భళారే.. బాల్యం.

బాల్యం.. అదో అందమైన జ్ఞాపకం. మరి, నిజంగా అదంత అందంగా ఉందా? కనబడని చట్రాల్లో బందీ అయ్యిందా? పిల్లలేం కోరుకుంటున్నారు? వారికేం లభిస్తోంది? తల్లిదండ్రులు పెంపకం పేరుతో పెత్తనం చెలాయిస్తున్నారా? పిల్లలతో ఎలా మసులుకోవాలి? వాళ్లకేం కావాలి?.. ఇవన్నీ అందరూ అన్నీ తెలుసని అనుకుంటారు. కానీ, తెలిసీ తెలియనితనంతో పిల్లల కలలను, ఆశలను చిదిమేస్తున్నారు. నవంబరు 14 బాలల దినోత్సవం. ఈ ఒక్కరోజే పిల్లలది.. మిగతా అన్ని రోజులు తల్లిదండ్రులది అన్నట్టు ప్రస్తుత పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బాల్యం సంగతులపై ప్రత్యేక కథనం.

పేరెంట్సే ఫ్రెండ్స్..
పిల్లల తొలి స్నేహితులు, మలి శ్రేయోభిలాషులు వారి తల్లిదండ్రులే. చిన్నారులను స్నేహితులుగా స్వీకరించాలి. వారితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. అలాఅని మరీ నియంత్రణలేని స్వేచ్ఛనిస్తే పిల్లలు స్వీయ నియంత్రణ కోల్పోతారు. పెరిగి పెద్దయ్యాక లక్ష్యాలు పక్కదారి పడతాయి. పిల్లలకు చప్పున కోపం వచ్చేస్తుంటుంది. దాన్ని ఎలా నియంత్రించుకోవాలో వారికి ఫ్రెండ్లీగా సలహా ఇస్తుండాలి. పెద్దలు పిల్లల్ని పూర్తిగా నమ్మాలి. అలాగే, తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని పిల్లలు నిలబెట్టడానికి యత్నించాలి. ఈ క్రమంలో పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. జీవితంలో వైఫల్యాలు కూడా ఒక భాగమే. వైఫల్యాలను తలుచుకుని కుంగిపోకూడదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని వాళ్లకు తెలియచెప్పాలి. ఎదుటి వారికి సహాయం చేసే తత్వాన్ని, ఇవ్వడంలో ఆనందించే గుణాన్ని అలవరుచుకోవాలని చెప్పాలి. కుటుంబ పరిస్థితులను, ఆర్థిక అవసరాలను పిల్లలకు సూచాయగా తెలియచెప్పాలి. బాధ్యతలను పంచుకోవడం నేర్పాలి. జీవితంపై శ్రద్ధను పెంచేలా పిల్లల్ని పెంచాలి. జీవితం అంటే ఏమిటో వివరించాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో చిన్ననాడే వాళ్లని ఉక్కిరిబిక్కిరి చేయొద్దు. కాలం విలువైనదనే విషయం అర్థమయ్యేలా చెప్పాలి. చిన్న చిన్న పనులను కూడా వాయిదా వేయకుండా ఎలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలో సోదాహరణంగా తెలపాలి. ప్రస్తుతం పిల్లల్లో గ్యాడ్జెట్స్ వాడకం వ్యసనంగా మారింది. ఏ వస్తువు అవసరం ఎంతో అనేది పేరెంట్స్ సరిగ్గా గైడ్‍ చేయగలగాలి. పెంపకంలో విచక్షణ లేకపోతే పిల్లలకు తమకు తెలియకుండానే నియంత్రణ కోల్పోతారు.

మరీ సుకుమారంగా చూడకండి..
పిల్లలు సున్నిత మనస్కులు. అలా అని వాళ్లని మరీ సున్నితంగా, సుకుమారంగా ట్రీట్‍ చేయకూడదు సుమా!. నిజానికి పుట్టుకతో ఎవరూ ధైర్యవంతులూ కారు. పిరికివారూ కారు. బాల్యం నాటి సంఘటనలు, ఎదురైన పరిస్థితులే పెద్దయ్యాక వారిని ఏదో ఒకటి చేస్తాయి. మనసు గందరగోళానికి గురిచేసే ఏ ఒక్క విషయమూ వారి చెవిన పడకుండా, ఏ ప్రమాదమూ వారి కంట పడకుండా దూరంగా ఉంచితే, మున్ముందు వారు పిరికి వారుగా మారే ప్రమాదం ఉంది. అందుకే అలాంటి సంఘటనలను వారికి అప్పుడప్పుడూ చూపిస్తుండాలి. అలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని అధిగమించే మార్గాల గురించి చెబు తుండాలి. దీనివల్ల అటువంటి వాటికి భయంతో వణికిపోవడం కాకుండా, భవిష్యత్తులో తమకు అలాంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలనే ఆలోచనలు వారిలో మొదలవుతాయి. గగుర్పాటు కలిగించే విషయాలకూ, ప్రమాదాలు జరిగిన ప్రదేశాలకు పిల్లలను దూరంగా ఉంచాలనుకోవద్దు. ఏదో సందర్భంలో అటువంటి వాటి గురించి సున్నితంగా తెలియ చెప్పాలి. తొలుత భయం గొలిపే విషయాలే పిల్లల్లో ఆ తర్వాత ధైర్యాన్ని నింపుతాయి.

