అట్లాంటాలో మార్చి 23న విజయవంతంగా ఉచిత హెల్త్ సెమినార్.
చిన్న ఆలోచనలే పెద్ద సంకల్పానికి బీజం వేస్తాయి. అందుకు ఉదాహరణ.. మార్చి 23న అట్లాంటా బిర్యాని పాట్ రెస్టారెంట్‍లో నిర్వహించిన హెల్త్ సెమినార్. ఎందరికో ఆరోగ్యంపై కొత్త అవగాహనను కలిగించడానికి ఈ సెమినార్ దోహదపడింది. అసలు విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో హృద్రోగాలతో ఆకస్మిక మరణాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇటువంటి మరణాలను నివారించలేమా?, అందుకోసం ఎటువంటి ముందు జాగ్త్రతలు తీసుకోవాలి? ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సెమినార్ నిర్వహించాలని ‘గ్రేర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (గేట్స్) సంకల్పించింది.
ఇదే విషయమై ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు, అట్లాంటాలో దయార్ద్ర హృదయులుగా పేరొందిన డాక్టర్ శ్రీని ఆర్ గంగసానిని ‘గేట్స్’ సంప్రదించింది. ‘గేట్స్’ ఆలోచనను అభినందించిన డాక్టర్ గంగసాని.. సెమినార్‍లో పాల్గొనేందుకు తన సంసిద్ధతను తెలిపారు. అయితే, హృద్రోగానికి, డయాబెటిస్‍కు దగ్గరి సంబంధం ఉందని, కాబట్టి సదస్సును హృద్రోగానికే పరిమితం చేయవద్దని, డయాబెటిస్ గురించి కూడా సెమినార్‍లో చర్చించడం మంచిదని ఆయన సూచించారు. అలాగే, అట్లాంటాలోని మరో సుప్రసిద్ధ వైద్యురాలు డాక్టర్ విజయ సుధ గున్నా కూడా సెమినార్‍లో పాల్గొనేందుకు అంగీకరించారు.
డయాబెటిస్, హృద్రోగాలు భారతీయులను అంతగా ఎందుకు కలవరపెడుతున్నాయి?
హృదయ సంబంధ వ్యాధులను ముందు గానే ఎలా గుర్తించాలి?
జీనవ నాణ్యత పెరిగేందుకు డయాబెటిస్, హృద్రోగాలను ఏ విధంగా నియంత్రించాలి?..
ఈ మూడు ప్రధానాంశాలుగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ.. అట్లాంటాలోని బిర్యానీ పాట్ రెస్టారెంట్‍లో మార్చి 23న సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఉచిత హెల్త్ సెమినార్ నిర్వహించింది. ఇందులో కార్డియాలజీ, ఎండోకెనాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీలలో నిపుణులైన, అనుభవజ్ఞులైన ఫిజీషియన్లు డాక్టర్ శ్రీని ఆర్ గంగసాని, ఎం.డి. (కార్డియో వాస్కులార్ గ్రూప్), డాక్టర్ విజయసుధ గున్నా (జార్జియా పీసీలోని ఎండోక్క్రెనాలజీ అండ్ డయాబెటిస్), డాక్టర్ రాజశేఖర్ ఆర్ సప్పటి (జార్జియా ఇంటెస్టినల్ స్పెషలిస్ట్, జార్జియా) పాల్గొన్నారు. మొదట డాక్టర్ల గురించి క్లుప్త పరిచయంతో సెమినార్ మొదలైంది.
ముందుగా డాక్టర్ విజయసుధ గున్నా మాట్లాడుతూ.. డయాబెటిస్ రావడానికి గల కారణాలు, అది రావడానికి దోహదం చేసే అంశాలు, రిస్క్ ఫ్యాక్టర్స్, గణాంకాలు, డయాబెటిస్‍ను అదుపులో ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారం, షుగర్ పాళ్లను తెలుసుకోవడానికి ఉపకరించే పరికరాలు వంటి వాటి గురించి క్షుణ్ణంగా వివరించారు.
డాక్టర్ గంగసాని మాట్లాడుతూ.. హృదయ సంబంధ వ్యాధులు రావడానికి దారి తీసే కారణాలు, హృద్రోగాలు ఎలా ప్రబలుతున్నాయి? హార్ట్ అటాక్ లక్షణాలు, ఛాతీ నొప్పి – గుండెపోటుకు మధ్య గల తేడాలు? మామూలు ఛాతీ నొప్పి అని తేలికగా తీసుకునే అంశాలు, గుండెపోటుకు ఎలా తలుపులు తీస్తాయి? ఏయే అంశాలతో కలిసి ఉండే ఛాతీనొప్పిని గుండెపోటుగా నిర్ధారించాలి? అందుకు చేయించు కోవాల్సిన పరీక్షలేమిటి? గుండెపోటును ఏ విధంగా నివారించవచ్చు?, గుండెపోటు వచ్చిన వారు పాటించాల్సిన ఆహార నియమాలు?, జీవనశైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాల గురించి వివ రించారు.
