పసిపాప పరమగురువు

తల్లీ బిడ్డల సహజీవనంలోని ఆధ్యాత్మిక బంధాన్ని అవగాహన చేసుకున్న వారికి ఏ మతగ్రంధమూ పఠించవలసిన అవసరం రాదు. ఏ ప్రవర్త బోధలతోనూ పనిలేదు. బాల్యమనే బంతిపువ్వు, అమాయకత్వపు కొమ్మతో భగవంతుడనే మొక్కను గట్టిగా పట్టుకుని ఉంది. అందుకే పిల్లలూ, దేవుడూ కల్లకపట మెరుగని కరుణామయులని కవులు కొనియాడారు.

ఒకవైపు, ఏమీ తెలియని పాప అమాయ కత్వం, మరొక వైపు అన్నీ తెలిసిన అమ్మ జ్ఞానం. ఈ విరుద్ధద్వంద్వాల వింతబంధం అవగాహన చేసుకుంటే సృష్టిలోని అన్ని ద్వంద్వాల మధ్యనున్న ఆధ్యాత్మిక రహస్యం అర్ధమౌతుంది. మానవజాతికి ఎదురయ్యే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. తల్లీబిడ్డల అనుబంధం దేవునికీ, జీవునికీ మధ్యన గల సంబంధం.

పాపకు మాత్రమే అమ్మ స్వంతం. పాపకు మాత్రమే అమ్మపై స్వతంత్రం. పసికందుకు తల్లిని వెతికే అవసరం రాదు. అమ్మే పాపకు వెతికి అక్కున చేర్చుకుంటుంది. అమాయకపు పసిహృదయం చిన్నదవుతూ, ఆలోచించే మెదడు పెరుగుతున్న తరుణంలో అమ్మను వెతికే అవసరం పాపకు మొదలవుతుంది. అమ్మ ఎప్పుడూ మనతోనే ఉండాలంటే, తిరిగి మనం ఆ పసితనాన్ని అందుకోవాలి. మను షులుగా శారీరకంగా ఎదిగిన మనం, శిశువులుగా మానసికంగా ఎదగాలి.
ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చిన్నతనంలో ఎలా హాయిగా ఉయ్యాలలూగే వాళ్లమో! ఎన్నెన్ని నువ్వల పువ్వులు పూయించామో! ఊయల పసితనపు పారవశ్యలీల. ఊయల బాలల జన్మహక్కు పిల్లలకు ఉయ్యాలపై అంతమక్కువ దేనికో తెలుసా? పాలకడలిపై వటపత్రశాయిలా మాతృగర్భంలో ఊయలలూగిన తీపిగుర్తులు ఈ ఉయ్యాలను చూడగానే వారి స్మ•తిపథంలో మెదిలి గిలిగింతలు కలిగిస్తాయి. తొమ్మిది నెలలు అనుభవించిన ఆ హాయిని మళ్లీ పొందాలనే వాంఛ వీరిలో అంతర్లీనంగా ఉండి ఉయ్యాల ఇష్టపడతారు. ఉయ్యాల్లో ఊగే పాపకు చేరవలసిన ఒక చోటు లేదు.గమ్యం లేని గమనం ఉయ్యాలది. అందుకే అంత అద్భుత మైన ఆనందం పాపకు దక్కుతున్నది. కృష్ణుడు చెప్పిన అనాశ్రితకర్మఫలమంటే ఇదే. ఎక్కడికో చేరుకోవాలనీ, ఏదో చెయ్యాలనీ, మరేదో పొందాలనీ కాదు. కేవలం ఉయ్యాల ఊగటమే లక్ష్యం. కేవలం ఆనందమే పరమార్థం.