పోలిక.. చాలిక
పిల్లల్ని తరచూ వేరొకరితో పోల్చడం చాలామంది తల్లిదండ్రుల సాధారణ అలవాటు. అప్పుడప్పుడూ అంటే సరే కానీ, తరచూ అలా చేస్తే మాత్రం ప్రమాదమే. అవసరం ఉన్నంత వరకే తోటి వారితో పోలిక.. అదేపనిగా పోలుస్తుంటే, పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. దీంతో వారి పసి మనసుల్లో ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. పోలిక అనేది పిల్లల మనసును గాయపరిచేలా, ఒత్తిడికి గురిచేసేదిగా కాక, వారిని ఆలోచింపచేసి, వారిలో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచేదిగా ఉండాలి. మంచి-చెడు మధ్య తేడాను పసి పిల్లలు అర్థం చేసుకోలేరు. కాస్త కటువుగా చెప్పే ప్రతి మాటా వారికి తిట్టుగానో, నిందగానో అనిపిస్తుంది. అందుకే అటువంటి సందర్భాల్లో పిల్లలకు మీ ఆదేశాల వెనకున్న ఆంతర్యాన్ని ప్రేమగా, ఓపికగా చెప్పాలి. అప్పుడే పేరెంట్స్ చెప్పేది మన మంచికేననే విషయం చిన్నారులకు బోధపడుతుంది. పిల్లలకు సంబంధించిన ఏ మార్పు అయినా కాలానుగుణంగా రావాలి తప్ప రాత్రికి రాత్రే రాదు. అందుకే పిల్లల వైఖరి, అలవాట్ల విషయంలో ఒక్కసారిగా వారిలో మార్పు రావాలను కోవటం, మార్పు ఆశించడం పొరపాటు. మనది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. కాబట్టి ఇంట్లోని పిల్లల్ని అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వంటి వారితో పోల్చటం బాగా కనిపిస్తుంది. ఆహారం తీసుకోవటం, ఆటలు ఆడటం వంటి విషయాల్లో తోటి వారితో పోల్చినప్పుడు పిల్లలు ఆనందంగా ఆయా అంశాల్లో పోటీ పడతారు. పాజిటివ్‍ ఆలోచనలు, ప్రేరణ కలిగించే ఈ తరహా పోలిక మాదిరిగానే అన్ని అంశాల్లో పోలిక తెస్తే ఇబ్బంది ఉండదని పేరెంట్స్ గుర్తుంచుకోవాలి. ఉదయం నుంచి పడుకోబోయే వరకూ పిల్లలని ప్రతి విషయంలో తోటి వారితో పోలిస్తే, వారిలో ప్రతికూలమైన ఆలోచనా విధానం ఏర్పడి, ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు. కొత్త వారితో చొరవగా కలవలేకపోవటం, ఒంటరితనానికి అలవాటు పడతారు. తరచూ తోబుట్టువు లతో పోల్చడం వల్ల పిల్లల్లో ఆత్మన్యూనతా భావం పెరిగి నిరాశలో కూరుకు పోతారు. ఇది మొండితనానికీ, తప్పించుకు తిరిగే ధోరణికీ దారితీస్తుంది. పిల్లలు పరస్పరం పోట్లాడుకుంటే పేరెంట్స్ ఒకరి పక్షం వహించొద్దు. ఇలా చేస్తే రెండో పిల్లాడికి మీ మీద, తోబుట్టువు మీద ద్వేషం కలుగుతుంది. ఇద్దరు పిల్లలున్నప్పుడు కూడా ఒకరిని తిట్టడం మరొకరిని పొగడటం లాంటివి చేయకూడదు.

ఏం పెడుతున్నారు? ఏం తింటున్నారు?
తమకందే పోషకాహారాన్ని బట్టే పిల్లల్లో శారీరక, మానసిక పెరుగుదల ఉంటుంది. లేదంటే రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు చుట్టుముడుతాయి. ముఖ్యంగా బడి పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్: విద్యార్థుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్ ముఖ్యం. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గాయాలు తగిలినా ప్రొటీన్‍ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. ఇవి శక్తినిస్తాయి. జీవనశైలికి శక్తి ఎంతో అవసరం. పిండి పదార్థాలు విద్యార్థులకు గ్లూకోజ్‍లా పనిచేస్తాయి. చిరు ధాన్యాలు, బియ్యం, గోధుమలు, రాగులు వంటి వాటిల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి.
