ్రవణం (వినడం), భాషణం (మాట్లాడడం), పఠనం (చదవడం), లిఖితం (రాయడం) అనే పక్రియల ద్వారా జరుగుతుంది. తన మాతృభాష ఏదైనప్పటికీ ప్రతి పిల్లవాడు తను పాఠశాలలో చేరే సమయానికి వినడం, మాట్లాడడం అనే రెండు పక్రియలకు అలవాటు పడి ఉంటాడు. తద్వారా అతనికి అప్పటికే తన మాతృభాషతో కొంత పరిచయం
ఉంటుంది. కనుక పాఠశాలలో ప్రవేశించగానే అతనికి పరిచితమైన భాషలో పాఠాలు చెప్పడంద్వారా అతనిలో జ్ఞానాన్ని పెంపొందించ వచ్చు. అంతకుమించి విద్యపట్ల ఆసక్తిని కలిగించవచ్చు. ప్రాథమిక దశలో ఇది అత్యంత అవసరమైన చర్య. ఈ దశలో మాతృభాషలో నేర్చుకున్నట్లయితే తర్వాత కాలంలో పిల్లవాడు మరే ఇతర భాష అయినా సులభంగా నేర్చుకోవడానికి మార్గం సుగమమవుతుంది. ఇంగ్లీష్ భాషా వ్యామోహంలో తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని ఈ విషయాన్ని గుర్తించడం లేదు. మాతృభాషతో సంబంధంలేకుండానే అప్పటిదాకా పరిచయం లేని పిల్లలలో ఇంగ్లీషు వంటి భాషలవైపు దృష్టి నిలిపి ‘చదివించడం సాహసమే’ అవుతుంది.
అంతేకాక, ప్రాథమిక దశలో మన తెలుగు భాషపైన పిల్లలో నైతిక ప్రవర్తన అలవరచడానికి, సహపాఠ్యాంశాలలో రాణించడానికి, చదువుతో పాటు ప్రాపంచిక జ్ఞానాన్ని అందించడానికి అవసరమైన సాహిత్యం అపారంగా ఉంది. తెలుగు భాష నేర్చుకుని వీటిని చదవడం ద్వారా జీవితంలో అక్కరకు వచ్చే జ్ఞానాన్ని పొందవచ్చు. స్కూలు స్థాయి వరకూ తెలుగును చదవడం వల్ల అప్పటివరకూ తనదైన భాషలో అంతవరకూ చదివిన అనేక పుస్తకాలలోని విజ్ఞానం ఉన్నత చదువులకు ఎంతో ఉపయోగిస్తుంది.
కెరీర్ పరంగా అనేక అంశాలలో మంచి ప్రావీణ్యం సంపాదించ వలసిన రీతిలో నట్టే చదువులున్నాయి. ఎన్నిభాషలు వచ్చి ఉంటే అంత మంచి అవకాశాలు భవిష్యత్తులో పొందవచ్చు. ఈ తరుణంలో మనదైన మాతృభాషను ప్రాథమిక దశలో నేర్చుకోకుండా విద్యను అభ్యసించడం అవకాశాలను జారవిడుచు కోవడమే అవుతుంది. మన చుట్టూ ఉన్నవారు మాట్లాడే భాష మనకు చాలా సులభంగా వస్తుంది. అలాంటి అవకాశం ఉన్నప్పుడు మాతృభాషలో మాట్లాడటం, చదవడం, రాయడం నేర్చుకోవాలి. లేకపోతే అందరికీ వచ్చిన భాష మనకు రాకుండా అయిపోతుంది.
తెలుగు భాష పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయన్న విషయం పక్కనపెట్టి నేటి పిల్లలు మన మాతృభాష తెలుగు నేర్చుకునే విషయంలో శ్రద్ధ చూపించాలి.
భాషా శాస్త్రవేత్తలు, మేధావుల కృషి ఫలితంగా ఇప్పటి తెలుగు మునుపటి కాలంలో కంటే చాలా సరళంగా, సులభంగా మారింది. మన మాతృభాష తెలుగును నేర్చుకోవడం ద్వారా మనల్ని మనం సంస్కరించుకున్న వారమవుతా మన్న విషయాన్ని పెద్దలు, పిల్లలు కూడా గుర్తెరగాలి.
Review మాతృభాషను మరువకండి.