వినాయకుడిని- సుముఖుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, లంబోదరుడు, వికటహాసుడు, వక్రతుండుడు అని కూడా పిలుస్తారు. ఇవన్నీ అంగాల పేర్లు. ఒక్కోటి ఒక్కో సుగుణానికి ప్రతీక. ఆ సుగుణాలన్నీ కలవాడే సమర్థ నాయకుడు
మన హైందవ ధర్మంలోని దేవతలది ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఆయా దైవాంశాల్లోని ప్రత్యేకతలను అందిపుచ్చుకొని ఆ స్థాయికి ఎదగటమే మనిషి విద్యుక్త ధర్మం. దేవుడిని కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే సాధనగా ఉప యోగించుకున్నంత కాలం మనిషిలో ఆధ్యాత్మిక వికాసం కలగదు. దైవాంశం, దైవత్వంలో ఇమిడి ఉన్న రహస్యాలను తెలుసుకుని వాటిని ఆచరించినపుడే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యపడుతుంది. ఆబాలగోపాలాన్నీ ఆకర్షించే దివ్యరూపం వినాయకుడు. ఆయన రూపం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఆయన రూపానికి ప్రత్యేక ఆకర్షణ శక్తి ఉంది. సాధారణంగా దేవతలందరికీ వేనవేల నామాలు ఉన్నాయి. కానీ విఘ్నేశ్వరుడికి అంగాల పేరిట కూడా నామాలు ఉన్నాయి. ఇవి ప్రసిద్ధం. ఎందుకంటే- ఇవన్నీ మనలో నిద్రాణంగా ఉన్న ఆయా మానసిక శక్తులను బలోపేతం చేస్తాయి. లంబోదరం, వక్రతుండం, ఏకదంతం, గజకర్ణం, మూషిక వాహనం వంటివి గణనాథుని ప్రసిద్ధి నామాలు. ఒక్కో అంగం పేరుతో ఉన్న ఒక్కో నామం ఒక్కో ప్రత్యేక మానసిక శక్తిని కలిగిస్తాయి. ప్రేరణనిస్తాయి. అందుకే పిల్లలకు, పెద్దలకు కూడా ఆయన ఇష్టమైన దేవుడు. వినాయక రూపంలోని నిజతత్త్వం ఎన్నో విజయ సూత్రాలను తెలియచేస్తుంది. వాటిని ఆచరిస్తే జీవితంలో ఉన్నతిని సాధించవచ్చు
నిబ్బరంగా ఉంటేనే ప్రసన్న వదనం..
వినాయకుడిని ‘ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే’ అని ప్రార్థిస్తాం. ఎవరి ముఖం చూస్తే భయాందోళనలు తొలగిపోయి ఆత్మస్థైర్యం, ఆత్మశాంతి కలుగుతాయో అతడే ‘సుముఖుడు’. అతనే ‘ప్రసన్న వదనుడు’. నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అదే సమయంలో హర్షామోదాలూ కలుగుతుంటాయి. ఇబ్బందులు కలిగినపుడు నిబ్బరం కోల్పోకూడదు. స్థైర్యంగా, ధైర్యంగా నిలబడాలి. వీటిని కోల్పోతే మరింత బలహీనులం అవుతాం. కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతచిత్తం కలిగి ఉండాలని గణేశుని ప్రసన్న వదన రూపం మనకు చాటుతుంది.
ఆత్మసౌందర్యాన్ని చాటే ‘ఏకదంతం’
మనలో చిన్న లోపం ఉంటేనే కుంచించుకుపోతాం. బాహ్యాలంకారాలు, బాహ్య సౌందర్యానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంటాం. ఇవి ఎందుకూ కొరగానివి. నిజానికి ఏనుగుకు ఆభరణాలు వాటి రెండు దంతాలే. కానీ, వినాయకుడికి కుడి వైపు దంతం లేదు. మహా భారత రచనకు ఆయన దానిని ఉపయోగించారని ప్రతీతి. మానవాళికి పంచమ వేదాన్ని అందించడానికి, సమాజ ప్రయోజనానికి తాను వికటరూపునిగా మారడానికి కూడా వినాయకుడు సిద్ధమయ్యాడన్న మాట. ఇది త్యాగనిరతికి నిదర్శనం. ఆత్మ సౌందర్య స్ప•హ ఉన్న వారే ఇటువంటి త్యాగాన్ని చేయగలరు. మనం మనిషిగా బాహ్య సౌందర్యంపైనే శ్రద్ధ చూపుతున్నాం. కానీ, ఆత్మ సౌందర్యంపై దృష్టి పెట్టడం లేదు. అటువంటి స్వభావాన్ని వీడాలని చాటేదే వినాయకుని ‘ఏకదంత’ రూపం.