మినరల్స్: మినరల్స్ తక్కువగా ఉండడంతో విద్యార్థుల్లో ఎముకలు, దంతాల పెరుగుదల నిలిచిపోతుంది. రక్తస్రావం త్వరగా అదుపులోకి రాదు. నాడీ వ్యవస్థ చైతన్యం కోల్పోతుంది. కండరాలు పని చేయవు. జీవక్రియ మెతకబడుతుంది. శారీరక, మానసిక స్థిరత్వానికి మాంసం, కోడిగుడ్లు, చేపలు, పాలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, రాగులు, కర్జూరా, బాదం, ఖాజు బాగా తినిపించాలి.
కొవ్వు పదార్థాలు: కొవ్వు పదార్థాలతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. శరీరంతో పాటు లోపల ముఖ్య భాగాలైన మూత్రపిండాలు, గుండెకు రక్షణ కవచాల్లా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్నవారు వాతావరణంలో మార్పులు తట్టుకోలేరు. మాంసం, వెన్న, నెయ్యి, పాలు, పల్లి నూనె శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కొవ్వు పెరిగి అది ఎముకలకు రక్షణగా నిలుస్తుంది.
మొలకెత్తిన విత్తనాలు: మొలకెత్తిన విత్తనాలు తినడం చాలా మంచిది. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెసర్లు, శెనగలు, రాగులు, బొబ్బర్లు, పల్లీలు, కర్జూరా… వీటిని రాత్రి తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. తెల్లవారేసరికి మొలకలు వస్తాయి. వాటిని ప్రతి రోజూ పిల్లలకు తినిపించాలి. ఇవి మార్కె ట్లోనూ విరివిగా దొరుకుతాయి.
గుడ్డు: కోడి గుడ్డు పిల్లలకు ఆరోగ్య ప్రదాయిని. రోజుకు ఒక గుడ్డు చొప్పున తినిపిస్తే వారి ఆరోగ్యానికి భరోసా లభించినట్టే. కోడి గుడ్డులోని తెలుపు తినిపిస్తే పిల్లలకు కొవ్వు లభిస్తుంది.
అయోడిన్‍: అయోడిన్‍ లోపిస్తే అనారోగ్యం తప్పదు. థైరాయిడ్‍ హార్మోన్లు ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయోడిన్‍ తక్కువైతే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దీంతో విద్యార్థులు చదివినవి గుర్తుంచుకోలేరు. జింక్‍ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయలతో చేసినవి తినిపించాలి.
ప్రేమే దివ్య ఔషధం
పిల్లలు కాసింత నలతగా ఉంటే తల్లిదండ్రులూ డీలా పడిపోతారు. పిల్లకోలుకునే వరకు విలవిల్లాడిపోతారు. అయితే, పిల్లలు త్వరగా కోలుకునేది మన చేతిలోనే ఉంది. అందుకు ప్రేమే దివ్యౌషధం. పిల్లలు అనారోగ్యం పాలవగానే కంగారు పడకండి. ఏమీ కాలేదు, త్వరగానే తగ్గిపోతుంది అని ధైర్యం చెబుతుండాలి. పెద్దలు హైరానా పడితే తమకేదో అయిపోయిందనుకుని పిల్లలు ఇంకా నీరసించిపోతారు. అనారోగ్యం ఎందుకు వచ్చిందో ముందు అంచనా వేయాలి. తద్వారా ఏం చేయాలో డాక్టర్ని కనుక్కోవాలి. మందులు వేసుకోవడానికి పిల్లలు నానా యాగీ చేస్తారు. అలా అని బలవంతం చేసి, ఏడిపించి వేయకూడదు. మందులు ఎందుకు వేసుకోవాలో వివరించాలి. లేచి ఆడుకోవాలంటే అవి అవసరమని చెప్పండి. ఏ పద్ధతిలో వేస్తే వాళ్లకు ఇబ్బందిగా ఉండదో ఆలోచించి అలా చేయాలి. ఆహారం విషయంలో జాగ్రత్త. పిల్లలు ఫుడ్‍ దగ్గర టెంప్ట్ అయిపోతారు. తినకూడనివి తినేస్తారు. కాబట్టి కన్నేసి ఉంచాలి. అనారోగ్యం బారిన పడినప్పుడు పిల్లల్ని నచ్చినట్టు ఉండనివ్వాలి. టీవీ చూడటం, పెయింటింగ్‍ వేయడం, ఒళ్లు అలసిపోకుండా ఏం చేస్తానన్నా చేయనివ్వండి. మైండ్‍ రిలాక్స్ అయితే త్వరగా కోలుకుంటారు. అనవసర విషయాలు మాట్లాడ కూడదు. ‘నువ్వు అలా చేశావు, అందుకే ఇలా అయ్యింది’ అనకూడదు. ‘స్కూలు పోతోంది, త్వరగా కోలుకోవాలి’ అంటూ ఒత్తిడి చేయవద్దు. ఎక్కువసేపు వాళ్లతో గడపాలి. మనం చూపించే ప్రేమ అన్నిటి కంటే పెద్ద మందు. కబుర్లు చెప్పండి. వాళ్లతో కలిసి ఆడి పాడి నవ్వించండి. అనారోగ్యం పాలవ్వడం వల్ల మనకి ఎంత నష్టమో, కోలుకునే వరకూ ఎన్ని మిస్సయి పోతామో వాళ్లకు చక్కగా ప్రేమగా వివరించండి. దానివల్ల ఆరోగ్యంపై పిల్లలకు శ్రద్ధ పెరుగుతుంది.