చెట్టుకు కట్టిన ఉయ్యాల మీద విలాసంగా కూర్చుని, రెండు చేతులతో అటూ ఇటూ ఉన్న రెండు గొలుసులు పట్టుకుని ఊగుతారు పిల్లలు. ఏ ఒక్క గొలుసు వదలినా కింద పడతారు. ఈ విశ్వవృక్షానికి వ్రేలాడుతున్న ద్వంద్వాల గొలుసులలో ఏ ఒక్కటి విడిచిపెట్టినా, పట్టు తప్పిపడిపోతాం. అందుకే ద్వంద్వాలను తిరస్కరించరాదు. అమ్మ రాగానే ఊగటం ఆపి, గొలుసులు వదలి పరుగు పరుగున (ద్వంద్వాల వంటి కాళ్లతో) అమ్మఒడి చేరతారు పిల్లలు. సాంత్వన పొందుతారు. అమ్మ ఒళ్లో వాలగానే గొలుసులతో పనిలేదు. కాళ్లతోనూ పనిలేదు. దైవం చెంతకు చేరేంతవరకే ద్వంద్వాలతో మనకు అవసరం. పరమాత్మ పొత్తిళ్లలో ద్వంద్వాతీత స్థితిలో పరవశించే సమయంలో వాటితో ఇక పనేముంది ?
ముద్దులన్నీ మూటకట్టిన పసిపాపల పాల నవ్వులు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక తల్లి విషయం వేరే చెప్పాలా? మురిసి, మురిసి తన్మయత్వంలో మునిగి తేలుతుంది. పాప పెదవులపై విరిసే చెదరని నవ్వులకోసం తల్లి ఏమైనా చేస్తుంది. అదికావాలి, ఇదికావాలని పాప పేచీ పెట్టవలసిన పనేలేదు. అడగకుండానే అమ్మ అన్నీ ఇస్తుంది. తనకిష్టమైన తియ్యని వంటకం తయారు చేస్తున్న వేళ తల్లిని ఏడిపిస్తే, తినటానికి పాపకే ఆలస్యమౌతుంది. మనకు అవసరమైనవన్నీ మరచిపోకుండా దైవం తయారు చేస్తున్నాడు. ఇవ్వాల్సిన సమయంలో ఇస్తాడు. తొందరపెడితే రావలసినవి ఆలస్య మౌతాయి. దైవంపట్ల మనకున్న చెదరని విశ్వాసం పెదవులపై చిందే చిరునవ్వుగా ప్రతిబింబించాలి.

పైకి ఎంత అల్లరిచేసినా, ఎంత అరచినా పసిమనసు లోపల నిర్మలమైన నిశ్శబ్దం నిండి ఉంటుంది. ప్రేమభరితమైన మౌనహృదయం, అనుక్షణం దరహాసం కురిపించే వదనం కలిగిన వ్యక్తి అధ్యాత్మికచక్రవర్తి. అతడు దైవానికై వెతకవలసిన పనిలేదు. దైవమే అతని కోసం వెతుకుతూ వస్తాడు.
జీవితంలోని చిక్కుముడులు, అలజడులు విశ్వనాటకకర్తచే రసపుష్టికోసం రచింపబడి నాయి. ఈ గండాలను దాటి గట్టుకు చేరే మార్గాన్ని ఉపదేశించే గురువులు పిల్లలు. బడిపాఠాలు మనం వాళ్లకు నేర్పిస్తున్నాం. బ్రతుకు పాఠాలు వాళ్లే మనకు నేర్పుతున్నారు. ప్రతి ఇంటికీ తన కానుకగా దైవమిచ్చిన భగవద్గీత, పసిపాప. పాప కదలికలు నటరాజు రూపకల్పన చేసిన అపురూప భంగిమలు. పసిబిడ్డ తన తల్లికి అనుసంధింపబడినట్టు, మనం దైవానికి అనుసంధింపబడి ఉందాం. దేవుని ఇష్టానికి సంతోషంగా లోబడినప్పుడు, విశ్వవిజ్ఞాన సర్వస్వం నుండి ప్రతిక్షణం ఒక్కోరహస్యం మనకు వివరింపబడుతుంది. అపరిమితమైన ఆనందం మనసు ముంచెత్తుతుంది. ఈ రుచిమరిగిన తర్వాత మిగిలిన రుచులన్నీ చప్పగా మారిపోతాయి.

శిశువు మనకు అసలు సిసలు గురువు, శిశువు సజీవ భగవద్గీత. పసిహృదయం మౌన పరిమళం వెదజల్లుతుంది. జీవిత పరమార్థం ఆనందమేనని పసిపాప తన బోసినవ్వుతో బోధిస్తుంది. మనం కోరవలసిన దేమీలేదని తానేమీ కోరకుండా తెలుపుతుంది. తల్లిపట్ల తిరుగులేని విశ్వాసంతో ఉంటుంది. తల్లిని అర్ధం చేసుకునేందుకు కనీసప్రయత్నం కూడా చెయ్యదు. కేవలం అమ్మకు చెంది ఉంటుంది. బాల్యానికి బలమైన శక్తి అమాయకత్వం. పసిపాప కంటిపాపలో పరమాత్మ దర్శనం లభిస్తుంది. ఒడిలోని దైవాన్ని వదిలి, గుడిలోని దేవునికై దేవులాడకండి. బుడి బుడినడకల ఆ మృదువైన పాదాలు వినిపించే వేదాలు వినండి. శిశువులు యోగీశ్వరులు. మన సాధనల పరమగమ్యం తిరిగి బాల్యాన్ని చేరుకోవడానికే! ఆ అమాయకత్వం మళ్లీ పొందటం కోసమే!!

Review పసిపాప పరమగురువు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top