మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి
తెలుసుకుందాం
శ్రుతిలేని పాట సమ్మతిలేని మాట
ఇంపుగాలేని వ్యవహారం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పాటకు శ్రుతి లేకపోతే వినబుద్ధి కాదు. సమ్మతించటానికి ఇష్ట పడకుండా ఏదో మాట్లాడాలి కదా అని అడిగిన దానికి ముక్తసరిగా మాట్లాడే మాట కూడా ఇంపుగా ఉండదు. ఈ భావన ఆధారంగానే ఈ పలుకుబడి వాడుకలోకి వచ్చింది. కొన్నికొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఆ పరిస్థితిని ఈ జాతీ యంతో పోల్చి చెబుతుంటారు. ‘ఏమిటో.. ఇదంతా శ్రుతిలేని పాట సమ్మతిలేని మాట అన్న ట్టుంది’ అంటుండటం వినవచ్చు.
సంగీతానికి గాడిద, హాస్యానికి కోతి
సరసాలు ఆడేటప్పుడు, చమత్కారాలు మాట్లాడేటప్పుడు, వరసైన వారిని గురించి హాస్యంగా మాట్లాడేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. వినటానికి ఇంపుగాలేని గొంతును గాడిద గొంతుతో పోల్చి చెప్పటం, అల్లరి చేష్టలను కోతి రూపంతో పోల్చి చెప్పటం తెలుగునాట ఓ అలవాటుగా వస్తోంది. ఈ అలవాటును ఆధారంగా చేసుకుని ఈ జాతీయం వాడుకలోకి వచ్చి ఉంటుందని అంచనా.
వూగే పంటి కింద రాయి పడ్డట్టు
అసలే కష్టాలలో ఉన్నప్పుడు దానికి తోడు మరిన్ని కష్టాలు వచ్చిపడి భరించలేని స్థితి ఎదు రైన సందర్భాలలో ఈ పలుకుబడిని ఉపయో గిస్తుంటారు. ఊగుతూ ఉన్న పన్ను బాధను కలి గిస్తుంటుంది. ఆ బాధను ఎలాగోలా భరిస్తూ ఆక లిని చల్లార్చుకోవటం కోసం ఆహారం తీసుకోవ డానికి ప్రయత్నిస్తే, అది తీరా ఆ ఊగే పంటి కిందే పడితే ఎంత బాధో ఎవరైనా ఊహించ వచ్చు. అంతే బాధను రెట్టించిన కష్టకాలంలో పొందటం అనే విషయాన్ని గురించి వివరించే టప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లు..
ఏ వయస్సుకు ఆ ముచ్చటంటారు. ముద్దు ముచ్చట్లన్నీ యుక్త వయస్సులో ఉన్నప్పుడైతే చూడటానికి బాగుంటుందేమో కానీ వయస్సు మీరిన తర్వాత అవి అంతగా బాగుండవు. వయ్యా రంగా ఉండటమనేది వయస్సులో ఉన్న వారికైతే చక్కగానే ఉంటుంది. వయస్సు మీరినవారు వయ్యారాలు పోతే అందరూ వెక్కిరించే పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఎవరైనా తమ వయస్సుకు తగ్గ పనులు కాక వేరేలాగ ప్రవర్తిస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.
రాఘవా స్వస్తి, రావణా స్వస్తి
లోకమంతా శుభకరంగా ఉండాలని కొంత మంది కోరుకొనే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘పాపం, పుణ్యం పరమాత్ముడికే ఎరుక. నేను మాత్రం ఎలాంటి భేదాన్ని పాటించకుండా అందరికీ శుభం కలగాలని కోరుకుంటాను. రాముడులాంటి వారైనా, రావణుడి లాంటి వారైనా సరే అంతా క్షేమంగానే ఉండాలన్నది నా ఆకాంక్ష’ అని అనుకునే వారు ఈ జాతీయాన్ని వాడుతుండటం కనిపిస్తుంది.
వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు..
ఒక వ్యక్తికి అన్నం వండే పని అప్పగించారట. అన్నం వండుతానని ఒప్పుకొన్న మనిషి వంట అయిందా అని అడిగితే అయింది అని చెప్పాడు. తీరా ఏది అని అడిగినప్పుడు ఎండబెట్టిన వడ్లు సరిగా ఆరలేదని అందుకే వాటిని దంచలేదని, ఆ కారణం చేతనే కావాల్సిన బియ్యం రాలేదని వంట సమయానికి కాకపోవటానికి కారణం అదేనని తన తప్పేమీ లేదని చెప్పాడట. ఈ ఘటన ఆధారంగానే పని చెయ్యకుండా చేసామని చెప్పి తిరుగుతూ అడిగినప్పుడు వంకలు చెబుతున్నప్పుడు ‘వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు’ అని అనడం కని పిస్తుంది. కొంతమంది అప్పగించిన పనిని సమ యానికి ముగించకుండానే ఆ పని ముగించేసినట్టు చెబుతుంటారు. నిక్కచ్చిగా నిలదీసి అడిగితే తప్పించుకోవడానికి ఏవో కారణాలను చూపుతుంటారు. అలాంటి వారిని గురించి లేదా అటువంటి పరిస్థితులను గురించి తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు.
Review సంగీతానికి గాడిద.. హాస్యానికి కోతి.