నిద్రలోనూ తోడుగా..
చాలామంది పిల్లలు సరిగ్గా నిద్రపోరు. దానివల్ల పిల్లలకు, పెద్దలకూ ఇబ్బందే. పిల్లలలో నిద్రలేమి, భవిష్యత్తులో కూడా వారిలో అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. కాబట్టి పిల్లలు నిద్రపోయేందుకు ఒక సమయాన్ని అలవాటు చేయాలి. అంతేకానీ వారే అలసిపోయి పడుకుంటారులే అనుకోవద్దు. నిజానికి అలసిపోయి పడుకునే పిల్లలు నిద్ర మధ్యలో లేచే సందర్భాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లల పక్కని కానీ, పడుకునే ప్రదేశాన్ని కానీ, అక్కడి వెలుతురిని కానీ తరచూ మార్చడం మంచిది కాదు. పిల్లలు ప్రశాంతంగా నిద్రలోకి జారుకునేలా ఒకే తరహా వాతావరణాన్ని కొనసాగించాలి. నిద్రపోయే ముందు స్నానం చేయించడం, కథలు చెప్పడం, జోల పాటలు పాడటం వల్ల పిల్లలు తొందరగా నిద్రలోకి జారుకుంటారు. పిల్లలు నిద్రపోయేటప్పుడు తమ పక్కన ఏదన్నా బొమ్మనో, బొంతనో ఉంచుకోవడాన్ని గమనించవచ్చు. ఇది మంచి అలవాటే అంటున్నారు నిపుణులు. ఇలా ఏదో ఒక వస్తువుతో వారి అనుబంధం వల్ల, పిల్లలు ఒక సురక్షితమైన భావనలో ఉంటారట. తద్వారా ప్రశాంతంగా నిద్రపోతారు. పిల్లలు తమంతట తాము నిద్రలోకి జారుకునేలా అలవాటు చేయడం మంచిది. దానివల్ల రాత్రిళ్లు ఉలిక్కిపడి లేచినా.. తనంతట తానుగా మళ్లీ నిద్రపోగలడు. పిల్లలు వేరే గదిలో పడుకుంటే, వారిని మధ్యమధ్యలో గమనిస్తుండాలి. పిల్లలు ఉలిక్కిపడి లేచినట్లు అనిపిస్తే, శరీరాన్ని తట్టాలి. ధైర్యం చెబుతూ బుజ్జగించాలి. దీనివల్ల అవసరం వచ్చినప్పుడు అమ్మానాన్న తమ పక్కనే ఉంటారనే భద్రతా భావం వారికి ప్రశాంతతని కలిగిస్తుంది. పిల్లలని వేరే గదిలో ఉంచడం అనేది ఒక్కసారిగా చేయడం మంచిది కాదు. ముందు పిల్లలు తమంతట తాము పడుకునే అలవాటు చేయాలి. ఆపై కనుచూపు మేరలో ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించాలి. అవసరమైనప్పుడు మీరు తమ పక్కనే ఉంటారన్న భద్రతని అందించాలి. అప్పుడే పిల్లల్ని వేరేచోట పడుకోపెట్టే ప్రయత్నం చేయాలి.

