భారత జాతి శంఖారావం. మోగింది ‘నమో’ మంత్రం.

గుక్క తిప్పుకోని వాగ్ధాటి.. మొక్కవోని
దేశభక్తి..
ఇల్లు లేదు.. సంసారం లేదు.. కానీ, గుండెల నిండా
ప్రేమ ఉంది.
ఆ ప్రేమను భరతజాతికి పంచాలనే, జాతి సేవలో తరించాలనే
సంకల్పం ఉంది.
అఖండ భారతావనికి ఆయన చౌకీదార్‍ (కాపలాదారు).
కానీ, ఆయన తనను తాను ఫకీరుగా అభివర్ణించుకుంటారు..
అశేష ప్రజానీకం గుండెల్లో ఆయన కొలువుదీరారు.
అందుకే దేశం యావత్తూ ‘నమో’ అంటూ స్తుతించింది.
భారత దేశానికి దశ, దిశ చూపే భావినేతను నీవేనని మరోసారి పట్టం కట్టింది.
నరేంద్ర మోదీ.. అఖండ మెజారిటీతో విజయం సాధించిన భారతదేశ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ‘తెలుగు పత్రిక’ అంతర్జాతీయ మాస పత్రిక ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది.
ఆయనకు దేశం పట్ల గల ప్రేమ, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం, నిరంతరం ఉప్పొంగే జాతీయభావం అమోఘం.
ఆయన తనను తాను ఫకీరునని చెప్పుకుంటారు.
ఆ ఫకీరు జోలెను దేశ ప్రజ ‘అధికారం’తో నింపేసింది.
సాహసోపేత నిర్ణయాలు.. మంచి చేయాలనే సంకల్పంతో ఎందాకైనా వేసే అడుగులు.. జాతీయవాదానికి వెన్నుదన్నుగా నిలిచే సిద్ధాంతాలు.. భారతదేశానికి ఒక కొత్త దశ, దిశను నిర్దేశించాయి. అవి మరింత మునుముందుకు కొనసాగాలని దేశమంతా కూడబలుక్కున్నట్టుగా అద్భుతమైన ప్రజాతీర్పునిచ్చింది.
ఇది కచ్చితంగా నరేంద్ర మోదీకి కొత్త శక్తినిచ్చింది.
యావత్తు దేశానికి స్ఫూర్తినిచ్చింది.
ప్రపంచంలో భారతావని కీర్తి ప్రతిష్టలను శిఖరాయమానం చేసిన నరేంద్ర మోదీ.. భారతజాతిని మరింత ముందుకు ఏకత్రాటిపై నడపాలని, పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తన ధ్యేయంగా చెప్పే ఆయనకు మరిన్ని శక్తి, సామర్థ్యాలను ఇవ్వాలని ‘తెలుగు పత్రిక’ ఆకాంక్షిస్తోంది.
దేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది.
ప్రగతి పరవళ్లు తొక్కుతూనే.. మరోపక్క విశృంఖల వాదం పెచ్చుమీరుతోంది. తీవ్ర భావజాలాలు దేశాన్ని సంఘర్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
వీటన్నిటినీ రూపుమాపి.. నవ యువ భారత్‍కు పునాదులు వేస్తానంటున్న నరేంద్ర మోదీకి భరతమాత పరిపూర్ణ శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ‘తెలుగు పత్రిక’ అభిలషిస్తోంది.
దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులు.. దేశమంటే ఆ మనుషుల భావాలు.. ఆకాంక్షలకు ప్రతిరూపం. వాటన్నిటినీ పరిపూర్ణంగా నెరవేర్చగల పట్టుదల, సంకల్పశక్తి సింహబలుడైన నరేంద్ర మోదీకి మాత్రమే సాధ్యమని దేశం నమ్మిక. అందుకు నిదర్శనమే ఆయనకు లభించిన విజయం. ఆ విజయం అందరి ఆకాంక్షలను నెరవేర్చాలనేది ‘తెలుగు పత్రిక’ అభిలాష.
-తెలుగు పత్రిక
యునైటెడ్‍ స్టేట్స్ ఆఫ్‍ అమెరికా.

Review భారత జాతి శంఖారావం. మోగింది ‘నమో’ మంత్రం..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top