మొదట నిర్ణయించిన ప్రకారం డయాబెటిస్, హృద్రోగాల గురించి మాత్రమే సెమినార్ నిర్వహించాలని అనుకున్నా.. ఇటీవల అమెరికాలో పెద్ద పేగు క్యాన్సర్ మరణాలు కూడా పెరుగుతున్న క్రమంలో.. దానిపై కూడా ప్రజల్లో అవగాహన పెంచాలని, అందుకు తనవంతుగా సహకరిస్తానని డాక్టర్ రాజశేఖర్ ఆర్.సప్పాటి, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (పేగుల వ్యాధుల నిపుణులు, జార్జియా) స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అనంతరం ఆయన పెద్దపేగు క్యాన్సర్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనివల్ల సెమినార్‍కు హాజరైన వారికి ఎన్నో కొత్త విషయాలు తెలిసి వచ్చాయి. కొలోన్ క్యాన్సర్, ఇతర క్యాన్సర్లకు మధ్య గల తేడాలేమిటి? ప్రాథమిక దశలోనే కొలోన్ క్యాన్సర్‍ను గుర్తించేందుకు ఎటువంటి వైద్య పరీక్షలు చేయించాలి? కొలోన్ క్యాన్సర్ లక్షణాలేమిటి?, నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి? చికిత్స ఎలా పొందాలి? వంటి విషయాలపై స్లైడ్స్ ద్వారా డాక్టర్ రాజశేఖర్ తెలియ చెప్పిన అంశాలు ఆరోగ్యంపై అందరికీ అవగాహన కలిగించాయి.
మొత్తానికి.. రిస్క్ ఫ్యాక్టర్స్, నివారణ చర్యలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు వంటివి పై మూడు వ్యాధుల్లోనూ ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయనే విషయం ఈ సెమినార్ ద్వారా వెల్లడైంది. ఆహూతులను ఈ ఆరోగ్య సదస్సు ఎంతో విజ్ఞానవంతులను చేసింది. ఆసక్తి కలిగించింది. ఇటీవల కాలంలో హఠాన్మరణాలకు కారణ మవుతున్న ఈ మూడు వ్యాధుల గురించి తెలిపేందుకు, వాటిపై అవగాహన కలిగించేందుకు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ముందుకు వచ్చిన వైద్య బృందానికి ఆహూతులు ముక్తకంఠంతో అభినందించి ధన్యవాదాలు తెలిపారు.
తమ తమ రంగాల్లో విశేష ప్రావీణ్యం కలిగి, తమ వృత్తి, ఉద్యోగాలతో క్షణం తీరిక లేకుండా ఉంటే ఈ ముగ్గురు వైద్యులు శనివారం సాయంత్రం తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఆయా వ్యాధులపై అవగాహన కలగించిన డాక్టర్ గున్నా, డాక్టర్ గంగసాని, డాక్టర్ రాజశేఖర్‍ను ‘గేట్స్’, అభినందించింది. అనంతరం గేట్స్ కార్యనిర్వాహక బృందం వైద్యులను ఘనంగా సత్కరించింది.
ఈ కార్యక్రమంలో గేట్స్ ప్రెసిడెంట్ తిరుమల్ రెడ్డి పిట్టా, చైర్మన్ అనిల్ బొద్దిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాహుల్ చిక్యాల, జనరల్ సెక్రటరీ కిషన్ తాళ్లపల్లి, ట్రెజరర్ అనిత నెల్లుట్ల, జనార్దన్ పన్నెల, ఈవెంట్స్ సెక్రటరీ సునీల్ కె.గొట్టోర్, కల్చరల్ సెక్రటరీ శ్రీనివాస్ పర్సా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సతీష్ నందాల, రామాచారి నక్కెర్తి, శ్రీధర్ నేలవల్లి, గణేశ్ కాసం, చలపతి వెన్నెమనేని, రఘు బండా, చిత్తరి ప్రభ పాల్గొన్నారు.
ఆహూతులందరికీ చక్కని ఆతిథ్యాన్ని అందించిన బిర్యానీ పాట్‍కు ‘గేట్స్’ బృందం ధన్యవాదాలు తెలిపింది.
ఈ సెమినార్ నిర్వహణలో.. ఇన్ఫో స్మార్ట్ టెక్నాలజీస్ ఇంక్ (ఐఎస్‍టీ), స్ప్లాష్ బీఐ, రాపిడ్ కార్డియో వాస్కులర్ గ్రూప్, ఎకోవ్యూ, సాఫ్ట్పాథ్ సిస్టమ్, రెడ్డి సి.పి.ఎ, ఓర్పిన్ తదితర సంస్థలు పాలుపంచుకున్నాయి.
అలాగే, వైద్యులు డాక్టర్ వెంకట్ వీరనేని, డాక్టర్ సతీశ్ చేటి, రాహుల్ చిక్యాల సెమినార్ నిర్వహణకు సహకరించారు.
Review డయాబెటిస్, హృద్రోగాలపై అవగాహనకు ‘గేట్స్’ యత్నం గ్రేట్.