ముక్కు మీద కోపం.. అందరికీ ముప్పు
కొన్ని కుటుంబాల్లో అరవడం, కొట్లాడటం వంటివి తరచూ జరుగు తుంటాయి. కోపాన్ని అదుపు చేసుకోలేని వారు తమ పిల్లలకు మంచి పెంపకాన్ని, మంచి భవిష్యత్‍ను అందించలేరు. పిల్లలకు నాణ్యమైన పెంప కాన్ని అందించి వాళ్లకు అద్భుతమైన జీవితాన్ని కానుకగా ఇవ్వాలంటే ముందు తల్లిదండ్రులు భావోద్వేగాలను అదుపు చేసుకోవడం నేర్చుకోవాలి. కోపాన్ని అదుపు చేసుకోలేని కుటుంబాలలో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక ఉద్వేగాలను అదుపు చేసుకోలేని వారిగా తయారవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. పిల్లల విషయంలో కోపం తాలూకూ ఫలితాలు మరింత దారుణంగా ఉంటాయి. కోపంతో పసిపిల్లల లేత మనసులు గాయపడతాయి. కోపంలో తల్లిదండ్రులు చేసే శారీరక, మానసిక హింస వాళ్లను జీవితాంతం వెంటాడుతుంది. కోపాన్ని అదుపు చేసుకోవడం ఎలాగో ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి. కోపం తెప్పించే విషయాలకు దూరంగా ఉండటం, కోపం వస్తున్నట్టు అనిపిస్తే ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవడమో లేక నంబర్‍ కౌంటింగ్‍ టెక్నిక్‍ అప్లై చేయడమో చేయాలి. చాలా సందర్భాల్లో పిల్లలు కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ , మొండిగా ఉంటూ తల్లిదండ్రుల సహ నానికి పరీక్ష పెడుతుంటారు. అటువంటప్పుడు కోపాన్ని నియంత్రించు కోవడమే కాక పిల్లలు అలా ప్రవర్తించకుండా కట్టడి చేసే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారని, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని పేరెంట్స్ ఎమోషనల్‍ ఫీల్‍ అయి కోపం తెచ్చుకోవద్దు. కోపం వచ్చే సందర్భాలు, అది రాకుండా నియంత్రించుకోగల నేర్పును వారికి ఓపికగా చెప్పాలి. కోపం వస్తే ఎలా నియంత్రించుకోవాలో, అలా చేయకపోతే జరిగే పర్య వసానాలేమిటో వివరించాలి. పిల్లలకు కోపం దుష్పరిణామాలు ఎలా ఉంటాయో చెబుతూనే అదే సమయంలో తాము కోపాన్ని జయించేందుకు పేరెంట్స్ ప్రయత్నించాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులనే ఆదర్శంగా తీసుకుంటారు.
మన ఆశల్ని పసిమనసులపై రుద్దొద్దు
తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కలలు కంటుంటారు. అయితే అది పిల్లల్ని ఒత్తిడికి గురిచేసేలా ఉండకూడదు. ఈ విషయంలో పిల్లల ఆసక్తికి అను గుణంగా మాత్రమే ప్రోత్సహించాలి. ప్రతి ఒక్క రిలో సహజంగా ఏదో ఒక టాలెంట్‍ ఉంటుంది. కొందరికి బొమ్మలు గీయడం సరదా. ఇంకొం దరికి సంగీతజ్ఞానం ఇట్టే అబ్బుతుంది. ఇవి గుర్తించ కుండా పేరెంట్స్ తాము కన్న కలలను పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని చూస్తుంటారు. అందుకు తగ్గట్టుగా చిన్నప్పట్నుంచే వారిని ప్రభావితం చేస్తుంటారు. ఇది సరికాదు. ఖాళీ వేళల్లో పిల్లలు ఏం చేస్తున్నారనేది గమనిస్తే వారి ఇష్టాఇష్టాలు ఇట్టే తెలిసిపోతాయి. ఆడే ఆటలను బట్టి కూడా వారి భవిష్యత్‍ లక్ష్యాన్ని గుర్తించవచ్చు. కొందరు పిల్లలు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆటలే ఆడుతుంటారు. పిల్లలు టీవీలో ఎలాంటి పోగ్రామ్స్ ఎంజాయ్‍ చేస్తున్నారో కూడా గమనించాలి. ఇంట్లో మాత్రమే కాదు.. స్కూల్లోనూ పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందన్నది తెలుసుకుం టుండాలి. పాఠాలు సరిగా వింటున్నారా? ఏ సబ్జెక్ట్ను ఎక్కువగా ఎంజాయ్‍ చేస్తున్నారు? లేదా ఆటపాటల మీద ఆసక్తి కనబరుస్తున్నారా? వంటివి తెలుసుకోవాలి. మార్కులు ప్రతిభకు కొలమానం కాదు. అలాఅని ఎప్పుడూ మార్కులు తక్కువ వస్తుంటే మంచిదీ కాదు. ఆటపాటలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో.. చదువుకూ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారా లేదా చూడాలి. స్కూల్లో ఎలాంటి యాక్టివిటీసులో పిల్లలు పాల్గొంటున్నార్గో తెలుసుకోవడం ముఖ్యం. తోటి విద్యార్థులతో ఎలా ఉంటున్నారు?, ఏయే సమయాల్లో డల్‍గా ఉంటు న్నారు? అనేవి తెలుసు కోవాలి. ఈ తరం పిల్లల్లో చాలామంది మల్టీ టాలెంట్‍ కనబరుస్తున్నారు. తదనుగుణంగా వారిని ప్రోత్సహించాలి. పిల్లల ప్రవర్తన ఆధారంగా వారు ఏ రంగంలో రాణిస్తారో అంచనాకు రావొచ్చు. వాటిని చిన్నప్పుడే గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాకాక, పేరెంట్స్ తాము కోరు కున్నదే పిల్లలు కావాలని కోరుకుంటే.. పిల్లలు ఎటూ కాకుండా అయిపోతారు.

