అతిథులను భోజనానికి పిలిస్తే.

గ్రామాల్లో బొడ్రాయి ప్రతిష్ట చేస్తే.. గ్రామస్తులంతా ఉండాలంటారు? పెళ్లయిన ఆడపిల్లలు కూడా తప్పకుండా ఆ రోజు గ్రామానికి రావాలంటారు. ఎందుకు?
గ్రామానకి గరిమనాభి లేదా కేంద్రం అయిన ప్రదేశంలో గ్రామ దేవతకు ప్రతినిధిగా బొడ్రాయిని ప్రతిష్టించే ఆచారం ఉంది. ఆ విధమైన ప్రతిష్ట జరిగే రోజున ఆ గ్రామస్తులందరూ ఊళ్లోనే ఉండాలని, పెళ్లయి వేరే చోట్ల ఉంటున్న ఆడపడు చులు కూడా ఆనాడు స్థానికంగా ఉండాలనేది ఒక ఆచారంగా వస్తోంది. దీనికి కారణం.. బొడ్రాయిని ప్రతిష్టించడం అంటే ఊరి నడిబొడ్డును గుర్తిం చడం అన్నమాట. ఆ భౌగోళిక పరిజ్ఞానం, ఊరి నిర్మాణంపై ప్రజలకు అవగాహన కలగాలనేది ప్రధానమైన ఆంతర్యం. దీనిలో భాగంగానే ఆడ పడుచులను సైతం ప్రతిష్టకు పిలుస్తారు. అంతే కాదు, ఊళ్లోని వారంతా కలుసుకుని ఐకమత్యంతో ఉండాలనీ, ఊరి బాగు కోసం అందరూ ఆలోచించాలనీ పెద్దల ఆశయం. ప్రతిష్టకే కాదు.. ఏటా ప్రతిష్టా వార్సికోత్సవం నిర్వహించడం కూడా సంప్రదాయంగా ఉంది.
అతిథులను భోజనానికి ఆహ్వానించినపుడు, వారికి ఏది ఇష్టమే మనకు తెలిసే అవకాశం లేనపుడు, కనీసం మనం తయారు చేసిన పదార్థా లైనా వారు ప్రశాంతంగా తినే వాతావరణం ఇంటి యజమాని కల్పించాలని అంటారు. అంటే, ఇందు లోని ఆంతర్యం ఏమిటి?
మన ఇంటికి అతిథులు ఎన్నో సందర్భాల్లో వస్తుంటారు. వారిలో కొందరు పరిచయస్తులు. మరికొందరు అనుకోని అతిథులు. ఇంకొందరు అసలు రారని భావించిన వారు అకస్మాత్తుగా వచ్చే వారు. ఇంకా రకరకాల అతిథులు ఉంటారు. అయితే పరిచయస్తులను మినహాయిస్తే, మిగతా వీరి అభిరుచులు ఏమిటనేవి మనకు తెలిసే అవకాశం తక్కువ. కాబట్టి అటువంటి వారిని మన ఆతిథ్యంతో తృప్తి పరచడానికి కొన్ని నియమాలు, సంప్రదాయాలు పాటించాలి. అవేమిటంటే..
ఇల్లాలు విస్తరిలో వడ్డిస్తున్నపుడే- కొంచెం కొంచెం వడ్డించు. కావాలంటే మళ్లీ వడ్డించ వచ్చు’ అని అతిథి సమక్షంలోనే అనకూడదు.
నెయ్యి వడ్డిస్తున్నప్పుడు ‘నేనసలు నెయ్యి వేసుకోనండీ. కొవ్వు పెరుగుతుంది’ అని యజమాని అనకూడదు.
ఊరగాయలు వేసుకునేటప్పుడు ‘మీరు మరీ ఎక్కువగా పచ్చళ్లు తింటున్నారు. ఆరోగ్యానికి మంచిది కాదు. వాటిని కాస్త తగ్గించాలి’ అని యజమాని అనకూడదు.
ఇల్లాలు అతిథికి వడ్డిస్తూ భర్తకు కూడా వడ్డించబోతున్న సమయంలో భర్త భార్యను- ‘ఆగు. ఏమిటా వడ్డించడం?. నేను ఎప్పుడైనా అంతంత తిన్నానా?’ అని ఆగ్రహంతో యజ మాని భార్య మీద అతిథి సమక్షంలో భోజనం చేసేటప్పుడు కసురుకోకూడదు.
వడ్డించే ఇల్లాలు తప్ప పక్కన కూర్చుని భోజనం చేస్తున్న యజమాని, మాటి మాటికీ అతిథి తింటున్న పదార్థాల వైపు చూస్తూ, వ్యాఖ్యానాలు చేయకూడదు.
ముఖ్యంగా అతిథి తృప్తిగా తింటే సంతో షించాలి. అలా సంతోషించగలిగినప్పుడే ఎవరినైనా భోజనానికి పిలవాలి.
ఏడుస్తూ భోజనానికి పిలిచి, అక్కసునంతా అతిథి భోజనం చేసే సమయంలో తీర్చుకుంటే, ‘అన్నదాతా సుఖీభవ’ అనే సామెత వర్తించదు. సరికదా, అర్థాకలిగా అతిథికి భోజనం పెట్టి సూటిపోటి మాటలతో నిందించి పంపిన సరికొత్త పాపము ఖాతాలో పడుతుంది.
ఒకరికి బాధపడుతూ భోజనం పెట్టే కన్నా పెట్టకుండా ఊరుకోవడమే ఉత్తమం.
అతిథికి భోజనం సంతృప్తిగా పెట్టదల్చుకుంటే వారిని మీ ఇంటికి మనస్ఫూర్తిగా పిలవండి. లేకపోతే పిలవకుండటమే ఉత్తమం.
చివరిగా, అతిథి భోజనం చేస్తూ ఉండగానే, యజమాని విస్తరి ముందు నుంచి లేచి వెళ్లి చేతులు కడుక్కోకూడదు. ఆ విధంగా చేయడం అనేది అతిథిని అవమానం పరిచినట్టే.

Review అతిథులను భోజనానికి పిలిస్తే..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top