మంచిచెడుల ప్రతీక.. ‘శూర్పకర్ణం’
వినాయకుని గల ఒక నామం ‘శూర్పకర్ణం’. చేటల వంటి పెద్ద చెవులు, ఎవరేమి చెప్పినా విసుగు లేకుండా వినడానికి ప్రతీక. అంతేకాదు.. మంచిని మాత్రమే విని, చెడును విస్మరించాలని కూడా ఇవి చెబుతాయి. ఎవరేమి చెప్పినా ఓపికగా వినడం, విన్న వాటిలో మంచిచెడులను పరిశీలించాకే అంగీకరించడం నిజమైన నాయకుడి లక్షణమని వినాయకుడి పెద్ద చెవులు (శూర్పకర్ణాలు) తెలిపే సందేశం.
వక్రతుండం.. ఏ పనికైనా సిద్ధం..
ఏనుగు తన తొండంతో పెద్ద స్తంభాన్నయినా ఎత్తగలదు. నేలపై పడిన చిన్న సూదినీ తీయగలదు. అంటే, స్థూల, సూక్ష్మ విషయాలను గ్రహించే శక్తి వినాయకుడికి ఉందని అర్థం. స్తంభం ఎత్తడం అంటే గొప్ప కార్యాలను చేయడం. సూదిని తీయడం అంటే చిన్న పనిని సైతం చేయడం. ఉన్నత పదవుల్లో ఉన్న వారు చిన్న పనులను చేయడాన్ని నామోషీగా భావిస్తారు. అటువంటి వారు ఆదర్శ నాయకులు కాలేరు. నాయకుడు సూక్ష్మ విషయాలను గ్రహించే శక్తినీ, చేసే పని చిన్నదైనా, పెద్దదైనా చేయడానికి సిద్ధంగా ఉండే విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. మనం ఆదర్శ నాయకులం కావాలంటే వినాయకుడి రూపం చెబుతున్న విజయ రహస్యాలను, సూత్రాలను ఆచరణలో పెట్టాలి.
వికటహాసం.. ఎప్పుడూ నవ్వుతుండాలి
నాయకుడు తాను నవ్వుతూ, ఇతరులను నవ్వించగలిగితేనే నిజమైన సత్ఫలితాలు కలుగుతాయి. కల్మషం లేని మనసే అందరికీ ఆహ్లాదాన్ని పంచగలదు. కల్లాకపటం లేని పసి హృదయాలు ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తుంటాయి. అలా పసిపిల్లాడి వంటి పవిత్రమైన మనసు గలవాడు గణపతి. అందుకే ఆయన చేసిన పనులన్నీ పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఒకసారి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని వినాయకుడు మింగేశాడు. దాన్ని తిరిగి పొందాలంటే వినాయకుడిని ఎలాగైనా నవ్వించాలని విష్ణువు తలచాడు. తన రెండు చెవుల్నీ చేతులతో పట్టుకుని గుంజీలు తీశాడు. విష్ణువును అటువంటి స్థితిలో చూసిన వికటహాసం చేశాడు. అలా వినాయకుడు పెద్దగా నవ్వడం వల్ల అతని నోటి నుంచి సుదర్శన చక్రం బయటపడింది. అందుకే వినాయకుడిని వికటహాసుడు అని కూడా అంటారు.
లంబోదరం.. స్థితప్రజ్ఞం
వినాయకుడు చూడగానే పెద్ద పొట్టతో కనిపిస్తాడు. ఇది ఆయనలోని స్థితప్రజ్ఞతకు ప్రతీక. మెత్తని మధురమైన మోదకాలను సమర్పించినా, పచ్చికాయలను సమర్పించినా గణపతి ప్రీతితో స్వీకరిస్తాడు. అంటే, ఏ నైవేద్యాన్ని అర్పించినా జీర్ణించుకునే శక్తి గలవాడు ఆయన. ఇదే మాదిరిగా మనం మనపై వచ్చే విమర్శలు, ప్రశంసలు పట్ల సమభావాన్ని, సమదృష్టిని ప్రదర్శించాలి. ఇతరులతో కలిసి పనిచేసేటపుడు, పని చేయించేటపుడు ఎన్నో మనస్తత్వాలను అర్ధం చేసుకుని, సర్దుబాటుతనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. అది నాయకుడు అనే వాడి ప్రాథమిక లక్షణం. వినాయకుని లంబోదర రూపం అదే చాటుతుంది.
Review వినాయక పాఠం.