పొదుపు.. చిన్నప్పటి నుంచే అదుపు
పిల్లలు ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అందుకు తగిన అలవాట్లను చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలి. బాల్యం నుంచే పిల్లలకు నైతిక విలువలతో పాటు, డబ్బుకు సంబంధించిన అలవాట్లను అలవర్చాలి. పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ అలవరచడం చాలా అవసరం. డబ్బు విలువ తెలిసేలా చేయాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అడిగిందల్లా కొనిపెడుతుంటారు. దీని వల్ల పిల్లలకు డబ్బు విలువ తెలియదు. దీనివల్ల పెద్దయ్యాక అవసరం ఉన్నా లేకపోయినా ఏది పడితే అది కొని డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తారు. పిల్లలకు నెలసరి పాకెట్‍ మనీ ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేటపుడు ‘వచ్చే నెల వరకూ వీటితోనే సర్దుబాటు చేసుకోవాలి’ అని చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఒక నెల ఖర్చులనే రెండు నెలలకు సర్దుబాటు చేసుకునే పద్ధతిని అలవాటు చేసుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు చేతి ఖర్చుల కోసమని ప్రతి నెలా ఎంతో కొంత ఇస్తుంటారు. ఇదిగాక మధ్యలో ఏదైనా అడిగితే కొనిపెడుతుంటారు. ఇలా చేయకుండా… ఏదైనా చిన్న చిన్న బొమ్మల్లాంటివి కొనుక్కోవాలనుకుంటే ప్రతి నెలా చేతి ఖర్చుల కోసం నీకు ఇచ్చే డబ్బుల్లో పొదుపు చేసి కొనుక్కోవాలని చెప్పాలి. దీంతో వారికి చిన్నతనం నుంచే పొదుపు అలవాటవుతుంది. కష్టం విలువ తెలియడం కోసం పిల్లలకు చిన్న చిన్న పనులు అప్పగించాలి. వాటిని పూర్తి చేస్తే మంచి బహుమతులివ్వాలి. ఇలా చేయడం వల్ల వారికి కష్టం విలువ తెలుస్తుంది.

మాటలతో భవితకు బాటలు
అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడాలి. వారితో స్పీడుగా, హడావుడిగా మాట్లాడకూడదు. అప్పుడే వారు కూడా స్పష్టంగా మాట్లాడటం నేర్చుకుంటారు. పిల్లలతో మెల్లగా ఆగి ఆగి మాట్లాడాలి. స్పీడుగాగాని, తొందరపాటు కానీ వద్దు. పిల్లలు మాట్లాడడం ఆపే వరకు పెద్దవాళ్లు మాట్లాడకూడదు. పిల్లలు మాట్లాడుతుంటే ఏకాగ్రతగా వినాలి. వారు చెప్పే మాటలను నిజంగా వింటున్నామన్న భావనను వాళ్లలో కలిగించాలి. కుటుంబ సభ్యులంతా పిల్లలతో రోజూ కొద్దిసేపు మాట్లాడాలి. దీనివల్ల పిల్లలకు మెల్లగా మాట్లాడడం అలవాటవుతుంది. పిల్లలు చేసే పనులను మాటలతో వర్ణిస్తూ మెచ్చుకోవాలి. ఇలాచేస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోజూ కొంత సమయం పిల్లలకు కేటాయించాలి. వాళ్లతో కబుర్లు చెప్పాలి. ఆ సమయంలో టీవీ, ఐపాడ్‍, ఫోన్లు వంటివి దగ్గర ఉండొద్దు. నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడపడం తల్లిదండ్రులు అలవాటు చేసుకోవాలి. ఇది పేరెంట్స్, పిల్లల నడుమ ఉండే బంధాన్ని పటిష్టం చేస్తుంది.

పుస్తక పఠనంతో స•జనాత్మకత
పిల్లల్లో స•జనాత్మకత పెంచడంలో కథల పుస్తకాలు కీలకం. చిన్నచిన్న కథలు చెప్పాలి. ఆ కథల్లోని పాత్రలను బొమ్మలుగా గీయమని చెప్పాలి. వారి పుట్టిన రోజులకు, పండుగలకు పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలి. పిల్లలను సినిమాలకు, పార్కులకు మాత్రమే కాదు అప్పుడప్పుడు బుక్‍ ఎగ్జిబిషన్స్కు కూడా తీసుకువెళ్లాలి. ఇంట్లోనూ వారికి అందుబాటులో మంచి పుస్తకాలు ఉంచాలి. వీటన్నింటితో పాటు మరో ముఖ్యమైన విషయం .. ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కువగా గాడ్జెట్స్ వాడుతూ పిల్లలను మాత్రం వాటిని దూరంగా ఉండండి అని చెబితే వినరు. ఈ తరం పిల్లల్లో ఐక్యూ లెవల్స్ ఎక్కువ. వారి తెలివితేటలను, ఆలోచనాశక్తిని సరైన దారిలో పెట్టాలంటే వివిధ కళలలో శిక్షణ ఇవ్వాలి. వయసును బట్టి రకరకాల ఆటల్లో చేర్చాలి. డ్రమ్స్, బాల్స్ వంటి మ్యూజికల్‍ ఇనుస్ట్రుమెంట్స్, కలరింగ్‍, పెయింటింగ్‍, పజిల్స్.. వీటితో పిల్లల్లో ఏకాగ్రత, గ్రహణశక్తి పెరుగుతాయి. ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. సమస్యలను పరిష్కరించుకోవడం, ఆలోచనా ధోరణిని మెరుగుపరుచుకోవడం సాధ్యమవుతుంది.

చదువులో చేదోడువాదోడు
పిల్లల చదువుల విషయంలో కొందరు తల్లిదండ్రులు అతి జోక్యం చేసుకుంటుంటారు. మరికొందరు అసలు పట్టించుకోరు. ఈ రెండూ మంచివి కావు. చదువు విషయంలో పిల్లలని నిత్యం ప్రోత్సహిస్తూనే… వారి అభిరుచికి కూడా ప్రాధాన్యతనివ్వాలి. పిల్లలు తమ అభిరుచికి తగిన చదువుల్లో ముందుకు సాగేలా పెద్దలు ప్రోత్సహించటంతో బాటు అందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలి. కష్టమైన హౌంవర్కులో పెద్దలు తగినంత సాయం చేయాలి. పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్థ్యాలను మించిన ఫలితాలను తల్లిదండ్రులు ఆశించకపోవడం ఉత్తమం. ఏదైనా సమస్య వస్తే పిల్లల కోణం నుంచీ ఆలోచించాలి. పిల్లలకు పాఠ్యాంశాలే కాక, లోక జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయటం, కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్లటం వల్ల వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది. పిల్లలు చదువులో ప్రతిభ చూపినప్పుడు పెద్దలు దాన్ని గుర్తించి ప్రోత్స హించాలి. అప్పుడే తమ శక్తి సామర్థ్యాలపై మరింత గురి కుదురుతుంది. చదువు విషయంలో ఇతర పిల్లలతో పోల్చడం కాక సానుకూలమైన సలహాలివ్వటం, ప్రోత్సహించటం అవసరం. చదువుతోపాటు ఆటపాటలు ఉంటేనే వారు మంచి ఆరోగ్యాన్ని పొందగలరు గనుక పిల్లలు రోజూ కొంత సమయం ఆటలు, వ్యాయామం వంటి వాటికి కేటాయించేలా చూడాలి. పిల్లల లేత మనసులో వచ్చే సందేహాలను వారికి అర్థమయ్యే భాషలో వివరించి వారిని సంత•ప్తిపరచాలి తప్ప విసుక్కోరాదు. అలాచేస్తే పిల్లల ఆలోచన, ఆసక్తి, జిజ్ఞాస సన్నగిల్లుతాయి. పిల్లలు ఒక సబ్జెక్టులో వెనుకబడటానికి కారణాలు అవగాహన చేసుకొని, ఇంట్లో బోధిస్తూ, ఆ సబ్జెక్టులో ఇష్టాన్ని పెంచుకునేలా, పెద్దలు శిక్షణనివ్వాలి. దీనివల్ల పిల్లలు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ఉంటారు.

అమ్మానాన్నా.. పిల్లలు.
ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త ఫ్రాయిడ్‍ ఇలా అంటారు – ‘అమ్మనాన్న ప్రేమకు పరిమితులు ఉండకపోవచ్చు. కానీ, లక్ష్యం మాత్రం తప్పనిసరిగా ఉండాలి’.
మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తల్లిదండ్రుల పెంపకం తీరు మారాలి. ఇద్దరు లేదా ముగ్గురు అన్న సంతాన సూత్రం ప్రస్తుత ఆధునిక పరిస్థితుల కారణంగా ఒక్కరు చాలన్నట్టు మారింది. ఉన్న ఒక్క బిడ్డను చదివించి, బంగారు భవిష్యత్‍ అందిస్తే చాలన్న ఆలోచనతో నేటి తల్లిదండ్రులు ఉన్నారు. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకుంటున్నారు. తాము పడిన కష్టాలు పిల్లలు పడకూడదనేది చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. అందువల్లే పిల్లలకు అన్నీ సమకూర్చి పెడతారు. సంపాదించేది పిల్లల కోసమే కదా అంటూ డబ్బుల విలువ తెలియకుండా పెంచుతారు. అడిగినవన్నీ కాదనకుండా శక్తికి మించిన సౌకర్యాలు కల్పిస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తమ పెంపకం ద్వారా సమాజానికి ఎలాంటి పౌరుడిని అందించామన్నది లెక్కలోకి తీసుకోరు. అతి ప్రేమ వల్ల పిల్లల్లో గారాబం, పెంకితనం, ఇగో పెరుగుతాయని అంటున్నారు మానసిక నిపుణులు. ఇలాంటి సమస్యలు పిల్లల ప్రవర్తనలో రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత మనుషులతో మాట్లాడటం కన్నా ఫోన్లో మాట్లాడే సమయమే ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోనూ చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో కాకుండా టీవీ, కంప్యూటర్‍, లాప్‍టాప్‍•, ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఇది తగదు. ఇంట్లో ఉంటే వీలైనంత వరకు పిల్లలతో గడపాలి. పిల్లలు ప్రతి విషయాన్ని గమనిస్తారు. వారు చూసిన, తెలుసుకున్న విషయాలు అమ్మనాన్నతో చెప్పాలని ఉబలాటపడతారు. చాలామంది పిల్లలు బడి నుంచి రాగానే ‘అమ్మా’ అంటూ ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలు, కొత్తగా తెలుసుకున్న విషయాలు ఏకరువు పెడతారు. వాళ్లు చెప్పేవి జాగ్రత్తగా వినాలి. వారి మాటలు ఓపికగా వినడం వల్ల వారి ఆలోచన విధానం అర్థమవుతుంది. పిల్లల అభిరుచులు, ఆసక్తుల్ని గమనించడానికి ఆస్కారం కలుగుతుంది.
పిల్లలకు అన్ని విషయాలూ కొత్తవే. పరిసరాలను గమనిస్తూ పెరుగుతారు. మంచీ చెడూ తెలుసుకోలేని వయసు వారిది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్లు, టీవీ, కంప్యూటర్లు, ట్యాబ్లు పిల్లలను ఆకర్షిస్తాయి. అమ్మనాన్న ఇద్దరూ ఉద్యోగస్తులుగా ఉన్న ఇంట్లో పిల్లల కాలక్షేపం వీటితోనే. అలాంటి సందర్భంలో పిల్లలు ఏం చూస్తున్నారో గమనించాలి. వారికి ఖాళీ సమయం ఎక్కువ ఉండకుండా పుస్తక పఠనం అలవాటు చేయాలి. వారి స•జనాత్మకతను పెంచేలా సంగీతం, నాట్యం, చిత్రకళ వంటి కళలు నేర్పించాలి.
చాలామంది తల్లిదండ్రులు చేసే పొరబాటు- వాళ్ల ఎదుటే గొడవపడటం. ఇది పసి మనసులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పిల్లల్లో ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. ఇతర పిల్లల్ని కొట్టటం, తోటి పిల్లల వస్తువులు తీసుకోవడం వంటి అల్లరి పనులు చేస్తే మందలించాలి. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపాలి. వారికి దగ్గరగా కూర్చొని కబుర్లు చెబుతూ, వారితో మాట్లాడాలి.
ఏ వ్యక్తికైనా విలువలే పునాది. ఆ విలువలను పిల్లలు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు తమ మాట వినడం లేదని అంటుంటారు. వాస్తవానికి పిల్లలు ఎల్లప్పుడూ కన్నవారి నడక, నడతను పరిశీలిస్తూనే ఉంటారు. పెద్దలు అబద్ధాలు ఆడుతూ, పిల్లల్ని మాత్రం నిజం చెప్పాలని హితబోధ చేయడం సరికాదు. అమ్మానాన్న చెప్పే మాటలకు, చేసే పనులకు మధ్య పొంతన లేకుంటే పిల్లలు క్రమంగా ప్రశ్నించడం మొదలుపెడతారు. పిల్లలకు నీతి, నైతిక విలువలు చెప్పడం కన్నా, తమ ప్రవర్తన, నడవడికతో వాటిని నేర్పించడం ముఖ్యం. మహనీయుల జీవితాల స్ఫూర్తిని పిల్లలకు కథలు, పుస్తకాల ద్వారా పరిచయం చేయాలి. వారిలో ప్రశ్నించే తత్త్వం పెంచాలి.
పిల్లల ఆలోచన శక్తి, పరిధి పెరిగిందనేది ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. కొందరు చిన్నపిల్లలు పెద్దపెద్ద విషయాలు మాట్లాడుతుంటారు. అలాంటి పిల్లలతో జాగ్రత్తగా మెలగాలి. వారితో వాదించడం వల్ల మొండిగా మారతారు. అలాకాకుండా వారు చెప్పే విషయాలను ఓపికగా వినాలి. వారి అభిప్రాయాలకు విలువనిస్తూ మాట్లాడాలి. మెల్లగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. బెదిరించినా, వాదించినా పిల్లలు మాట వినరు. ప్రేమతో చెబితే మాత్రం అర్థం చేసుకుంటారు. ఎప్పుడూ చదువే అనకుండా ఆటలకూ సమయమివ్వాలి

Review భళారే.. బాల్యం..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top